Sunday, October 27, 2013

Saturday, October 26, 2013

స్వేచ్ఛ- కాశ్మీర తీరాలు!!!




ఎక్కడుంది స్వేచ్ఛ?? ఎక్కడ వెతకాలి? ఎప్పుడూ వెతుకుతూ ఉండే స్వేచ్ఛ...అందరూ వెతికే స్వేచ్ఛ...అందరికీ కావల్సిన స్వేచ్ఛ...ఎక్కడుంటుంది? ఏంటీ స్వేచ్ఛ? ఎందుకు మనమందరం ఈ స్వేచ్ఛ కోసం ఇంతలా వెతుకుతాం?

జీవితంలో ఎప్పుడో ఒకసారైనా ఈ స్వేచ్ఛ గురించి తపన పడకుండా ఎవ్వరూ ఉండరనుకుంటాను. ప్రతి వ్యక్తికీ ఒక చట్రం ఉంటుంది. తనకు తను ఏర్పరుచుకున్న చట్రం. పుట్టుక నుంచి చివరి ఊపిరి వరకు ఒక మాప్ గీసుకుని పయనం సాగిస్తున్నట్టు. ఎవరో మనకు దిశా నిర్దేశం చేసేసి, ప్రయాణపు టికెట్లు కొనేసి, బండి ఎక్కించి....ఇక్కడ దిగిపో అన్నట్టు. మధ్యలో వేరుశనగ పప్పులు, బజ్జీలు, సమోసాలు, నీళ్ళు, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్...భోజనం, నిద్ర....తోటి ప్రయాణికులతో మాటలు....దిగబెట్టే వారి దిగుళ్లు, గమ్యం గురించిన ఆందోళన, సంతోషం, భయం, ఆత్రం, మన వాళ్ళని వదిలి వెళ్తున్న బెంగ, మన సామాన్ల గురించి జాగర్త, ఎవరూ దొంగలించకుండా చైన్లు వెయ్యటం, తోటి ప్రయాణికులతో కబుర్లు, కాట్లాట్లు, చిరాకులు, ఆనందాలూ....అన్నీ ఎవరో నిర్దేశించినట్టు!!

గమ్యం వచ్చాక రైలు ప్రయాణం ఒక మెమరీ మాత్రమే, ఆదేలాంటి అనుభూతిని పంచినా!!!  మన జీవితం కూడా అంతేనా???

ఈ ప్రయాణంలో పడి, ఒక గమ్యం పట్టుకుని గుడ్డిగా వెళ్లిపోతూ...ఎప్పుడో ఒకసారి  ఉన్నట్టుండి ఒక ఆత్మావలోకనంలో పడిపోయి, నేను చెన్నై ఎక్స్ప్రెస్ ఎందుకు ఎక్కాలీ? నాకు అసలు కాశ్మీర్ వెళ్లాలని ఉంటే?” అనుకుంటాం... మళ్ళీ, “సర్లే ఏదో ఒకటి ఎక్కేసాం కదా, సర్దుకుని వెళ్లిపోదాం. కాశ్మీర్ సంగతి మళ్ళీ చూద్దాం అనుకుంటాం. ఆ చూడటం మళ్ళీ జరుగుతుందో లేదో తెలీదు.

మనసులో మాత్రం అప్పుడప్పుడూ కాశ్మీరం నిద్ర లేస్తూ ఉంటుంది. అలా మనసులో మెరిసే  కాశ్మీరాలే - పుస్తకాలు చదవటాలూ, వీణ నేర్చుకోవటాలు, క్రికెట్ ఆడటాలూ - ఇంకా ఇలాంటివే ఏవో, మన ఇష్టాలు, మనసుకి నచ్చిన పనులు. అన్నీ పిచ్చి ఆశల్లా, పిల్లవేషాల్లా మిగిలిపోయిన సుందర స్వప్నాలు. సుందర స్వప్నాలు కాబట్టే వీటిని కాశ్మీర తీరాలు అంటున్నాను!! ఈ స్వప్నాలు నిజం కావాలంటే మనం మనలా ఉండగల స్వేచ్ఛ కావాలి, తెగువ కావాలి....మన జీవితం పట్ల ఒక అవగాహనా సంతృప్తీ కావాలి...ఇవన్ని పరుగు పందెంలో ఉన్న మనకు అర్ధం కావటానికి సమయం పడుతుంది. చదువు, ఉద్యోగం....

