Monday, January 27, 2020

నాకు నచ్చిన పుస్తకం



The Days of Abandonment
Elena Ferrante
Translated from the Italian by Ann Goldstein



ఎలీనా ఫెరాంటే.

ఇటలీలో ప్రముఖమైన, ఎవరికీ తెలియని రచయిత్రి అంటారు జేమ్స్‌వుడ్ ఆవిడని పరిచయం చేస్తూ. ఎలీనా ఫెరాంటే ఆవిడ కలం పేరు. ఆవిడ ఎవరో, ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. తన మొదటి పుస్తకం ప్రచురించినప్పుడే ఎట్టి పరిస్థితుల్లోనూ పుస్తకం ప్రమోట్ చేయటానికి కానీ, ఇంటర్వ్యూలూ టాక్‌షోలకు కానీ, అవార్డులు ఏమన్నా వస్తే  స్వీకరించటానికి కానీ తను ఎక్కడికీ రానని ప్రచురణ కర్తలతో ఒప్పందం చేసుకున్నారట ఆవిడ. ప్రెస్ చాలా శోధించినా ఆవిడ ఎవరూ అన్నది ఖచ్చితంగా తెలుసుకోలేకపోయారని అంటారు.

డేస్ ఆఫ్ అబాన్‌డన్‌మెంట్ ఆవిడ రాసిన నవలలలో పేరుపొందిన నవల. ఇది ఒక స్త్రీ కథ. ఓల్గా అనే పాత్ర కథ. భర్తవదిలెయ్యటం, ఓల్గా పడే క్షోభ, అందులోంచి తేరుకుని మళ్ళీ మామూలుగా జీవించటానికి ఆమె చేసే ప్రయత్నం – ఇదీ కథ స్థూలంగా. రచన చిక్కగా, నిజాయితీగా, తీక్షణంగా, పదునుగా ఉంటుంది. మొదలుపెడితే చివరివరకూ ఆగకుండా చదివేయాల్సిందే!

ఓల్గాకి పెళ్లై పదిహేనేళ్లవుతుంది. ఇద్దరు పిల్లలు ఉంటారు. ఒక మధ్యాహ్నం భోజనం చేసి నేనిక నీతో ఉండలేను, వెళ్లిపోతున్నాను అని ఓల్గా భర్త వెళ్లిపోతాడు. అక్కడినుంచీ అతలాకుతలమయ్యే ఓల్గా మనఃస్థితే మిగతా కథంతా. నా సమయాన్ని మొత్తం అతనికిచ్చాను అతను ఎదగాలని. నా కలలనన్నింటినీ పక్కన పెట్టేసాను అతని ఆశలు తీరాలని. ఇల్లూ పిల్లలూ వంటా పద్దులూ లాంటి రసహీనమైన పనులన్నింటినీ నేను ఉత్సాహంగానే చేస్తూ, అతను తన ఆశాసౌధాల మెట్లు పట్టుదలగా ఎక్కుతుంటే చూసి ఆనందించాను. నేను అతని సెకనులలో క్షణాల్లో గంటల్లో కలిసిపోయాను. నేనంటూ వేరే లేకుండా పోయాను. నా జీవితంలో అతిముఖ్యమైన కాలాన్ని అతను నానుంచి తీసేసుకుని, ఇద్దరం పడిన కష్టం తాలూకు ఫలాలు వేరొకరికి అందించటానికి వెళ్లిపోయాడు. ఎవరి ఆనందంకోసం పదిహేనేళ్లు నా ఆనందాన్నీ కలల్నీ సమయాన్నీ శరీరాన్నీ ధారపోసానో, అతనికి ఇప్పటి నేను అక్కర్లేదు. ఇప్పటి నా శరీరం అక్కర్లేదు. ఇప్పటి మా సంసారంఅక్కర్లేదు. ఒకప్పటి నేనులా (నా శరీరంలా)  ఉండే అమ్మాయికోసం, ఇంటినీ పిల్లల్నీ బాధ్యతల్నీ నాకొదిలి వెళ్లిపోయాడు. ఎంత సులభం అతనికి! నేనూ అన్నింటినీ వదిలి వెళ్లగలనా?”

