Friday, June 28, 2019

నాకు నచ్చిన పుస్తకం - ఫ్రాంకెన్‌స్టైన్





“Man,” I cried, “how ignorant art thou in thy pride of wisdom!”
-       Mary Shelley, “Frankenstein”

హాయిగా సముద్రతీరంలో చల్లటి పిల్లగాలుల్ని ఆస్వాదిస్తున్న వ్యక్తి ఉన్నట్టుండి ఒక సుడిగుండంలో చిక్కుకుంటే? నిరాశానిస్పృహలు మనసునీ, ఆంతర్యాన్నీ కమ్మేసి విచలితం చేస్తే? చేసిన తప్పు చెదలు తొలచినట్టు మనసును తొలిచేస్తూ, ప్రశ్నిస్తూ, కలవరపెడుతూ ఉంటే, జీవించాలన్న ఇచ్ఛ నశించిపోతే ఎలా ఉంటుంది? ఏదో ఒక వెలుతురు రేఖ కనిపించి ఒక ఆశ మొలకెత్తితే, మనసును కోసేసే ఆలోచనల  తాకిడి నుంచి బయటపడి, మళ్ళీ సముద్రాన్నీ ఆ అందాన్నీ చూసి ఆనందిద్దామనుకున్నప్పుడు- కథలూ, జీవితాలూ ఎల్లప్పుడూ అనుకున్నట్టుగా కంచికి చేరుతూ, శుభం కార్డులు పడుతూ ఉండవని తెలిస్తే? ఒక సునామీ హోరు ఎలా ఉంటుంది?  ఒక ఇసుక తుఫాను హోరు ఎలా ఉంటుంది? ఫెళ ఫెళ మంటూ విరిగిపడితున్న మంచు చరియలలో చిక్కుకుని వాటి ధాటినుంచి తప్పించుకుని బయటపడటానికి విశ్వప్రయత్నం చేస్తూ జీవన్మరణ సమస్యను ప్రత్యక్షంగా అనుభవిస్తున్న మనిషి మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఒక మనిషి అంతః సంఘర్షణ, మంచీ చెడుల మధ్య జరిగే ఆత్మశోధన, తనకూ తనలోని మనిషికీ మధ్య జరిగే విలువల సంఘర్షణ, మానసిక వ్యాకులత ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటాయా? ఇంత ప్రళయాంతకంగా ఉంటాయా?

ఫ్రాంకెన్‌స్టైన్ నవల మనల్ని ఒక సుడిగుండంలోకి లాగేసినట్టు లాగేస్తుంది. మనం ఆ కథలోని నాయక ప్రతినాయకులతో సమానంగా ఎవరో ఒకరి తరఫున మనలో మనమే వాదించేసుకుంటూ కథతో, కథలో కొట్టుకుపోతూ అన్ని రసాలనూ అనుభవిస్తూ ఉంటాం. భయం, జుగుప్స, నిరాశానిస్పృహలు, అంతులేని ఆవేదన, నిరాకరణ, పశ్చాత్తాపం, క్షోభ, దుఃఖం, ఆనందం, రొమాంటిక్ లవ్ , మంచి చెడుల మధ్య నిత్యం జరిగే యుద్ధం , జీవితం గురించి ఆలోచన, ఒక సాన్నిహిత్యం కోసం,  ప్రేమ కోసం తపన – వీటన్నింటిలోనుంచీ కవితాత్మకంగా సాగే రచనా శైలిలోంచి, ప్రకృతి వర్ణనలలోనుంచి మనమూ అలా అలవోకగా ప్రవహించేస్తూ ఉంటాం. ఈ ఉత్కంఠభరిత ప్రయాణంలో అప్పుడప్పుడూ గోళ్ళు కొరుక్కూంటూ మనల్ని మనం కోల్పోతాం.

