Saturday, October 26, 2013

స్వేచ్ఛ- కాశ్మీర తీరాలు!!!




ఎక్కడుంది స్వేచ్ఛ?? ఎక్కడ వెతకాలి? ఎప్పుడూ వెతుకుతూ ఉండే స్వేచ్ఛ...అందరూ వెతికే స్వేచ్ఛ...అందరికీ కావల్సిన స్వేచ్ఛ...ఎక్కడుంటుంది? ఏంటీ స్వేచ్ఛ? ఎందుకు మనమందరం ఈ స్వేచ్ఛ కోసం ఇంతలా వెతుకుతాం?

జీవితంలో ఎప్పుడో ఒకసారైనా ఈ స్వేచ్ఛ గురించి తపన పడకుండా ఎవ్వరూ ఉండరనుకుంటాను. ప్రతి వ్యక్తికీ ఒక చట్రం ఉంటుంది. తనకు తను ఏర్పరుచుకున్న చట్రం. పుట్టుక నుంచి చివరి ఊపిరి వరకు ఒక మాప్ గీసుకుని పయనం సాగిస్తున్నట్టు. ఎవరో మనకు దిశా నిర్దేశం చేసేసి, ప్రయాణపు టికెట్లు కొనేసి, బండి ఎక్కించి....ఇక్కడ దిగిపో అన్నట్టు. మధ్యలో వేరుశనగ పప్పులు, బజ్జీలు, సమోసాలు, నీళ్ళు, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్...భోజనం, నిద్ర....తోటి ప్రయాణికులతో మాటలు....దిగబెట్టే వారి దిగుళ్లు, గమ్యం గురించిన ఆందోళన, సంతోషం, భయం, ఆత్రం, మన వాళ్ళని వదిలి వెళ్తున్న బెంగ, మన సామాన్ల గురించి జాగర్త, ఎవరూ దొంగలించకుండా చైన్లు వెయ్యటం, తోటి ప్రయాణికులతో కబుర్లు, కాట్లాట్లు, చిరాకులు, ఆనందాలూ....అన్నీ ఎవరో నిర్దేశించినట్టు!!

గమ్యం వచ్చాక రైలు ప్రయాణం ఒక మెమరీ మాత్రమే, ఆదేలాంటి అనుభూతిని పంచినా!!!  మన జీవితం కూడా అంతేనా???

ఈ ప్రయాణంలో పడి, ఒక గమ్యం పట్టుకుని గుడ్డిగా వెళ్లిపోతూ...ఎప్పుడో ఒకసారి  ఉన్నట్టుండి ఒక ఆత్మావలోకనంలో పడిపోయి, నేను చెన్నై ఎక్స్ప్రెస్ ఎందుకు ఎక్కాలీ? నాకు అసలు కాశ్మీర్ వెళ్లాలని ఉంటే?” అనుకుంటాం... మళ్ళీ, “సర్లే ఏదో ఒకటి ఎక్కేసాం కదా, సర్దుకుని వెళ్లిపోదాం. కాశ్మీర్ సంగతి మళ్ళీ చూద్దాం అనుకుంటాం. ఆ చూడటం మళ్ళీ జరుగుతుందో లేదో తెలీదు.

మనసులో మాత్రం అప్పుడప్పుడూ కాశ్మీరం నిద్ర లేస్తూ ఉంటుంది. అలా మనసులో మెరిసే  కాశ్మీరాలే - పుస్తకాలు చదవటాలూ, వీణ నేర్చుకోవటాలు, క్రికెట్ ఆడటాలూ - ఇంకా ఇలాంటివే ఏవో, మన ఇష్టాలు, మనసుకి నచ్చిన పనులు. అన్నీ పిచ్చి ఆశల్లా, పిల్లవేషాల్లా మిగిలిపోయిన సుందర స్వప్నాలు. సుందర స్వప్నాలు కాబట్టే వీటిని కాశ్మీర తీరాలు అంటున్నాను!! ఈ స్వప్నాలు నిజం కావాలంటే మనం మనలా ఉండగల స్వేచ్ఛ కావాలి, తెగువ కావాలి....మన జీవితం పట్ల ఒక అవగాహనా సంతృప్తీ కావాలి...ఇవన్ని పరుగు పందెంలో ఉన్న మనకు అర్ధం కావటానికి సమయం పడుతుంది. చదువు, ఉద్యోగం....

చూస్తూ ఉండగానే పిల్లలూ, పాల డబ్బాలూ, పెద్దవాళ్ళైన తలిదండ్రులూ, సోదర సోదరీ బంధాలూ, ప్రేమలూ, తెగుళ్లూ, ఆవేశ కావేశాలు, పిల్లల చదువులూ, వాళ్ళ అమెరికా చదువులూ, ప్రయాణాలూ, దానికి కావల్సిన డబ్బూ దస్కం సమకూర్చుకోటాలూ,  ఆస్తులు సమకూర్చుకోటాలూ, బంగారాలూ, ఇళ్లూ కొనే ఝంఝాటాలూ, కొత్త కొడళ్లూ, అల్లుళ్లూ, మనమలూ మనమరాళ్ళు, ఎడతెగకుండా బాధ్యతలూ, భార్య భర్త సర్దుకు పోటాలూ, ప్రేమలు పంచుకోటాలూ, చిరాకులూ, అనారోగ్యాలూ, ఆనందాలూ.....ఒక ప్రవాహంలో పడి వెళ్లిపోతుంటాం...మధ్య మధ్య ఏదో గుర్తొస్తూ ఆగిపోతుంటుంది...ఏదో ఒక చిన్న కలవరం, ఏదో గుర్తుకు రాబోతున్నట్టు, మసక మసకగా మనసుని తాకుతూ, పలకరిస్తూ, పలవరిస్తున్నట్టు, నన్ను చూడూ, నాగురించి ఆలోచించూ, పట్టించుకో అన్నట్టు, అదేంటో తెలుసుకునే తీరికా ఓపికా రెండూ మనకు ఉండవు..మనం, మనకి మనమే నిర్దేశించుకున్న పరుగు పందెంలో, ఇంకొకరితో పోల్చితే మనం ఎక్కడున్నాం అనే లెక్కల్లో మునిగితేలుతూ ఉంటాం....కాలం కదలి పోతూ ఉంటుంది.....

