Notes on Grief
By Chimamanda Ngozi Adichie
*****
ఒక వ్యక్తి మరణానంతరం ఆ కుటుంబంలోని వ్యక్తులు దాన్నెలా తట్టుకుంటారన్నదానికి కొలమానాలు లేవు. ఆ బాధని ఎలా వ్యక్తీకరిస్తారన్నదానికి వ్యాకరణాలూ లేవు. భావోద్వేగాలు అభివ్యక్తీకరించే వ్యక్తుల్లో, పద్ధతుల్లో భిన్నత ఉన్నా, అంతర్లీనంగా అందరూ అనుభవించే దుఃఖం ఒక్కటే. ప్రస్తుత పాండెమిక్ సమయంలో మరణవార్తల గురించి ఎక్కువగా వింటున్నాం. అలాంటప్పుడు మరణం, అది కలిగించే దుఃఖం గురించిన పుస్తక పరిచయం ఇప్పుడు అవసరమా అనిపించినా, ఈ చిన్న పుస్తకం చదివాక(ఎనభై పేజీలే), నాలుగు వాక్యాలు రాయాలనే అనిపించింది.
కరోనా ప్రవేశించిన తొలినాళ్లలో, పోయిన సంవత్సరం జూన్‌లో, ఎనభైఎనిమిదేళ్ల తన తండ్రి మరణించడం (కరోనా వల్ల కాదు) రచయిత్రికి ఒక షాక్. ఆత్మకథగా సాగే ఈ పుస్తకంలో ఆమె తన తండ్రి మరణాన్ని ఒప్పుకోలేకపోవటం, అనుభవించిన దుఃఖం, మానసిక సంఘర్షణ, తండ్రితో ఉన్న అనుబంధం, ఆ జ్ఞాపకాలూ ఇంకా మరెన్నో ఇతరత్రా విషయాల గురించి ప్రస్తావిస్తుంది. గ్రీఫ్‌కి ఉండే ముఖ్యమైన అయిదు దశలూ - Denial, Anger, Bargaining, Depression and Acceptance - ఇందులో ఎక్కడో ఒకచోట కనిపిస్తాయి. ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక క్షణంలో, ఏదో ఒక రూపంలో, తన అనుకున్న వారిని కోల్పోయిన బాధని అనుభవించే ఉంటాడు. అంచేత ఈ పుస్తకంలో కనిపించిన బాధ సార్వత్రికమూ, సార్వకాలికము.
వివిధ దేశాల్లో ఉన్న తమ తోబుట్టువులంతా కలిసి నైజీరియాలో ఉన్న తండ్రితో జూమ్‌కాల్‌లో మాట్లాడినప్పుడు ఉత్సాహంగా మాట్లాడిన ఆయన, మూడు రోజుల తరవాత ఇక లేరని తెలుసుకోవటం అడీచి నమ్మలేకపోయిన విషాదం. “The news is like a vicious uprooting. I am yanked away from the world I have known since childhood.” చిన్నప్పటినుంచీ తనకు తెలిసిన ప్రపంచాన్ని తననుంచి, సమూలంగా వేర్లతోసహా పెకిలించివేసినట్టయింది. తను పెరిగిన ప్రపంచం, ఆ ప్రపంచాన్ని పరిచయం చేసిన తండ్రి, అతనితో ఉన్న అనుబంధం, అతని మరణాన్ని తొందరగా ఒప్పుకోనివ్వవు.