చూస్తూ ఉండగానే పిల్లలూ, పాల డబ్బాలూ, పెద్దవాళ్ళైన తలిదండ్రులూ, సోదర సోదరీ బంధాలూ, ప్రేమలూ, తెగుళ్లూ, ఆవేశ కావేశాలు, పిల్లల చదువులూ, వాళ్ళ అమెరికా చదువులూ, ప్రయాణాలూ, దానికి కావల్సిన డబ్బూ దస్కం సమకూర్చుకోటాలూ,  ఆస్తులు సమకూర్చుకోటాలూ, బంగారాలూ, ఇళ్లూ కొనే ఝంఝాటాలూ, కొత్త కొడళ్లూ, అల్లుళ్లూ, మనమలూ మనమరాళ్ళు, ఎడతెగకుండా బాధ్యతలూ, భార్య భర్త సర్దుకు పోటాలూ, ప్రేమలు పంచుకోటాలూ, చిరాకులూ, అనారోగ్యాలూ, ఆనందాలూ.....ఒక ప్రవాహంలో పడి వెళ్లిపోతుంటాం...మధ్య మధ్య ఏదో గుర్తొస్తూ ఆగిపోతుంటుంది...ఏదో ఒక చిన్న కలవరం, ఏదో గుర్తుకు రాబోతున్నట్టు, మసక మసకగా మనసుని తాకుతూ, పలకరిస్తూ, పలవరిస్తున్నట్టు, నన్ను చూడూ, నాగురించి ఆలోచించూ, పట్టించుకో అన్నట్టు, అదేంటో తెలుసుకునే తీరికా ఓపికా రెండూ మనకు ఉండవు..మనం, మనకి మనమే నిర్దేశించుకున్న పరుగు పందెంలో, ఇంకొకరితో పోల్చితే మనం ఎక్కడున్నాం అనే లెక్కల్లో మునిగితేలుతూ ఉంటాం....కాలం కదలి పోతూ ఉంటుంది.....

ఉన్నట్టుండి ఒక రోజు మనకు, మన మనసుకు కొంచం తీరిక దొరుకుతుంది....నా కాశ్మీరం ఏది??? అన్న ప్రశ్న మళ్ళీ గుర్తొస్తుంది.

అసలేమిటీ కాశ్మీరం? అనుకుంటాం .

ఈ కాశ్మీరమే మనం వదిలేసిన స్వేచ్ఛ!!  అని గుర్తుకు వస్తుంది.

 నేను ఏదో చేద్దామనుకున్నాను, బట్ ఐ నెవర్ హాడ్ దట్ ఫ్రీడం!  ఇది మనకు తరుచూ వినిపించే మాట.  బయటకు చెప్పినా చెప్పక పోయినా ప్రతి వ్యక్తీ, ఏదో ఒక పరిస్థితిలో తనలో తను అనుకునే మాట. మనం చెయ్యాలని తపనపడి చేయలేక వదిలేసిన పనుల సమాహారమే ఈ కాశ్మీరం! అనేకానేక కళల పట్ల ఎంతో మక్కువ ఉన్నా వీటికి సంబంధం లేని ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకు నెట్టుకొస్తున్న సగటు జీవితాలు, సంపాదనే ధ్యేయంగా చదువులు , డాలర్ల వేటలో ఉద్యోగాలూ, అంతగా డాలర్లు సంపాదించలేకపోతే ఏదో ఒక ఉద్యోగం.....వృత్తికీ ప్రవృత్తికీ సంబంధం లేని జీవితాలు.....చాలామటుకు.

మన నిజ స్వరూపం ఆ స్వేచ్ఛ కాబట్టే మనల్ని, మన మనసుల్ని, ఆలోచనల్ని ఈ కాశ్మీరం వదిలిపెట్టదు. ఒక అందమైన ఊహా చిత్రంలా మనల్ని ఊరిస్తూ ఉంటుంది. మనం అనుకున్నది చేసేవరకూ, లేక పూర్తిగా మనల్ని మనం అర్ధం చేసుకునే వరకూ మనల్ని ఇది వదిలిపెట్టదు. అసంతృప్తిగా మారి వేధిస్తుందో, మరపు పొరల వెనక నిలిచి మనకేం కావాలో మనకే తెలియకుండా చేస్తుందో...అది వ్యక్తిత్వపు ఎదుగుదలని బట్టి ఉంటుంది.

 స్వేచ్ఛ చాలా విస్తృత పరిధి ఉన్న పదం...నేను కేవలం ఒక చిన్న సమస్య గురించి ప్రస్తావించాను ఇక్కడ. ఇష్టమైన పద్ధతిలో మనసుకు నచ్చిన పద్ధతిలో (ఇంకొకరికి, సమాజానికీ  హాని కలిగించకుండా) బ్రతకలేకపోవటమే స్వేచ్ఛని కోల్పోవటం. డబ్బు సంపాదన చాలా ముఖ్యం కానీ అస్తిత్వాన్ని మిగుల్చుకోటం ఇంకా ముఖ్యం, ఆనందాన్ని మిగిల్చుకోటం మరీ మరీ ముఖ్యం.