మేరీ షెల్లీ తన 19వ ఏట రాసిన ఈ నవల 200 సంవత్సరాల క్రితం- అంటే 1818లో -ప్రచురింపబడింది. మాడర్న్ ప్రొమెథియస్‌గా పేరుపొందిన ఈ నవల ఉత్తరరూపంలో సాగే రచన. వాల్టన్ అనే సాహసి తన సోదరికి రాసే ఉత్తరాలలో కథ చెప్పబడుతుంది. కథానాయకుడు విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ ప్రమాదంలో చిక్కుకుని కొనవూపిరితో ఉన్నప్పుడు వాల్టన్ అతనిని రక్షిస్తాడు. అప్పుడు వాల్టన్‌కి అతను చెప్పిన కథే, ఈ నవల. కథలో కథ- ప్రతినాయకుడు నాయకుడికి చెప్పే కథ. అంటే ఒకపక్క విక్టర్ తన గతాన్ని విశ్లేషిస్తూ వాల్టన్‌కి కథలా చెబుతుంటే, మాన్‌స్టర్ కూడా తన గతాన్ని సాలోచనగా వీక్షిస్తూ నాయకుడికి చెబ్తున్న పంథాలో కథ సాగుతుంది.  కథలో కథ, ఆ కథలో మరో కథలా చుట్లుచుట్లుగా,  రిఫ్లెక్టివ్ నెరేషన్ ధోరణిలో నవల కదులుతుంది అన్నమాట.

నాయకుడు విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్, అతను సృష్టించిన ప్రతినాయకుడు మాన్‌స్టర్వీరిద్దరూ నవల సింహభాగాన్ని ఆక్రమిస్తారు. ఇందులో స్త్రీ పాత్రలు కూడా వాటికున్న పరిధిలో బలంగానే చిత్రీకరింపబడ్డాయి. వాళ్లకొక వ్యక్తిత్వమూ ధైర్యమూ ఉంటుంది. కథానాయకుడు flawed hero, ప్రతినాయకుడు fallen angel గా ప్రసిద్ధిపొందిన ఈ నవల ఇంగ్లీష్ లిటరేచర్‌లో సైన్స్ అండ్ హారర్ (గోథిక్) ఎలిమెంట్‌ని ప్రవేశపెట్టిన తొలి నవల. సైన్స్ అండ్ హారర్ కంటే ఇందులో అడుగడుగునా కనిపించే ఆవేదన, కథానాయకుడు తనలో తను నిరంతరం ఎదుర్కునే - తనుచేసింది తప్పా ఒప్పా అన్న - సంఘర్షణ, ప్రతినాయకుడు ప్రతిక్షణం ప్రేమా ఆదరణల కోసం తపించడం, మనిషీ మానవత్వం అంటే ఏమిటి అన్న మీమాంస, బాహ్యరూపానికీ అంతర రూపానికీ మధ్య జరిగే పోరాటం – ఇలాంటి మానవీయ కోణాలే రెండువందల సంవత్సరాల తరవాత కూడా ఈ నవలని ఇంకా చదివిస్తోందీ, నిలబెడుతోందీ. ఇందులో అంత సమకాలీనత, సార్వజనీనత  ఉంది.

విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ యువకుడు. చిన్నప్పటినుంచీ లోహాలను బంగారం చేయటం వంటి శాస్త్రీయ పుస్తకాల పట్ల మక్కువ ఉన్నవాడు. ప్రేమపూర్వక వాతావరణంలో పెరిగినవాడు. లోటూ లేమీ తెలియనివాడు. ఉన్నత విద్య కోసం వేరే ఊరు వచ్చిన విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ మనిషికి ప్రతిరూపంలా ఉండే ఒక అందమైన కొత్త జీవిని సృష్టించాలన్న తపనలో పడి ప్రపంచాన్నే మర్చిపోతాడు. (భగవంతుడు మనిషిని సృష్టించినట్టు విక్టర్ తాను ఇంకో మనిషిని సృష్టించాలని అనుకోవటం జెనిసిస్‌కి పోలిక లాంటిది అన్న ఒక పరిశీలన ఉంది. అదే కాకుండా, ప్రొమెథియస్‌తో మరో పోలిక. ఆ రకంగా చూస్తే, ఈ నవల మొత్తం ఒక ఆలెగరీ.) మొత్తానికి మనిషి అవయవాలను సంపాదించి ప్రాణం పోయటంలో విజయం సాధిస్తాడు విక్టర్. ఆ మనిషి ఎలా ఉన్నాడు? ఎనిమిది అడుగుల ఎత్తు (విక్టర్ పనిలో సులువు కోసం అంత ఎత్తు ఎంచుకుంటాడు), లోపలి కండరాలు కనిపించేలా వాటిని కప్పుతున్న పల్చటి పసుపుపచ్చని శరీరం, నల్లటి జుట్టు, మెరిసే తెల్లని పళ్ళు, గీతల్లాంటి నల్లటి పెదవులూ, అన్నింటినీ మించి గాజులా నీటిపొరల్లా ఉన్న నిస్తేజమైన కళ్ళు – చూడగానే జుగుప్స, భయం కలిగే ఆకారం. విక్టర్‌కే అసహ్యం కలిగి హతాశుడై అక్కడినుంచి వెళ్ళిపోతాడు.(భగవంతుడు ఇలా తన సృష్టిని తృణీకరించడు అన్న వాదానికి నవల చోటిస్తుంది ఇక్కడ.) ఈ జీవికి ప్రత్యేకంగా పేరు లేదు. మాన్‌స్టర్ అనీ, రెచ్ అనీ, ఇలా పిలబడతాడే తప్ప వేరే పేరు లేదు. కానీ విక్టర్ ప్రాణం పోసిన ఇతను, “ఫ్రాంకెన్‌స్టైన్‌స్ మాన్‌స్టర్‌”గా  పుస్తక ప్రపంచంలో చిరకాలం నిలిచిపోయే పేరుని సంపాదించుకున్నాడు.

