Sunday, November 17, 2013

నాకు నచ్చిన సినిమా!! Still Walking(2008) Japan.

నాకు నచ్చిన సినిమా!!









సినిమా పేరు : స్టిల్ వాకింగ్ : 2008
భాష : జాపనీస్
డైరెక్టర్ : హిరోకాజు కొరీడా./ Hirokazu Koreeda.


ఈ సినిమా నేను చూసిన మొట్టమొదటి జపనీస్ సినిమా.

చాలా అందమైన సినిమా. సినిమాలో లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఆ చెట్లూ, ఆ పక్షుల కూజితాలూ,ఆ సముద్రం.... అసలు ఆ ప్రదేశం ఎంత అందంగా ఉందంటే, ఇలాంటి చోట మనం ఉంటే ఎంత బావుండునో కదా అనిపించేలా ఉంది.

మ్యూజిక్ ఎంత ఉండాలో అంత, తూకం వేసినట్టు అమర్చారు. ఇందులో వినిపించే పాట "Blue Lights of  Yokohama" చాలా హృద్యంగా వినిపిస్తుంది.

ఇక కథ చాలా సింపుల్ కథ. ఒక కుటుంబం, తల్లి తండ్రీ (కొంచం వయసు మళ్లిన), వాళ్ళ పిల్లలు ముగ్గురు - ఇద్దరు కొడుకులు (ఒక కొడుకు చనిపోయి ఉంటాడు), ఒక కూతురు, వాళ్ళ కుటుంబాలు. పిల్లలు తలిదండ్రుల దగ్గరికి వస్తారు, పెద్ద కొడుకు  మరణించిన రోజు అందరూ కలిసి అతనిని స్మరించుకోవాలీ, తమ రెస్పెక్ట్స్ పే చెయ్యాలి అని. రెండో కొడుకు ర్యోటో, తన భార్య (ఆమెకిది రెండో పెళ్లి, ఒక పదేళ్ళ కొడుకు ఉంటారు) తో వస్తాడు. వాళ్ళు తమని ఈ కుటుంబం స్వాగతిస్తుందా, లేదా  అన్న టెన్షన్ లో ఉంటారు. కూతురు చినమీ, భర్త ఇద్దరు పిల్లలు, అక్కడ ఆ ఇంట్లో ఒక పోర్షన్ తమకు ఇస్తే బావుండు అన్న ఆలోచనతో వస్తారు. భర్త ఆధిపత్యంలో జీవితాన్ని గడిపిన తల్లి. వీళ్ళ మధ్య కనబడీ కనబడకుండా టెన్షన్స్.

ప్రపంచంలో అన్నిచోట్లా (దేశ కాలమాన పరిస్థితులు ఏవైనా గానీ) ప్రతి కుటుంబంలో ఇవే టెన్షన్స్!!

నాకనిపిస్తుంది, మనమంతా మానవ సంబంధాల చట్రంలో ఒక్కటే...మన  సమస్యలన్నీ మౌలికంగా ఒక్కటే, కొద్దో గొప్పో తేడాతో. తండ్రీ కొడుకుల మధ్య దూరం, భార్యా భర్తల మధ్య కనిపించని దూరం, ఆశ, కోపం, నిస్పృహ, మమకారం, ప్రేమ, ద్వేషం. ..వీటి అన్నిటినీ అతి సహజంగా చూపించారు కొరిడా గారు.

చనిపోయిన కొడుకు గురించి కాకుండా బ్రతికున్న తమ గురించి ఆలోచించవచ్చుకదా అన్న ఆక్రోశం కూతురిది ఐతే, తనను పెద్దకొడుకుతో పోల్చి , కేవలం ఒక డాక్టర్ కానందుకు  అసలు ఎందుకూ పనికి రానివాడు అన్నట్టు ఎందుకు ట్రీట్ చెయ్యలీ అని రెండో కొడుకు బాధ. భర్త ఎవరితోనో సన్నిహితంగా ఉన్న సంగతి గమనించినా, తన బాధని మనసులోనే దాచుకుని మౌనం వహించిన తల్లి, ఆ విషయం తను ముసలివాడైయ్యాక తెలుసుకుని ఆశ్చర్యపడి, చలించే భర్త.....అన్నీ తెలిసినవే, విన్నవే, చూసినవే...కానీ అన్నీ చాలా సున్నితంగా తెరకి ఎక్కించిన తీరు మనల్ని గెలుచుకుంటుంది.


అంతే కాదు, ఇందులో మనకు జపనీస్ ఇళ్లూ, వాళ్ళ పద్దతులూ, వాళ్ళ  మర్యాదలూ పరిచయం ఆవుతాయి. భిన్నమైన మనుషులూ, వాతావరణాలూ, సంస్కృతులూ...చాలా ఇంటరెస్టింగ్ గా అనిపించింది చూస్తూ ఉంటే. ఇంకో కొత్త ప్రపంచపు ద్వారాలు కొద్దిగా తెరుచుకున్నట్టుగా అనిపించింది. ఒకప్పుడు ఒక పుస్తకం చదివి సమురాయ్ (జాపనీస్ యోధుల)  గురించి తెలుసుకుని ఆశ్చర్య పోయాను. అందుకే, ఒక మంచి పుస్తకం చదివినా, ఒక మంచి సినిమా చూసినా కొత్త విషయాలు తెలుసుకోవటం, మనుషుల్లోని కొత్త కోణాల్ని తెలుసుకోవటం జరుగుతుంది అని, అవి మన ఎదుగుదలకు ఎంతో ఉపకరిస్తాయని నేను అనుకుంటాను.

నాకు నచ్చింది ఈ సినిమా...