ఇవన్నీ మనం పొందాలంటే స్వేచ్ఛ కావాలి, మనకు మనం వేసుకున్న ప్రాక్టికల్ శృంఖలాలనుంచి స్వేచ్ఛ, మన మనసుకు మనం వేసుకునీ పూసుకున్న ఆలోచనలనుంచి స్వేచ్ఛ, ఎవరికోసమో, ఎవరిలాగానో బ్రతకటం నుంచి స్వేచ్ఛ, మనకు మన మనసుకూ నచ్చినట్టుగా ఉండటానికి కావల్సిన ధైర్యం - స్వేచ్ఛ!! 

మన మనసుకు నచ్చిన పనులు, మనకి ఆనందాన్ని ఇచ్చే పనులు అది ఓ పుస్తకం చదవటమో, ఒక మంచి సినిమా చూడటమో, ఒక మంచి పాట వినటమో, ఒక మంచి పెయింటింగ్ వెయ్యటమో....మనకూ అంటూ ఒక వ్యాపకం.... మనకు మనం ఏర్పరుచుకుంటూ, పిల్లలకూ నేర్పిస్తూ జీవితాన్ని అనుభూతించటం ఎంతైనా అవసరం.

మన మనసులో  దాక్కున్న కాశ్మీరాలకు ఊపిరిపొయ్యటం మన పట్ల మనకు ఉన్న బాధ్యత!!
మన మనసు హాయిగా స్వేచ్ఛగా చిర్నవ్వు నవ్వేలా చేయటం మన పట్ల మనకున్న బాధ్యత!!
జీవితాన్ని అనుభూతించటం, ఆనందంగా బ్రతకటం మన పట్ల మనుకున్న బాధ్యత!!

ఏమంటారు?







Wednesday, October 23, 2013

నేను నేనులో లేను...





అప్పుడెప్పుడో తుషార బిందువులో -
సప్త వర్ణాలై, ఇంద్ర ధనసులోకి విరిగిన
తొలి సూర్య కిరణపు లేలేత వెలుగులో,
ఒక వెలుతురు తునకనైపోయాను.....
ఒక వర్ణాంశమై కలసిపోయాను...
ఇప్పుడు నేను నేనుగా లేను...
నేను నేనులో లేను!!!

Tuesday, October 15, 2013

Sunday, October 13, 2013

రుబాయత్ ఒమర్ ఖయ్యాం!!!!



ఒమర్ ఖయ్యాం!!!!
చాలా మందికి తెలిసిన పేరు.
ఆయన రాసిన రుబాయత్ ల గురించి కూడా చాలా మందికి తెలుసు.
అందులోనూ ఆయన, జీవితాన్ని ఆనందించు అని నినదించిన విషయం
అందరికీ సుపరిచితమే!

వికీపీడియా నుంచి ఆయన చిత్రం:


 

ఒమర్ ఖయ్యాం రాసిన రుబాయత్ ల గురించి వినని వారు ఉండరేమో. అంతగా ప్రాచుర్యాన్ని పొందాయి అవి. నాలుగు పంక్తుల కవితలు ఇవి. అరబిక్ భాషలో రుబాయీ అంటే రెండు వాక్యాల లేక పంక్తుల కవిత, ఒక్కొక్క వాక్యనికీ రెండు భాగాలు ఉంటాయట. అంటే ఒక నాలుగు పంక్తుల కవిత, ఇంగ్లీష్ లో quatrains” రూపంలో రచింపబడ్డవే ఈ రుబాయత్ లు. వీటిని ఇంగ్లీష్ పాఠక లోకానికి పరిచయం చేసిన ఘనత ఎడ్వర్డ్ ఫిట్జ్ గెరాల్డ్ అనే రచయితకు దక్కుతుంది. 

నాకు నచ్చిన కొన్ని రుబాయత్ ల గురించి నాకు అర్ధమైనట్టు, నాకు తెలిసినట్టు రాస్తున్నాను. నేను ఇక్కడ ఉపయోగించిన రుబాయత్ లు ఎడ్వర్డ్ ఫిట్జ్ గెరాల్డ్ గారు తర్జుమా చేసినవి. ఈ రుబాయత్ లను ఇంగ్లీష్ లోకి చాలా మంది అనువదించరేమో కూడా.  ఇది సాధికారికంగా రాస్తున్న విశ్లేషణ కాదు, మనసుకు హత్తుకున్న కొన్ని పారిజాతాలను పరిచయం చేయటమే ముఖ్య ఉద్దేశం!!

ఒమర్ ఖయ్యాం కవితలలో అందం, భావుకత, సున్నితత్వం, జీవితం పట్ల మమకారం, ప్రేమ, ఎంతగా ప్రవహిస్తూ ఉంటుందో, అంతే నిండుగా, అంతర్లీనంగా, జీవితంలో ఏదీ శాశ్వతం కాదన్న వేదాంత ధోరణి, జీవితం పట్ల, అస్తిత్వం పట్ల ఆయనకున్న అపేక్ష అంత హాయిగానూ కనబడుతుంది.