విక్టర్ ప్రతిసృష్టి వల్ల కలిగిన ఉత్పాతాలేంటి అన్నదే కథ. విక్టర్ ఒక సిద్ధాంత పరమైన ఉత్సుకతతో చేసిన ప్రయోగం ఇది. ఇందులో అతనికి దురుద్దేశాలు ఏమీ లేవు- ఒక అందమైన మానవ రూపాన్ని సృజించాలన్న తపన, కుతూహలం తప్ప. మనిషి తన పరిధిని దాటి చేసే ప్రయోగాలూ, ఫలితం వికటిస్తే ఏర్పడే పరిణామాల వెనక మనిషికీ అతను సృష్టించిన జీవికీ మధ్య జరిగే విలువల సంఘర్షణ తట్టుకోలేనట్టుగా ఉంటుంది. తనెంతో ఆశతో తయారు చేసిన  మానవ రూపం అంత అందవిహీనంగా ఉండటం చూసి వాపోతాడు విక్టర్. తనకూ ఆ మాన్‌‌స్టర్‌కూ ఏమాత్రం సంబంధం లేదన్నట్టు వెళ్లిపోతాడు. తనను సృష్టించినవాడే తనను వదిలేస్తే గాలికీ ధూళికీ అన్నట్టుగా ఎదుగుతాడు మాన్‌‌స్టర్‌. పసిమనసు, అమాయకత్వం, ప్రకృతిని ప్రేమించే లక్షణం ఉన్న అతను సమాజం తన రూపాన్ని చూసి భయపడుతోందన్న విషయం గ్రహిస్తాడు. తాను అందరిలాగా లేననీ, భయంకరంగా ఉంటాననీ గ్రహిస్తాడు. ఒంటరిగా తిరుగుతూ ఒక కుటుంబానికి వారికి తెలియకుండా సహాయం చేస్తూ వారిమధ్య ఉన్న ప్రేమానురాగాలు చూస్తాడు. తనకూ అలాంటి ఆప్యాయతా ప్రేమా కావాలని తపిస్తాడు. ఆ ఇంట్లో వారికి కనబడకుండా ఉంటూనే మిల్టన్స్ పారడైస్ లాస్ట్తదితర పుస్తకాలు చదువుతాడు. ఇక్కడ ఈ పుస్తకాన్ని రచయిత్రి ప్రస్తావించడం చాలా సందర్భోచితంగా ఉంటుంది. మాన్‌స్టర్ కూడా ఆ పుస్తకంలోలా ఒక అనాథ. ఒంటరి. తాను ఆడమ్‌లా మంచికి ప్రతీకా లేక సాటాన్‌లా చెడుకు ప్రతీకా అన్న మీమాంసకు గురై, తనను ఎవ్వరూ ప్రేమించరని తెలుసుకుని ఒంటరితనాన్ని భరించలేక చెడుని ఎంచుకుని, తను చదివిన పుస్తకంపారడైస్ లాస్ట్లో ఫాలెన్ ఏంజెల్‌లా, సాటాన్ పక్షాన ఉండటమే తనకు మంచి అనుకుంటాడు. అతను చదివిన పుస్తకం, అతని జీవితం దరిదాపు ఒకేలా ఉన్నాయని గుర్తుచేసేందుకే బహుశా రచయిత్రి