Tuesday, December 20, 2016

ఆటమ్ రంగులు....



ఆటమ్  గురించి, అప్పుడు కనబడే  రంగుల గురించీ ఎప్పుడూ వినటమే, లేక ఫొటోల్లో చూడటమే!! ఇప్పుడు ఇలా చూస్తుంటే: "నేనే ఇంత అందమైన బాటల వెంట నడుస్తున్నానా ?" అని ఆశ్చర్యం కలుగుతుంది.   

నక్షత్రాల్లాంటి ఎరుపు గులాబీల కలనేతలో ఉన్న మేపుల్ చెట్టు ఆకులు - పచ్చటి చెట్ల మధ్య  అదో అందం. విలక్షణమైన రంగుతో అలరారుతూ ఉంటుంది మేపుల్ చెట్టు. ఆస్వాదించటానికి కళ్ళతో పాటూ మనసు, హృదయం కూడా ఉండాలి!!   







నెలక్రితం పచ్చటి ఆకులు - ఇప్పుడు వర్ణాలు మారి లేత పసుపు నుంచి, బంగారు రంగులోకి, లేత ఎరుపు గులాబీ కలిసిన రంగులోకి, ఇటిక రంగులోకి మారితే, ఆ చెట్టుని చూడాల్సిందే! వివిధ వర్ణాల ఆకులతో  చెట్టు హరివిల్లై కళకళలాడుతుంది. ఇక్కడ  ఇప్పుడు ఎటు చూసినా ఈ శరత్కాల శోభే!!


మార్పు అందంగా ఉంటుంది సుమా, అని ఒక జీవిత సత్యం చెప్పకనే చెప్తున్నట్టు ఉంటుంది ఈ ఆటమ్ సీజన్. ఇవాళ పలు వర్ణాలు, రేపు బోసిపోయిన కొమ్మలు, కొంచం ఆగితే - కొత్త చిగుళ్ళూ!! ప్రతి మార్పుతో ఒకటి కోల్పోయి మరొకటి పొందుతాము, మళ్ళీమళ్ళీ చివురిస్తాము సుమా అనే సత్యం మనకు తెయపరుస్తున్నట్టు; చెట్లు పలు వర్ణాలై, మనకు ఈ సత్యాన్ని గుర్తు చేసే పనిని  అవిశ్రాంతంగా చేస్తూనే ఉంటాయి. మనసు తలుపులు కొంచం తీసి వింటేనే కదా, దాని భాష మనకు అర్ధమయ్యెది?






చిన్న గాలి తెమ్మెర వస్తే చాలు, మబ్బు  చినుకుల్ని రాల్చినట్టు, చెట్టు ఆకుల్ని రాలుస్తుంది. జలజలా రాలిపడుతున్న ఆకుల్ని చూస్తే అనుమానం వస్తుంది, చెట్టుకు, కొమ్మకి ఇప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది అని. నేల రంగురంగుల తివాచీ పరిచినట్టు దర్జాగా ఉంటుంది. అసలే చలికాలం కదా, నేలకు చెట్లు దుప్పటి కప్పుతున్నాయా? ఏమో? వాటి మధ్య ఎలాంటి అనుబంధం ఉందో మన చిన్ని బుర్రలకి ఏమర్ధమవుతుంది?


మెత్తగా కొమ్మనుంచి విడిపోయి సుతారంగా, అలవోకగా  నేలను చేరుతున్న ఆకులను చూస్తుంటే ఎంత బావుంటుందో? మన మనసుల్లో ఉన్న గతం / భవిష్యత్తు తాలుకు అనవసర ఆలోచనలు, ఆందోళనలు, కల్మషాలూ, భయాలు, మనల్ని వెనక్కు లాగే ఆలోచనలు, అశాంతికి గురిచేసే ఆలోచనలు; అన్నీ అన్నీ ఈ ఆటమ్ ఆకులలాగా, ఇంతే సున్నితంగా, సులభంగా మన మనసు పొరలలోనుంచి రాలిపోయి, మనసు కడిగిన ముత్యమై చివురించినట్టు అనిపిస్తుంది. ఈ క్షణం ఘనీభవించినట్టు, మనం వర్తమానం లో మిగిలిపోయినట్టు - నిర్మలంగా, తేటగా, హాయిగా - కాలం ఒక్క క్షణం ఆగుతుంది మనల్ని మనకు గుర్తు చేస్తున్నట్టు.