ఈ నెల నేను చదివిన పుస్తకాలు ఎంత విభిన్నమైనవో అంత అద్భుతమైనవి కూడా! అందుకే పుస్తకాలంటే నాకిష్టం!
ఫిక్షన్‌కంటే కూడా నాన్-ఫిక్షన్ చదవడం నాకు ఎక్కువ ఇష్టం. రకరకాల వాస్తవాలని తెలియచెప్పి, నాక్కనబడని చరిత్రనీ, జీవితాల్నీ పరిచయం చేస్తాయి ఈ పుస్తకాలు. నేను చదివిన పుస్తకాల పరిచయం - చాలా సంక్షిప్తంగా - ఇక్కడ:
1) Never Let Me Go - Kazuo Ishiguro (2005)
ఈ పుస్తకం 2005 బుకర్ ప్రైజ్ కి, నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కల్ అవార్డ్ కి నామినేట్ అయ్యింది.
అవయవ దానం చెయ్యటానికి పెంచబడ్ద అనాథ (మూలాలు తెలీవు మనకి, పిల్లలకి కూడా) పిల్లల గురించిన కథ ఇది. ఎలా వారు తమదైన ఒక లోకంలో (స్కూల్‌లో) పెంచబడతారూ; ఎలా కేరర్స్‌గా, ఆ తరవాత డోనర్స్‌గా మారతారూ, ఈ లోపల ఆ ప్రపంచంలో జరిగే ప్రేమలూ, ప్రేమ వైఫల్యాలూ, తమ మూలాల గురించిన తపనలూ, వెతుకులాటలూ, ఆకర్షణలూ, ఆనందాలూ, స్నేహాలూ, విషాదాలూ - మనల్ని ముంచెత్తుతాయి . అప్పుడప్పుడూ రచయిత ఆవిష్కరించే జీవిత సత్యాలూ మనల్ని ఆవరిస్తాయి. అన్నిటికంటే విషాదం, వీళ్ళ జీవితం కేవలం అవయవ దానానికే పరిమితం అవటం, అంతకు మించిన జీవితం ఉందని వీరికి తెలియకపోవటం. టీచర్లూ చెప్పరు. ఏదో ఉందని తెలుసు, అదేమిటో తెలీదు. పుస్తకం పూర్తికాగానే, జీవితం అందరూ ఆనందంగా జీవించటానికి అయినప్పుడు, కొంతమంది సమిధలుగా మారటం సమాజపు నైతికతా? అన్న ప్రశ్న మనకు రాక మానదు, మనసు భారం కాక మానదు.
2) Hourglass : Time, Memory, Marriage - Dani Shapiro (2017)
Memoir - ఇది రచయిత్రి తన 18 ఏళ్ళ వైవాహిక జీవితం లోని అంశాలను గురించి రాసుకున్న జ్ఞాపకాలు.
సమయంతో పాటూ వివాహ బంధంలో చోటు చేసుకునే మార్పులూ, కలిగే పరిణామాలూ, కలిసి చేసే ప్రయాణం లో ఎంత మనం పొందుతున్నాం, ఎంత మనల్ని మనం కోల్పోతున్నాం అన్న విషయాల గురించి తనదైన పద్దతిలో అతి సూక్ష్మమైన పలు అంశాలను స్పృశిస్తూ, గుర్తు తెచ్చుకుంటూ రచయిత్రి అంటారు ఒకచోట : "What must we summon and continue to summon in order to form ourselves toward, against, alongside another person for the duration? To join ourselves to the unknown? What steadfastness of spirit? What relentless faith?" ఎంతో అందంగా కనిపించే ఈ అతి ముఖ్యమైన బంధం రకరకాల పరిస్థితులని తట్టుకుని నిలబడాలంటే ఎంత మానసిక సమతుల్యత, నమ్మకం, అర్థం చేసుకునే లక్షణం, సర్దుబాటు మనస్తత్వం అవసరమో అలోచింపజేసే పుస్తకం.
3) మా నాయన బాలయ్య - వై బి సత్యనారాయణ (2013)
తన తండ్రి గురించీ తమ కుటుంబం గురించీ రచయిత వై బి సత్యనారాయణ గారు రాసిన ఆత్మకథ. ఇంగ్లీష్ నుంచి పి. సత్యవతి గారి అనువాదం.
ఒక అనూహ్యమైన జీవిత కాలపు చరిత్ర. వివక్షకు గురైన ఒక వ్యక్తి యొక్క స్వాభిమానం, పట్టుదల, ఆత్మవిశ్వాసం, అలుపన్నది ఎరుగని ప్రయత్నం, లక్శ్యసాధనే జీవిత ధ్యేయం - వెరసి ఒక ఉన్నతమైన లక్ష్యం - వీటన్నిటి కలబోతే ఈ పుస్తకం. జీవితంలో అత్యంత వ్యతిరేకమైన పరిస్థితులని ఎదిరించి అనుకున్నది సాధించటం ఎలా అని సాధికారికంగా చూపించిన పుస్తకం. ఒక వ్యక్తిత్వం మానవీయ విలువల కలబోతతో ఎలా పూర్ణత్వం సంపాదించుకుంది అని చెప్పే పుస్తకం. Inspiring indeed!
4) Between The World and Me - Ta-Nehisi Coates (2015)
నేషనల్ బుక్ అవార్డ్ ఫర్ నాన్ ఫిక్షన్ 2015 విజేత; పులిట్జర్ ప్రైజ్ ఫర్ జనరల్ నాన్ ఫిక్షన్ 2016 కి నామినేషన్.