ఈ పుస్తకాన్ని ఉపయోగించి ఉండవచ్చు. మాన్‌స్టర్ ఎప్పుడూ ఎదో చేస్తూ ఉంటే విక్టర్ మాత్రం ఒక రొమాంటిక్ హీరోలా బాధపడుతూ, తను చేసిన పనినుంచి పారిపోతూ, పలాయనవాదిలాగా, ఒక ముగింపు దిశగా అడుగులు వేయకపోవటం, యాక్షన్ తీసుకోకపోవటం, అతని వ్యక్తిత్వానికి మచ్చలా మిగులుతుంది. మాన్‌స్టర్ తన వాళ్లందరినీ చంపుతున్నాడని తెలిసినా బాధ్యత వహించకుండా కేవలం నిరాశానిస్పృహల లోతులలో కూరుకుపోతూ ఇందులో తన తప్పేమీ లేదన్నట్టు ఒక డినయల్‌లో ఉండటం, అతని బాధ్యతారాహిత్యం -  మనకి నచ్చదు. నా చుట్టూ ఉన్నవారంతా కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు. నేనొక్కడినే ఈ ఆనందాన్ని పొందలేని ఒంటరితనంలోకి విసిరేయబడ్డాను. కేవలం నీ మీద ప్రతీకారంతో నేను చేసే ఈ మారణ హోమం నాకు మనోవ్యధనే మిగులుస్తోంది. నేను వస్తుతః చెడ్డవాడిని కాను. నా బాధ్యత నీదే, నాకొక సహచరిని సృష్టించు, నేను సంతోషంగా ఉంటే  మంచివాడిలా ఉండిపోతాను - అని మాన్‌స్టర్ బాధపడుతూ విక్టర్ని వేడుకోవటం మనకు అతని పట్ల సానుభూతిని కలగజేస్తుంది. విక్టర్ పట్ల కొంత అసహనమూ కలుగుతుంది. తన కర్తవ్యం పట్ల నిర్లక్ష్యం, మాన్‌స్టర్ని అదుపుచేయలేని నిస్సహాయత, ఏ మాత్రం ప్రయత్నం చేయకుండా కేవలం దిగులుతో కుళ్లుతూ, లోలోపలికి కుంచించుకుపోతూ, కర్తవ్య శూన్యుడై ఉన్న విక్టర్ చివరికి మాన్‌స్టర్ని చంపడమే తనకు ఉన్న ఏకైక మార్గమని నిర్ణయించుకుని ప్రతినాయకుడిగా మారిపోతాడు. తనను పుట్టించిన విక్టర్ తనని వదిలెయ్యటం, సమాజం తనని ఒప్పుకోకపోవటం, ప్రేమానురాగాలకోసం తపిస్తూ వేచి ఉండటం, బెదిరించైనా తనకో సహచరిని ఇవ్వమని విక్టర్ని ప్రాధేయపడటం, ఆలోచనలతో సతమతమవుతున్నా కార్యోన్ముఖంగా అడుగేసే మాన్‌స్టర్ నాయకలక్షణాలను సంతరించుకోవటం కనిపిస్తుంది.

