‘చికెన్ సూప్
ఫర్ ద్ సోల్’ ..నాకు చాలా ఇష్టమైన కథల సీరీస్.
ఆ పుస్తకాన్ని నా చేతిలో చూసి, ఇలాంటి
సెంటిమెంటల్ స్టఫ్ నాకు చిరాకు అన్నవారు ఉన్నారు.
జీవితం ఎప్పుడూ సమస్యలతో నిండి
ఉంటుంది. ఆ సమస్యలని మనం గుర్తించి స్పందించినట్టుగా,
జరుగుతున్న మంచిని గమనించటం, అస్వాదించటం అంత సులభంగా జరగదు అనుకుంటాను. ఈ కథల
సిరీస్ అంతా అలాంటి చిన్నచిన్న అద్భుతాల
(మంచి,
మానవత,
స్నేహం,
కలలని సాకారం చేసుకోవటం వగైరాలు - చాలా మటుకు వాస్తవంగా జరిగిన సంఘటనలే)
గురించి చెబుతూ,
మనల్ని కూడా అలాంటి వాటిని గుర్తుచేసుకొమ్మనీ, గుర్తించమనీ
చెప్తున్నట్టుఅనిపిస్తుంది. అందులో నాకు నచ్చిన ఒక చిన్న కథ తెలుగులో...ఇది
మక్కీకి మక్కి అనువాదం కాదు.
లెట్ అజ్ రిమెంబర్ సమ్ గుడ్
థింగ్స్ అబౌట్ లైఫ్!!
ద
డొనేషన్ బాక్స్
మూడునెలలు కష్టపడ్డాను. నా
సమ్మర్ సెలవుల్లో బేబీసిట్టింగ్ చేసి మరీ సంపాదించిన డబ్బుతో కొన్న డ్రెస్ అది.
**
మొదటిసారి ‘టీన్’ మేగజైన్
లో చూసినప్పుడు ఎంతో బావుంది అనిపించింది.
"నాకిది
కొనిపెట్టవా!" అని అమ్మని అడిగితే, "అది ఒక్కటీ కొనే డబ్బుతో, నీ డ్రెస్సులు
అన్నీ కొనొచ్చు తెలుసా?" అంది అమ్మ.
ప్చ్, ఉండబట్టలేక అడిగాను కానీ నాకూ తెలుసు, అంత ఖరీదైన
డ్రెస్ కొనలేమనీ, అడక్కూడదనీ.
అయినా నా మనసంతా దానిమీదే. "ఆ బ్రాండ్ డ్రెస్సులు
అన్నీ అంతే. ఖరీదే. మాకు అందుబాట్లో ఉంటే ఎంత బావుండేది. కొన్ని కొన్ని అంతే... చూసి
ఆనందించాల్సిందే" అనుకున్నా.
నా మనసు తెలుసుకుందేమో అమ్మ
"సరే ఒక పని చెయ్యి. నేను కొంత డబ్బు ఇస్తాను. మిగతాది నువ్వు సెలవుల్లో
ఉద్యోగంచేసి సంపాదించు. అప్పుడు కొనుక్కో"
అంది మధ్యేమార్గంగా.
**
సెలవుల్లో తెలిసినవాళ్ళ పాపను
చూసుకున్నాను. నా మూడు నెలల సంపాదనకిఅమ్మ ఇచ్చిన డబ్బులు కలిపి మొత్తానికి డ్రెస్
కొన్నాను.
నా మొదటి సంపాదన. నాకు చాలా నచ్చిన
డ్రెస్. ఒకసారి వేసుకుని చూసుకుని మురిసిపోయాను. సరిగ్గా అతికినట్టు ఉంది. నా
సంతోషానికి హద్దులు లేవు. అమ్మా, నాన్నా తెగ ముచ్చటపడ్డారు నన్ను చూసి. స్కూల్
రీఓపెనింగ్ రోజున నేను ఆ డ్రెస్ వేసుకెళ్ళటానికి అందరం తీర్మానించుకున్నాం.
**
స్కూల్ తెరిచేలోపల నేనూ అమ్మా
కలిసి నా రూం మొత్తం సర్దేసాం. బోలెడంత పనైంది. పాత పుస్తకాలూ, పనికి రాని
పెన్నులూ, పెన్సిల్సూ, రబ్బర్లూ, బాగ్‌లూ, చిన్నగా
అయిపోయిన షూస్,
సాక్స్,
పొట్టిగా అయిపోయిన బట్టలూ అన్నీ తీసి, పడేయాల్సినవి
పడేసి మిగితావి డొనేషన్ షాప్‌లో డొనేట్
చేసేసాం. రూమంతా నీట్‌గా సర్దుకుని తయారుగా వున్నాను. ఎప్పుడెప్పుడు స్కూల్ తెరుస్తారా, ఎప్పుడెప్పుడు
నా కొత్త డ్రెస్ వేసుకుందామా అని తెగ ఆత్రంగా ఉంది నాకు. అందరూ పొగిడేస్తారు నన్నూ, నా
డ్రెస్సునూ!!
**
మొత్తానికి స్కూల్ తెరిచే ముందు
రోజు సాయంత్రం అన్ని రెడీ చేసుకుంటున్నాను. కొత్త బాగ్,
పుస్తకాలు సర్దుకుని, డ్రెస్ కోసం చూసాను.
ముందుగా టాప్ తీసుకుని, దానికున్న టాగ్ తీసి చూసుకున్నాను. ఎంత బావుందో.