ఇది రచయిత తన టీనేజ్ కొడుకుకి రాసిన లేఖ. అమెరికాలో ఒక నల్లజాతీయుడిగా బ్రతకటం గురించిన పుస్తకం. తన జీవితంలో కొన్ని విషయాలను తీసుకుని వాటినుంచి ఇంకా పూర్తిగా మారని ప్రస్తుతాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం. కదిలించి, కుదించి కూలేసే పదునైన భాష రచయిత సొంతం. ఎక్కడైనా ఎవరైనా వివక్షకు గురి అవటం దారుణం. ఆఫ్రికా నుంచి తీసుకొచ్చి, అమెరికా వారసత్వం ఇచ్చి, తోటి మనిషిగా మాత్రం గుర్తించకపోవడం ఇంకా దారుణం. కేవలం తమ శరీరాన్ని రక్షించుకోవటం కొసం ఎన్ని అగచాట్లు పడాలో చెప్తూ : "Not being violent enough could cost me my body. Being too violent could cost me my body." అంటారు రచయిత. ఇంత నెగటివ్ పరిస్ఠితిలోనూ తన భావ ప్రకటనకు తనే సంకెల వేసుకోకుండా, వెరవకుండా ముందుకు నడుస్తున్న రచయితకు జోహార్లు!
5) The Fire Next Time - James Baldwin (1963)
పైన చెప్పిన Ta-Nehisi Coates పుస్తకానికి ఇది ఇన్‌స్పిరేషన్ అంటే చదివాను.
ఇందులో మొదటి భాగం - 'My Dungen Shook' - బాల్ద్విన్ తన అల్లుడికి రాసిన ఉత్తరం. చాలా నిష్కర్షగా రాసిన ఉత్తరం. నల్లవారి అణచివేత, వాటి వెనక ఉన్న తెల్లవారి రాజకీయ చతురత; దానిని మానసికంగా ఒప్పుకోకూడదూ, అలాగని సంయమనం వీడకూడదు అని చెప్పే రచన. భాష ఇంత తేలిగ్గా, ఇంత స్పష్టంగా, అర్థవంతంగా వాడటం చూస్తే వీళ్ళు ఇంత అరాచక పరిస్థితుల్లో కూడా ఇంతలా ఎలా చదువుకున్నారు అని అనిపించక మానదు. ఒక నాన్-ఫిక్షన్ రచనని కూడా వదిలిపెట్టకుండా చదివింపచేసేటట్టుగా రాయటం - చాలా గొప్పవిషయం.
6) Hunger : A Memoir Of (My) Body - Roxane Gay -2017
జూన్ 2017 లో విడుదలైన ఈపుస్తకం కూడా ఒక జ్ఞాపకాల మాలిక. మెమ్‌వా (Memoir).
ఈ రచయిత్రి ప్రస్తుతపు బరువు సుమారు 400 పౌండ్లు! తన శరీరం లావుగా ఎందుకుందో, ఎందుకు అలా ఉంచుకుందో, దాని వెనక తనను హింసించే సామూహిక అత్యాచారపు నీడలు ఏమిటో, ఇవేమీ తెలియని ప్రపంచం తనని ఎన్ని ఇబ్బందులకు గురిచేసిందో మనకు చెప్తారు రచయిత్రి. జీవితపు లోతుల్లొకి వెళ్ళి, మళ్ళీ పైకి తేలిన ఒక స్త్రీ కథ ఇది. ఆత్మన్యూనత, ఆత్మాభిమానం, ప్రతి విషయంలోనూ, ప్రతి క్షణం వెంటాడి వేధించే ఒబేసిటీ, దానివెనక ఉన్న ఆత్మక్షోభ! పుస్తకం పొడుగునా అంతర్లీనంగా ఒక ఆశావహ దృక్పథం కనిపిస్తుంది. అవసరం అయినప్పుడు సహాయం కోరటానికి జంకకూడదనీ, మన తల్లిదండ్రుల దగ్గర మన భయాలనీ, ఆవేదనలనీ చెప్పుకోవాలనీ, సమాజంలో ఒక వ్యక్తికి ఇవ్వవలసిన గౌరవం రూపాన్ని బట్టి కాదూ వ్యక్తిత్వాన్ని బట్టి అనీ మరోసారి గుర్తు చేస్తారు రచయిత్రి.
7) Death in the Clouds - Agatha Christie
ఆహా... ఈవిడ పుస్తకం ఏదైనా సరే కింద పెట్టలేం కదా! సీరియస్ పుస్తకాల మధ్య ఓ ఆటవిడుపు...
8) Marlena - Julie Buntin (2017)
ఇద్దరు టీనేజ్ అమ్మయిల మధ్య స్నేహం. ఇద్దరూ డ్రగ్స్‌కి బానిసలవటం, ఒకరు చనిపోవటం, వేరొకరు కష్టపడి డ్రగ్స్ నుంచి బయట పడి మామూలు జీవితం గడపటానికి చేసే కృషి. చాలా అలజడికి గురిచేసే నవల. ఎంత మంది ఈ ఉత్పాతానికి బలి అవుతున్నారో, ఎన్ని జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయో అన్న అలజడి కలుగుతూ ఉంటుంది...
**
మరికొన్ని నెలలు సెలవుమీదే ఉంటాను కాబట్టి, ఇలాంటి పరిచయాలు మరికొన్ని నెలలపాటు మీకు తప్పవని నాకు అనిపిస్తోంది! :D