ఇప్పుడు ఓల్గాకి ఉద్యోగం లేదు. ఎదురుగా బాధ్యతలు, బిల్లులు. భయం, కసి, ఉక్రోషం, ఎలాగైనా భర్తని తిరిగి తన సొంతం చేసుకోవాలన్న తాపత్రయం….ఓల్గా స్వభావమే మారిపోతుంది. తనను తను పట్టించుకోదు. ఇంటిని పట్టించుకోదు. పిల్లలని పట్టించుకోదు. ఒంటరితనం  ఆమెను కమ్ముకుంటూ ఉంటుంది. తను మానసికంగా కుంగిపోతోందని ఆమెకు తెలుసు. తనలోని సంఘర్షణనీ, తనేమైనా తప్పు చేసిందా అన్న ప్రశ్ననీ, తన పరిస్థితినీ విశ్లేషించుకుని అర్థం చేసుకుని బయటపడే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఆమె- అదంత సులువు కాదని తెలిసినా. అదే సమయంలో నువ్వు కూడా మీ ఆయన లాగానే క్రూరురాలివి,’ అని పక్కింటి అతను అన్న మాటలు ఓల్గాను మరింత కుదిపేస్తాయి.

భర్తతో గడిపిన జీవితంలో తనను తను కోల్పోవటం అన్నది పక్కనపెడితే, తను అతనిలా మారిపోయిందా అన్న ప్రశ్న ఆమెను వేధిస్తుంది. తనలో జీర్ణించుకుపోయిన అతని అలవాట్లనుంచీ ఆలోచనలనుంచీ బయటపడి తను తనుగా మిగలటం తన ముఖ్యమైన పని అని నిర్ణయించుకుంటుంది. తనకు తనే బలం అని తెలుసుకుని తిరిగి జీవించటానికి ఉపక్రమిస్తుంది.

ఈ కథని ఓల్గా చెబుతుంది. పారిస్ రివ్యూఇంటర్వ్యూలో రచయిత్రి ఇలా అంటారు: “రచయిత అనేవాడికి తనకు తెలిసిన విషయం చెప్పాలన్న తాపత్రయం ఉండవచ్చు. కానీ ఆ చెప్పే విషయానికి సరిపోయే భాష, రాసే వాక్యాలలో విషయానికి సరిపోయే లయ (రిథమ్), ఆ కథకు కావల్సిన టోన్ ఉండాలి. అప్పుడే ఆ కథ జీవాన్ని పోసుకుంటుంది”. దీన్ని ఆవిడ సంపూర్ణంగా అమలుపరచడం నవల మొత్తం కనిపిస్తూ ఉంటుంది.

ఓల్గా ఒక ఉన్మాదస్థితికీ, నార్మల్సీకీ మధ్యలో ఊగిసలాడుతూ చేసే ప్రయాణం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. రచయిత్రి భాషపైన చూపించే పట్టు, అందులో కనిపించే శక్తి, పచ్చిదనం, తీవ్రత, అర్జెన్సీ ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఓల్గా పాత్ర ఎంతకు దిగజారినా క్షమించేసి జాలిపడగలిగినంత క్రెడిబిలిటీ ఉంది నేరేషన్‌‌కి. ఒక స్త్రీ తనని తాను ఎన్ని విధాలుగా కోల్పోతుంది, తిరిగి తన అస్తిత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం ఎంత కష్టం అన్న విషయం చాలాకాలం మనల్ని అంటిపెట్టుకుని ఉంటుంది.  చాప్టర్స్ కూడా మరీ పెద్దగా లేకుండా, ఒక దాంట్లోంచి ఇంకో చాప్టర్‌‌లోకి బలంగా లాక్కెళ్లిపోతాయి.

నవలలో అంతర్లీనంగా వినిపించే కథలూ సంఘటనలూ చాలా ఉన్నాయి. ఓల్గాని ముంచెత్తే జ్ఞాపకాలు, సంఘంలో భర్త విడిచిపెట్టిన స్త్రీని ఎలా చూస్తారూ, ఆ భార్య తనని తాను ఎలా చూసుకుంటుందీ, మదర్‌హుడ్ అన్న చట్రంలో ఇరికించబడిన స్త్రీ నోటివెంట నేను ఎంత క్లీన్ చేసుకున్నా ఆ తల్లితనం తాలూకు కంపు నా శరీరాన్ని వదిలిపెట్టడం లేదూఅన్న మాట ఎలా ధ్వనిస్తుందీ- ఇంకా ఇలాంటి ప్రశ్నలు ఎన్నో హాంట్ చేస్తాయి.

ప్రస్తుతం ఫెరాంటె ఫీవర్ నడుస్తోంది! ఆవిడ నవల ఇంకోటి వెంటనే చదవాలి అనిపించేలా ఈ నవల ఉంది!