ఒక మనిషిగా ఈ క్షణాన్ని అనుభవించటం ఎంత ముఖ్యమో, మనిషిగా బ్రతకటం ఇంకా ముఖ్యం, మనం ఎమీటో  తెలుసుకోటం ముఖ్యం, శీతోష్ణ సమ సుఖదుఃఖేషు అని తెలుసుకుని ఉండటం మానవాళికి అత్యంత అవసరం అని చెప్పకనే చెప్తునట్టు మనలోకి, మనసుల్లోకి, ప్రవహిస్తాయి ఆయన రుబాయత్ లు.

“A Book of Verses underneath the Bough,
A jug of Wine, a Loaf of Bread – and Thou
 Beside me singing in the wilderness-
O, Wilderness were Paradise enow!”

జీవితాన్ని ఆనందించటం అంటే ఇదేనేమో అన్నంత భావుకత మనకు ఇక్కడ కనిపిస్తుంది.
ఓ పూతావి కింద, చేతిలో ఓ పుస్తకం, చెంతనే ఒక జగ్ ఆఫ్ వైన్, ఒక బ్రెడ్ లోఫ్, నిర్జనారణ్య ప్రశాంతతలో సంగీతాన్ని ఆలపిస్తూ నువ్వు, ఇదే కదా స్వర్గం...అనటంలో ఎంత అందం కనపడుతుందో...

The Worldly Hope men set their Hearts upon
Turns Ashes - or it prospers; and anon,
Like Snow upon the Desert’s dusty Face
Lighting a little Hour or two - is gone”

అనటంలోనూ అంతే భావుకత తొణికిసలాడుతుంది. ఐహిక ఆశలు పెట్టుకున్న మనుషులు,
వారి హృదయాలను ఏ కోరికలపై లగ్నం చేశారో, అవి సాధించవచ్చు- సాధించ లేకపోవచ్చు.
సాధించినా సాధించకపోయినా ఎడారిలోని ఇసుక మీద మెరిసే హిమ శకలం ఒక గంటా రెండు గంటలకు మించి ఉండనట్టు, మనం జీవితంలో సాధించినవీ, సాధించనివీ అన్నీ కరిగిపోతాయి!!! ఎంత అందంగా చెప్పారు like snow upon the deserts dusty face lighting a little hour or two”….ఇది చదివితే గమ్యం ఏర్పరుచుకోటం తప్పుకాదు, గమ్యం కోసం అనవసర తాపత్రయం, సాధించానని గర్వం, సాధించలేదని నిస్పృహ లేకుండా.. ముందుకు వెళ్ళాలి అనిపిస్తుంది, ఎందుకంటే గమ్యం కూడా శాశ్వతం కాదు కదా? ఆ స్ఫురణ, ఒక ఈక్వానిమిటి మనిషికి ఎంత అవసరమో చాలా అందంగా చెప్పారు కదా అనిపిస్తుంది.
అలాగే,
“Think, in this batter’d Caravanserai
Whose Doorways are alternate Night and Day,
How Sultan after Sultan with his Pomp
Abode his Hour or two, and went his way.”

Caravanserai  అంటే ఒకప్పుడు ఎడారిలో ఉండే ఒక హోటల్ / సత్రం /లాంటిది అనుకోవచ్చు. చుట్టూ కట్టడాలు  ఉంటే, మధ్యలో ఓపెన్ ప్లేస్ ఉండేదిట. గుంపులుగా వచ్చే బాటసారులు (కారవాన్స్)  అక్కడ విడిది చేసి, అన్న పానాదుల తరవాత విశ్రాంతి తీసుకుని ముందుకు సాగేవారని అంటారు.
ఈ ప్రపంచం, అలాంటి ఒక విడిది ఐతే, ఇక్కడ ఉదయం, రాత్రి అనేవి తలుపులు. ఇక్కడ  సుల్తాన్ తరవాత సుల్తాన్ , తన సామ్రాజ్యాల్ని.  తన సంపదనీ, తన గ్లోరీనీ ..అన్నిటినీ ఒక గంటా రెండు గంటలు (ఇక్కడ గంట అన్నది జీవిత కాలం) అనుభవించి వెళ్ళిపోతాడు!!! ఏదీ శాశ్వతం కాదు ఈ ఎడారి ప్రయాణంలో ...అని ఎంత సున్నితంగా చెప్పారు?