ఉన్నట్టుండి ఒక రోజు మనకు, మన మనసుకు కొంచం తీరిక దొరుకుతుంది....నా కాశ్మీరం ఏది??? అన్న ప్రశ్న మళ్ళీ గుర్తొస్తుంది.

అసలేమిటీ కాశ్మీరం? అనుకుంటాం .

ఈ కాశ్మీరమే మనం వదిలేసిన స్వేచ్ఛ!!  అని గుర్తుకు వస్తుంది.

 నేను ఏదో చేద్దామనుకున్నాను, బట్ ఐ నెవర్ హాడ్ దట్ ఫ్రీడం!  ఇది మనకు తరుచూ వినిపించే మాట.  బయటకు చెప్పినా చెప్పక పోయినా ప్రతి వ్యక్తీ, ఏదో ఒక పరిస్థితిలో తనలో తను అనుకునే మాట. మనం చెయ్యాలని తపనపడి చేయలేక వదిలేసిన పనుల సమాహారమే ఈ కాశ్మీరం! అనేకానేక కళల పట్ల ఎంతో మక్కువ ఉన్నా వీటికి సంబంధం లేని ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకు నెట్టుకొస్తున్న సగటు జీవితాలు, సంపాదనే ధ్యేయంగా చదువులు , డాలర్ల వేటలో ఉద్యోగాలూ, అంతగా డాలర్లు సంపాదించలేకపోతే ఏదో ఒక ఉద్యోగం.....వృత్తికీ ప్రవృత్తికీ సంబంధం లేని జీవితాలు.....చాలామటుకు.

మన నిజ స్వరూపం ఆ స్వేచ్ఛ కాబట్టే మనల్ని, మన మనసుల్ని, ఆలోచనల్ని ఈ కాశ్మీరం వదిలిపెట్టదు. ఒక అందమైన ఊహా చిత్రంలా మనల్ని ఊరిస్తూ ఉంటుంది. మనం అనుకున్నది చేసేవరకూ, లేక పూర్తిగా మనల్ని మనం అర్ధం చేసుకునే వరకూ మనల్ని ఇది వదిలిపెట్టదు. అసంతృప్తిగా మారి వేధిస్తుందో, మరపు పొరల వెనక నిలిచి మనకేం కావాలో మనకే తెలియకుండా చేస్తుందో...అది వ్యక్తిత్వపు ఎదుగుదలని బట్టి ఉంటుంది.

 స్వేచ్ఛ చాలా విస్తృత పరిధి ఉన్న పదం...నేను కేవలం ఒక చిన్న సమస్య గురించి ప్రస్తావించాను ఇక్కడ. ఇష్టమైన పద్ధతిలో మనసుకు నచ్చిన పద్ధతిలో (ఇంకొకరికి, సమాజానికీ  హాని కలిగించకుండా) బ్రతకలేకపోవటమే స్వేచ్ఛని కోల్పోవటం. డబ్బు సంపాదన చాలా ముఖ్యం కానీ అస్తిత్వాన్ని మిగుల్చుకోటం ఇంకా ముఖ్యం, ఆనందాన్ని మిగిల్చుకోటం మరీ మరీ ముఖ్యం.

ఇవన్నీ మనం పొందాలంటే స్వేచ్ఛ కావాలి, మనకు మనం వేసుకున్న ప్రాక్టికల్ శృంఖలాలనుంచి స్వేచ్ఛ, మన మనసుకు మనం వేసుకునీ పూసుకున్న ఆలోచనలనుంచి స్వేచ్ఛ, ఎవరికోసమో, ఎవరిలాగానో బ్రతకటం నుంచి స్వేచ్ఛ, మనకు మన మనసుకూ నచ్చినట్టుగా ఉండటానికి కావల్సిన ధైర్యం - స్వేచ్ఛ!! 

మన మనసుకు నచ్చిన పనులు, మనకి ఆనందాన్ని ఇచ్చే పనులు అది ఓ పుస్తకం చదవటమో, ఒక మంచి సినిమా చూడటమో, ఒక మంచి పాట వినటమో, ఒక మంచి పెయింటింగ్ వెయ్యటమో....మనకూ అంటూ ఒక వ్యాపకం.... మనకు మనం ఏర్పరుచుకుంటూ, పిల్లలకూ నేర్పిస్తూ జీవితాన్ని అనుభూతించటం ఎంతైనా అవసరం.

మన మనసులో  దాక్కున్న కాశ్మీరాలకు ఊపిరిపొయ్యటం మన పట్ల మనకు ఉన్న బాధ్యత!!
మన మనసు హాయిగా స్వేచ్ఛగా చిర్నవ్వు నవ్వేలా చేయటం మన పట్ల మనకున్న బాధ్యత!!
జీవితాన్ని అనుభూతించటం, ఆనందంగా బ్రతకటం మన పట్ల మనుకున్న బాధ్యత!!

ఏమంటారు?