మూడు నెలల సంపాదన, కష్టం మరి. స్కర్ట్ కోసం చూసాను. హాంగర్ కి తగిలించి లేదు.
మడత పెట్టానేమో అని చూసాను. కనిపించలేదు. కొంచెం అయోమయంగా అరలో ఉన్న బట్టలన్నీ
చూసాను. లేదు. ఇంకెక్కడ ఉంటుందబ్బా? ఈ రూమ్ సర్దడంలో ఎక్కడన్నా పెట్టానా? అన్నీ
వెతికాను.
ఎక్కడా లేదు.
అమ్మా, నాన్నా , నేనూ ఇల్లంతా
వెతికాము.
ఇంట్లో ఎక్కడా లేదు.
నాకు ఏడుపు ఒకటే తక్కువ. ఎంత
వెతికినా దొరకకపోవటం ఏమిటి? అలా ఎలా పోయింది? కనీసం టాగ్
కూడా తీయలేదు. టాప్ ఉంది. మరి స్కర్ట్ ఏమయినట్టు?
నిస్సత్తువగా అనిపించింది.
బాధతో నిండిపోయింది మనసు.
**
తోచిన డ్రెస్ వేసుకుని స్కూల్‌కి
వెళ్ళాను. అస్సలు ఉత్సాహంగా లేదు. ఎన్ని కలలు కన్నాను ఈ రోజు గురించి? ఎలా
రావలసినదాన్ని,
ఎలా వచ్చాను? ఈలోగా కొత్తగా
చేరిన అమ్మాయి పరిచయం అయ్యింది. అన్యమనస్కంగా ఉన్న నాకు, నా స్కర్ట్
గురించే ఆలోచిస్తున్న నాకు, ఆ అమ్మాయి వేసుకున్న స్కర్ట్ చూస్తే షాక్
కొట్టినట్టు అయ్యింది. అది నేను ముచ్చటపడి కొన్న స్కర్ట్ లాంటిదే. అదే రంగు... అదే...
అందరూ ఆ అమ్మాయి స్కర్ట్‌ని తెగ మెచ్చుకుంటున్నారు.
నేను మెల్లిగా ఇబ్బందిగా
"ఇదీ,
ఈ స్కర్ట్..." అన్నాను.
"బావుంది కదా, ఈ డ్రెస్ ఒక
మాగజైన్‌లో చూసాను. ఇలాంటిది నాక్కూడా ఉంటే ఎంత బావుంటుందో అనుకునేదాన్ని"
అంది ఆ అమ్మాయి తన స్కర్ట్‌ని ముచ్చటగా చూసుకుంటూ.
"అవును. చాలా
బావుంది. ఎక్కడ కొన్నారు?" అన్నాను.
"కొనలేదు. నేనూ, అమ్మా ఇద్దరం
కలిసి సంపాదించే డబ్బు ఇంటి ఖర్చులకే సరిపోవటం లేదు. ఇంక ఇలాంటివి కొనటమా?" అంది
ఆ అమ్మాయి.
"మరీ.." నాకర్ధం
కాలేదు.
"నిన్న డొనేషన్
షాప్ దగ్గర బాక్స్ తీసుకుంది అమ్మ. మాకు చాలాసార్లు డొనేషన్ బాక్సే ఆధారం." ఆ
అమ్మాయి కళ్ళలో విచారం తొంగిచూసింది.
"డొనేషన్ షాప్‌లో
డొనేషన్ బాక్సా?"
నాకేమీ అర్థం కావటం లేదు.
"నీకు తెలుసా, ఆ డబ్బాలో
అన్నిటికంటే పైన ఈ స్కర్ట్ నీట్‌గా
మడిచిపెట్టి ఉంది. కనీసం టాగ్ కూడా తీయలేదు. స్కర్ట్‌ని చూడగానే ఆశ్చర్యం వేసింది.
నాకు ఇష్టమైన స్కర్ట్ ఎలా ఇందులో? ఎవరు పెట్టి ఉంటారు? వారెవరైనా
కానీ, చాలా మంచిమనసు
ఉన్నవారు కదా?
నాకు కావలసింది తెలిసినట్టుగా! అదీ కొత్త డ్రెస్! అమ్మ చెప్పేది నిజమే- దేవుడు
ఎప్పుడూ ఒక కంట మనల్ని కనిపెడుతూనే ఉంటాడు." ఆ అమ్మాయి ఉత్సాహంగా
చెప్పుకుపోతూ ఉంది.
ఆ ఉత్సాహాన్నీ, ఆనందాన్నీ
చూస్తున్న నాకు ఏమనాలో తెలియలేదు. అసలు నేనెలా ఆ స్కర్ట్‌ని డొనేషన్ బాక్స్‌లో వేసాను? టాగ్ కూడా
తీయకుండా కొత్త డ్రెస్, కావాలని కొనుక్కున్న డ్రెస్, ఎలా అందులో
వేశాను?
**
"ఒకసారి మా
ఇంటికి వస్తావా?"
అని అడిగాను
"ఎందుకు?" అంది.
సంతోషంగా ఉన్న తనని చూస్తూ, "ఆ
స్కర్ట్ తాలూకు టాప్ మా ఇంట్లో ఉంది, నీకు అభ్యంతరం లేకపోతే నీకిద్దామనీ-" అన్నాను
నేను స్థిరమైన నవ్వుతో.
***