Tis all a Chequer-board of Nights and Days
Where Destiny with Men for Pieces plays:
Hither and thither moves, and mates, and slays,
And one by one back in the Closet lays,”

ఆయన రుబాయత్ లలో చాలా ప్రముఖమైనది:

“The Moving Finger writes; and, having writ,
Moves on; not all thy Piety nor Wit
Shall lure it back to cancel half a Line,
Nor all thy Tears wash out a Word of it.”

పై రెండిట్లోనూ ఒక నిర్వేదం, ఒక సరెండర్ కనిపిస్తుంది. రమణ మహర్షి చెప్పినట్టు, జరిగేది జరక్క మానదు.. “Whatever is destined not to happen will not happen, try as you may. Whatever is destined to happen will happen, do what you may to prevent it. This is certain. The best course, therefore, is to remain silent.”  ఇలాంటి ఒక భావన మనకు పై పంక్తుల్లో కనిపిస్తుంది.

ఇలాంటి రస గుళికలు ఎన్నో ఈ రుబాయత్ లలో.  ఆయన పెర్షియన్ భాషలో ఇంకా అద్భుతమైన రచనలు చేశారని అంటారు. అవి ఇంగ్లీష్ లోకి తర్జమా అయ్యాయో లేదో తెలీదు. ఈ రుబాయత్ లలో నాకు చాలా చాలా ఇష్టమైన కుజా నామ kuza nama” గురించి మరోసారి!!!


ఇక్కడ సరదాగా ఒమర్ ఖయ్యాం గురించి కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఆయన రుబాయత్ ల గురించి ప్రపంచానికి తెలిసినంతగా, మిగితా సంగతులు తెలియవు. ఆయన గురించి ఎక్కువగా తెలియనిది , ఆయన గణితంలో పండితుడనీ, ఒక సైంటిస్ట్ అనీ!! గణితంలో ఆయన రాసిన  “Treatise on Demonstration of Problems of Algebra” ఒక ప్రముఖమైన ఆవిష్కరణ గా చెప్పుకుంటారు. అలాగే ఆయన తయారు చేసిన (వెస్టర్న్ కాలెండర్ -365 డేస్ ఇన్ ఆన్ ఇయర్) జలాలి కాలెండర్, గ్రిగేరియన్ కాలెండర్ కంటే చాలా కరెక్ట్ గా ఉంటుందని చెప్తారు.

ఒమర్ ఖయ్యాం  గురించి  ఎడ్వర్డ్ ఫిట్జ్ గెరాల్డ్ గురించి Encyclopaedia Britannica లో పొందుపరిచిన వివరాలు:

“Omar Khayyam, Arabic in full Ghiyāth al-Dīn Abū al-Fat ʿUmar ibn Ibrāhīm al-Nīsābūrī al-Khayyāmī   (born May 18, 1048, Neyshābūr [also spelled Nīshāpūr], Khorāsān [now Iran]—died December 4, 1131, Neyshābūr), Persian mathematician, astronomer, and poet, renowned in his own country and time for his scientific achievements but chiefly known to English-speaking readers through the translation of a collection of his robāʿīyāt (“quatrains”) in The Rubáiyát of Omar Khayyám (1859), by the English writer Edward FitzGerald.”

 Edward FitzGerald,  (born March 31, 1809, Bredfield, near Woodbridge, Suffolk, Eng.—died June 14, 1883, Merton, Norfolk), English writer, best known for his Rubáiyát of Omar Khayyám, which, though it is a very free adaptation and selection from the Persian poet’s verses, stands on its own as a classic of English literature. It is one of the most frequently quoted of lyric poems, and many of its phrases, such as “A jug of wine, a loaf of bread, and thou” and “The moving finger writes,” passed into common currency.

Saturday, October 12, 2013

నాకు నచ్చిన కొటేషన్స్...



నాకు నచ్చిన కొటేషన్స్ ఇలా రాసుకుంటే బావుంటుంది అనిపించింది.










ఇది కూడా ఓ ప్రయోగమే? అని నవ్వకండి. నేను చేసిన మొదటి ప్రయత్నం ఇది.  ఎప్పుడు ఇలాంటివి చూసినా, ఆహా అనుకునేదాన్ని. నిన్నఇలాంటివి కొన్ని చదువుతూ,  అసలు ఇవి ఎలా తయారు చేస్తారు? నేను కూడా నాకు నచ్చిన పద్ధతిలో, నాకు చాలా నచ్చిన కొటేషన్స్ దాచుకుంటే ఎలా వుంటుంది అనిపించింది. ఇదిగో, ఆ ఆలోచన ఫలితమే -  ఇవాళ్టి  ఈ ప్రయత్నం!!!

Sunday, October 6, 2013

హైదరాబాద్ ఆటో వాలా జిందాబాద్!!!!



హైదరాబాద్ ఆటో వాలా జిందాబాద్!!!!

ఏడవలేక నవ్వటం అంటే ఇదే....