నాయకుడూ, ప్రతినాయకుడూ స్థానాలు మారటం కథలో కనిపించే ఒక ఐరనీ అయితే, విక్టర్ సృష్టించిన వ్యక్తి విక్టర్ని కూడా అంతమొందించటం కథలోని మరో ఐరనీ.

కథలో ప్రకృతిని రచయిత్రి వాడుకున్న తీరు కవితాత్మకమే కాదు, వాతావరణానికీ తగినంత బలాన్నీ, భావుతకనీ, బరువునీ, భయాన్నీ జోడించి మరింత కట్టుదిట్టంగా కథ నడవడానికి ఉపయోగపడింది. అలాగే బరువైన పొడవైన సంభాషణలు కూడా ఇందులో ఉన్నాయి. చివర్లో విక్టర్ పడవ సరంగులకి ఇచ్చిన ఉద్రేక పూరితమైన స్పీచ్ ఉత్తేజపరిచేదిగా, అప్పటివరకూ మనం చూసిన అతని వ్యక్తిత్వానికి భిన్నంగా ఉంటుంది. అక్కడక్కడా ఇంత పొడుగు స్పీచెస్ ఉన్నా, అవి కూడా చదివించేలా ఉండటం, కథ పట్టుని సడలించకపోవటం గొప్ప విషయం. 19 ఏళ్లకే ఆలోచనల్లో ఇంత గంభీరత, జీవితం పట్ల అవగాహన ఉండటం వాటిని అవసరమైనంత మేరకు కథలో కలిసిపోయేలా రచయిత్రి పలికించటం బావుంది.
-      మనసులలో స్వార్థం ప్రవేశించనంత కాలం మనుషులలో ప్రేమా కరుణా సేవాభావం సమృద్ధిగా ఉంటాయి.
-      జీవితం చాలా మొండిది. మనం దేన్నైతే ద్వేషిస్తామో అది మనల్ని అంటిపెట్టుకుని వస్తూ ఉంటుంది.
-      జాగ్రత్త! నేను భయమెరుగనివాడిని, అంచేత నేను బలవంతుడిని!
-      ఊహించని వేగంతో కదిలే పరిస్థితులతో కకావికలం అయ్యే మనిషి, ఖచ్చితంగా జరగబోయే పరిణామాలూ తెలిసీ ఏమీ చెయ్యలేని నిస్సహాయతకి గురైనప్పుడు, ఆశకీ నిరాశకీ అతీతంగా అతని మనస్సుని ఆవహించే నిశ్శబ్దం కలిగించే గొప్ప నొప్పి ఊహించలేనిది.

సున్నితమూ, లోతైన అనుభూతీ కలబోసిన జీవిత సత్యాలను ఎన్నింటినో ఇలా మన ముందుకు  తెస్తారు మేరీ షెల్లీ.

విక్టర్ సైన్స్‌కి పూచిన పువ్వైతే, మాన్‌స్టర్ సమాజంలోనుంచి వికసించిన పువ్వు. ఇద్దరూ తమ చుట్టూ ఉన్న వాతావరణానికి, పరిస్థితులకీ భిన్నమార్గాల్లో లొంగిపోయినవారే. కానీ మాన్‌స్టర్‌లో ఉన్న నిజాయితీ, అతనిలో తను చేస్తున్న కక్షసాధింపు చర్యల పట్ల పశ్చాత్తాపం, ఒంటరితనంతో పోరాటం, ప్రేమకోసం తపించటం మనల్ని అతని పక్షాన్నే ఉంచుతాయి. విచిత్రంగా ఇద్దరూ ఓడిపోతారు. మంచి చెడుల మధ్య నలిగిపోయే అంతఃసంఘర్షణ మాత్రం మిగిలిపోతుంది. మనం ఆలోచిస్తూనే ఉంటాం, ఇందులో ఎవరు గెలిచినట్టు, లేదా ఎవరు ఓడినట్టు అని. వాస్తవానికి గెలుపూ ఓటములకి అతీతంగా జీవితాలు ఉంటాయి. విక్టర్ – మాన్‌స్టర్ నాయక ప్రతినాయకులు కారు. రెండు జీవితాలు.

ఇంతగా మనసుని ప్రభావితం చేసే పుస్తకాలు కొన్నే ఉంటాయి. సైన్స్ అండ్ హారర్ వెలుగులో రెండు భిన్న మానవపార్శ్వాలను ఆలోచనాత్మకంగా నడపటం అంత తేలిక కాదు. ఇన్నేళ్ళయినా అందుకే ఒక క్లాసిక్ నవలగా మిగిలిపోయింది ఈ పుస్తకం.

చదివి మీ అభిప్రాయాలు కూడా పంచుకోండి.



Saturday, June 15, 2019

Random Thoughts

నాలో నిరంతరమై ప్రకాశిస్తూ, 
ప్రజ్వలిస్తున్న వెలుగు పుంతని, 
కళ్ళు తెరచి నే చూస్తున్నా. 
చుట్టూ పరుచుకున్న చీకటి వెనక
తెరలు తెరలుగా తొంగిచూస్తున్న, 

కాంతి ధారల్నే నే చూస్తున్నా!

వెలుగుజాడలతో కలిసి అడుగులేస్తున్న, 
మనసుని - మనిషిని, నే చూస్తున్నా!


Random Thoughts



The Present Moment