మహా నగరంలో మాయగాళ్ళు  ...
మనుషుల్ని నిలువునా పాతరేయగలిగిన పోటుగాళ్ళు ...
మన పర్సుల్ని మన కళ్ళముందే,  హక్కుగా నిలువు దోపిడీ చేసే వాళ్ళు ....
మన నిస్సహాయతే వాళ్ళ బలంగా మలుచుకున్న వాళ్ళు...
మన హైదరాబాదు ఆటో వాళ్ళు!!

మన హైదరాబాద్  రోడ్స్ మీద ప్రయాణం ఒక ఎత్తైతే, ఇక్కడ ఆటో ప్రయాణం మరో గమ్మత్తు.

ఆటొ నడిపేవారు పలు రకాలు.

ఒకరు అతి మంచివారు. వీళ్ళు ఎంత మంచి వాళ్ళంటే వీరితో సంభాషణ ఇలా ఉండొచ్చు:

పంజగుట్ట ద్వారకాపురి కాలనీ జానా హై...

ఠీక్ హై .. ఎక్కమని తల పంకిస్తూ, మీటరు తిప్పుతాడు.

మనకు అనుమానం వస్తుంది ఇతనికి అసలు అర్ధమైందా అని. భయ్యా సమఝ్ మే ఆయానా, ద్వారకాపురీ కాలనీ కె అందర్ జానా హై ... అంటాం మనం కొంచం అయోమయంగా.

ఆప్ బైఠొనా అమ్మా, కహా బోలెతో వహా లేకే జాయెంగే అంటాడు అతను.

మనల్ని మనం ఒక సారి గిల్లుకుని అరె నిజమే, పాపం ఇతను మంచివాడు లాగా ఉన్నాడు అనుకుంటూ (కొందొకచో పిచ్చివాడు లా ఉన్నాడే అని కొంచం జాలి కూడా పడుతూ), అయినా ఎందుకైనా మంచిది అని  అనుమాన నివృత్తి కోసం ఆటో ఎక్కకుండా, “మీటర్ పే ఆనా భయ్యా, ఫిర్ ఉతర్ నే కె బాద్ జ్యాదా దేనా బొల్కే నై బొల్నా అంటాం.

అతను మన వంక కొంచం చిరాగ్గా చూసి కొంచం జల్ది ఎక్కండమ్మా,  మీటర్ మీద డబ్బులు ఎందుకు అడుగుతాం?” అంటాడు అసలు అలాంటి అనుమానం ఎందుకు వచ్చింది అన్నట్టు. మనం ఒకసారి కింద పడబోయి ఆగి  ఆలస్యం అమృతం విషం అనుకుంటూ గబ గబా ఆ పడేది ఆటోలో  పడి, కూలబడతాం.



ఇక రెండో రకం. వీరితో సంభాషణ తమాషాగా ఉంటుంది. అటు మరీ మంచితనం ఉండదు అలాగని దండుకునే రకం కాదు.

ద్వారకాపురి కాలనీ పంజగుట్ట అంటాం మనం.

ద్వారకాపురీ కాలనీ లోపలికి పోవల్నా?” అంటాడు అతను ప్రతిగా.

అదే కదా కాలనీ అని అంటే, లేకపోతే పంజగుట్ట అనే చెప్పేవాళ్లం కదా,  అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అని మనసులో తిట్టుకుంటూ,  అవును బాబూ గుడి దగ్గరికి వెళ్ళాలి.”  అంటాం .

అతను కాసేపు ఆలోచనలో పడిపోతాడు. అసలు ఇలాంటి కాలనీలు ఎందుకు ఉంటాయో, ఇలాంటి కాలనీల్లో మనుషులు ఎందుకు ఉంటారో, అన్న జీవన మీమాంసలో ఉన్నట్టు, అసలు ఇలాంటి కాలనీల్లోకి వెళ్ళటం నాకిప్పుడు అవసరమా, హాయిగా ఉన్న చోట  ఉండక అన్నట్టు. నిమిషాలు గడుస్తాయి... మనకి ఎండ, ఛ ఎవరి మీదో ఆధారపడుతున్న బతుకు ఇదీ ఒక బతుకేనా అన్న శ్మశాన వైరాగ్యం, ఇప్పుడు ఎంత అడుగుతాడో అన్న చిరాకు తాలూకు బి‌పి పెరుగుతూ ఉంటుంది. ఇంతలో అతను తన కరుణా కటాక్ష వీక్షణాలను మన మీద ప్రసరించి, దేవుడు వరం ప్రసాదించినట్టు, మీటర్ ని తిప్పి, గేర్ పట్టుకుని  ఎక్కమ్మా , లోపట కాల్నిలోకి బోవాల కదా, అక్కడ్కెల్లి గిరాకీ దొర్కదు,  మీటర్ మీద దస్ రూపై దేనా అంటాడు. 

మనకు కొంచం ఉక్రోషం వస్తుంది. అప్పటి వరకూ రాని ఆటోలు, వందలు అడిగిన తాలూకు చిరాకు లోంచి, మన కాలనీకి రావటానికి ఇంత ఆలోచన ఏంటి అని, వెంటనే ఆవేశంలో కొంచం గట్టిగా గుడి దగ్గర గిరాకీ దొర్కదా ఏం చెప్తున్నావయ్య , నేను అమెరికా నుంచి రాలే, రోజూ పొయ్యేడ్డే, పైసా ఎక్కువివ్వను, మీటర్ మీద వస్తే రా అంటాం.

అరె, గంత కోపం జెస్కుంటావెందుకమ్మ,  సరే కూసో,  మీటర్ గెంతైతే గంతనే ఇవ్వు”, అంటాడు పెద్దరికపు నవ్వు విసిరేస్తూ.  మనం ఎక్కువ రియాక్ట్ అయ్యమా అనుకుంటూ ఆటోలో ఎక్కుతాం. అతను దోవ పొడుగునా ఆటో వాళ్ళ కష్టాలు ఏకరువు పెడతాడు నవ్వుతూనే. పాపం డెబ్బై రూపాయలు పెట్టి ఉల్లిపాయలు, పది రూపాయలు పెట్టి కొత్తిమీర కట్ట  కొనుక్కోటానికి మనమే ఇంత ఆలోచిస్తుంటే వీళ్ళకి ఇంకెంత కష్టమో కదా అని మనలో ఎక్కడో చిన్న ఫీలింగ్. దిగుతూ మీటర్ మీద పది రూపాయలు, అతను అడిగినప్పుడు నో అనిన ఆ పది రూపాయలు,(ఇది రొటీన్ గా ఇచ్చేదే) అతనికి ఇచ్చేస్తాం, చాలా గర్వంగా, ఉదారంగా.

 అతను సంతోషంతో షుక్రియా అమ్మా, గిట్ల సంతోషంల ఇస్తే తీసుకుంటం, జబర్దస్తి తీస్కోనుడు మంచిదికాదు అని వెళ్ళిపోతాడు నాకు నీతి బోధ చేస్తున్నట్టు. విన్ విన్ పరిస్థితిలో ఒక మంచి పని చేసిన ఫీలింగ్లో నేను, పది రూపాయలు ఎక్కువ వచ్చింది కదా అని అతను ....ఆ రోజుకి ఆటో ప్రహసనం ముగుస్తుంది.

ఇక మూడో రకం. మోస్ట్ టఫ్ పీపుల్. వీళ్ళు రారు, మనల్ని ఇంకో ఆటో దొరికే వరకు వదల్రు. మహా నాన్పుడు గాళ్ళు.

ద్వారకాపురి కాలనీ పంజగుట్ట, వస్తుందా?” అంటాం మనం.

అతను ఇప్పుడే అమెరికా నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో దిగుమతి అయినట్టు,

ద్వారకాపురి కాలనీ?  పంజగుట్ట??? ఎక్కడుంది ఇది?” అని తాపీగా అడుగుతాడు. మనిషిలో ఒక కేర్లెస్ నెస్, ఒక ఈసీగోయింగ్ తనం, వెరసి ఒక నిర్లక్ష్యం తో కూడుకున్న వినోదపు ఛాయలు కనిపిస్తూ ఉంటాయి.

ఖైరతాబాద్ లో ఉన్న ఆటో వాళ్ళకి పంజగుట్ట తెలీదా అని మనకు కొంచం అనుమానం వస్తుంది. అనుమానాన్ని తోసి రాజని, అతనికి వివరిస్తాం, “నిమ్స్ తరవాత గల్లీలో వస్తుంది అని.

గల్లీలోకి పోవాలా?” అసలు నన్ను నా ఆటోని ఏమనుకుంటున్నారు మీరు? అంత చిల్లరగా అడుగుతారా అన్నట్టు ఉంటుంది ఆ ప్రశ్న.

అవును గల్లీలో గుడి దగ్గరకు పోవాలి. బింకంగా సమాధానమిస్తాం.

నిమ్స్ తరవాత గల్లీ, మాడల్ హౌస్ తాన వచ్చే గల్లీ నా?” సాలోచనగా అడుగుతాడు.
వస్తున్న విసుగుని ఆపుకుంటూ, నుదుటిమీద చెమటని తుడుచుకుంటూ, మధ్యాహ్నం పడ్డ వర్షపు నీళ్ళు నిలిచిపోతే, వాటి మీదనుంచి పడుతూ లేస్తూ వెళ్తున్న ద్విచక్ర వాహనాలను తప్పుకుంటూ, నీళ్ళతో నిండిన గుంటల మీద అడుగు వేయకుండా విశ్వప్రయత్నం చేస్తూ, ఒక చేతిలో సెల్లు, మరో చేతిలో లంచ్ బాగ్, భుజాన హాండ్ బాగ్ మానేజ్ చేస్తూ మనం, ఆటోలో చిద్విలాసంగా కూర్చుని మనం పడుతున్న ఇబ్బందుల్ని చూసీ చూడనట్టుగా చూస్తూ, తాపీగా మాట్లాడుతూ అతను....నిస్సహాయంగా, కనుచూపు మేరలో ఇంకో ఆటో కనిపిస్తుందేమో అని వెతుకుతూనే, “అవును బాబూ అవును (జండూ బామో, విక్సో -  ఆడ్ లో ఎంత విసుగ్గా అంటాడో అంత విసుగ్గా చదుకోవాలి దీన్ని) అంటాం మనం - కొడిగడ్తున్న ఆశను కూడదీసుకుంటూ, మనసులో ఇతను మీటర్ మీద వస్తే బావుండు అనుకుంటూ.


మళ్ళీ కాసేపు ఆలోచన్లో పడి లేచి, “ఏమిస్తారు?” అంటాడతను.

నువ్వే చెప్పు ఇప్పుడు మీటర్ మీద ఆటో దొరకటం కష్టమేమో అనిపించి మనం తగ్గుతాం.

సిక్స్టీ రుపీస్ ఇచ్చేయమ్మా, ఎక్కండి అంటాడు అతను.

సిక్స్టీ రుపీసా? మీటర్ ఇరవై అవుతుంది! వద్దులే అని ముందుకు అడుగేస్తాం మనం.

మనతో పాటే ఆటో ముందుకి కదుల్తుంది, “అరె, గల్లీ లోపట్కి పోవాలే కదా?”

వద్దులే బాబు ఇంకో ఆటో కోసం చూస్తూ ఇతనితో మాటలు అనవసరం, అని ముందుకి వెళ్ళటానికి ప్రయత్నిస్తాం మనం.

అరె ఉండమ్మా? గల్లీ నుంచి బేరం ఉండదు ఖాళీ గా రావాలి, ఎంతిస్తావ్ చెప్పమ్మా?” వదలని బేరం.
ముప్పై ఇస్తాను బస్ ఎక్కలేని మన చేతకాని తనానికి మన మీద మనకే చిరాకు వస్తుంది. బస్ స్టాప్ కి పక్కనే ఇల్లు లేదని ఇంటి మీద చిరాకు వస్తుంది. మధ్యలో ఈ వర్షపు నీళ్ళు, దరిద్రంగా! అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందో, ఆ టాక్స్ అనీ ఈ టాక్స్ అనీ దండుకోటం కాదు రోడ్లు బాగు చేయించ వచ్చు కదా? మనలోని సగటు పౌరుడు ఆవలిస్తూ నిద్ర లేస్తాడు.

యాభై ఇచ్చేయ్య్ వెంటాడుతూ ఆటో వాడు.

నువ్ పోవయ్యా, నీ ఆటో నాకు అవసరం లేదు. చిరాకు గొంతులోంచి ఒలికిపోతుంది కొంత మేరకు. సగటు పౌరులు పూర్తి స్థాయి కోపాన్ని ప్రదర్శించరు కదా!

అరె అంత గుస్సా ఏమిట్కి? యాభై రూపాయలకు ఈ దినాలల్లా ఎమొస్తయ్?” మనతో  పాటే ఆటో నడుపుతూ ఆటో వాడు.

మీకేమోస్తాయో నాకు తెలీదు కానీ, ఎక్కేవాడికి హార్ట్ అట్టాక్ వస్తుంది అన్న నువ్వునాకు నచ్చావ్ సినిమాలో వెంకటేష్ డైలాగ్ గుర్తొస్తుంది. 

ఈ లోపల వెనకే ఇంకో ఖాళీ ఆటో రావటం, ముప్పై రూపాయలకు ఎక్కటం జరుగుతాయి. మనం  బేరమాడుతూ ఖైరతాబాద్ సర్కల్ దాకా వచ్చేసి ఉంటాం. ఆటో ఎక్కి, మా అమ్మాయి మోచేత్తో పొడిస్తే  చూద్దును కదా, పాత ఆటో వాడు, రోడ్డు వారగా పార్క్ చేసుకుని, కాళ్ళు బారచాపుకుని, చిద్విలాసంగా నవ్వుకుంటూ, బేరం పోయిందన్న చింత లేకుండా సిగరెట్టు వెలిగిస్తున్నాడు!
వీళ్ళను తట్టుకోటమే పెద్ద సవాల్!!!