‘మౌర్నింగ్ పీరియడ్’ ఓ పరీక్షాకాలం. తనవారిని కోల్పోవడాన్ని ఒప్పుకోని మనసూ, తెగని వేదన, ఓదార్పునివ్వని సన్నిహితుల మాటలూ, ఆగని దినచర్యలు, నిర్వహించాల్సిన క్రతువులూ, విధులూ కన్నీటి స్పర్శతో తడిబారతాయి. “Grief is a cruel kind of education. You learn how ungentle mourning can be, how full of anger. You learn how glib condolences can feel.” శోకాన్ని భరించలేని, మరణాన్ని ఒప్పుకోలేని హృదయం, ఎందుకిలా జరిగింది అన్న కోపానికీ తావిస్తుంది. ఆ కోపం - నవ్వుతూ, తుళ్లుతూ మామూలుగా ముందుకెళ్తున్న ప్రపంచంపైనా, భగవంతుడిపైనా, తనపైనా, హఠాత్తుగా వెళ్లిపోయిన వ్యక్తిపైనా, ఓదార్పుమాటలు చెప్పేవారిపైనా - అన్నింటిపైనా ఉంటుంది. తండ్రి మరణం కలిగించిన కోపం, భయం వీటిని చూసి సిగ్గుపడేది రచయిత్రి. పోస్ట్‌మాన్ రావటం, సభలలో మాట్లాడమని తనకు ఆహ్వానాలు అందటం చూసినప్పుడు “నా హృదయం ముక్కలుచెక్కలైపోయి ఉంటే, ఈ ప్రపంచమంతా ఏమీ జరగనట్టు ఇలా మామూలుగా ఎలా జరిగిపోతోంది?” అన్న అర్థంకాని ప్రశ్నలు ఆమెలో మెదిలేవి. తండ్రిని కోల్పోయిన బాధలోంచి నిస్సహాయంగా పుట్టిన కోపం ఒంటరితనాన్ని కోరుకున్నా, ఎవరినీ చూడటానికీ, ఫోన్లలో మాట్లాడటానికీ, జవాబులు ఇవ్వడానికి ఇష్టపడకపోయినా, ఓదార్పు మాటలు శుష్కంగా, వ్యర్థంగా అనిపించినా అవన్నీ బాధలోంచి పుట్టినవే. తనని ఓదార్చటానికి వచ్చిన వాళ్ల సహృదయత, కరుణ అర్థమవుతూనే ఉంటుంది, కానీ ఓ ఉదాసీనత చుట్టుముడుతుంది. “How facile to preach about the permanence of death, when it is, in fact, the very permanence of death that is the source of anguish. I wince now at the words I said in the past to grieving friends. ‘Find peace in your memories,’ I used to say. To have love snatched away from you… and then to be told to turn to memories. Rather than succour, my memories bring eloquent stabs of pain that say, ‘This is what you will never again have.’”
మరణించిన వ్యక్తి గురించి మాట్లాడుకోవటం, అతని హాస్యప్రియత్వాన్ని తలుచుకుని నవ్వుకోవడం సహజమే. అలా నవ్వే క్షణాల వెనకే అంతులేని బాధకూడా పొంచి ఉంటుంది. “Another revelation: how much laughter is a part of grief. Laughter is tightly braided into our family argot, and now we laugh remembering my father, but somewhere in the background there is a haze of disbelief.” జ్ఞాపకాలు ఒకోసారి నవ్వుతెప్పించినా అవి నొప్పితో రాజుకుంటున్న నిప్పుకణికల్లా ఉండి క్షణాల్లో ఆ నొప్పి ప్రజ్వరిల్లే జ్వాలగా మారిపోయేది. మరణించినవారి జ్ఞాపకాలు మధురంగా ఉండి ఆనందం కలగచేయటానికి చాలా సమయం పడుతుంది, బహుశ కొన్ని ఏళ్లే పట్టొచ్చు.
శోకం కేవలం మానసికమే కాదు, శారీరకం కూడా. “This is an affliction not merely of the spirit but of the body, of aches and lagging strength. Flesh, muscles, organs are all compromised. No physical position is comfortable. For weeks, my stomach was in turmoil, tense and tight with foreboding…” దుఃఖం శరీరంలోని ప్రత్యణువులోనుంచీ వెల్లువెత్తుతోందా అనిపించేలా శరీరం అలసిపోతుంది. “Why are my sides so sore and achy? It’s from crying, I’m told. I did not know that we cry with our muscles. The pain is not surprising, but the physicality is…”
తండ్రిలోని నిజాయితీ, సూటిదనం, సహాయం చేసే గుణం, సర్దుకుపోయే తత్వం, ఎదుగుతున్న పిల్లల్ని అర్థం చేసుకుని మార్పుని ఒప్పుకునే మనసూ, పిల్లల్ని స్వతంత్రంగా ఎదగనిచ్చిన తీరూ, అభిప్రాయ వ్యక్తీకరణకు ఇచ్చిన స్వేచ్ఛ, తల్లికీ తండ్రికీ మధ్యనున్న అపరితమైన నిష్కల్మషమైన ప్రేమ, నమ్మకం, జీవితం పట్ల ఆయనకున్న సానుకూల దృక్పథం, విజ్ఞత, మనుషుల పట్ల ప్రేమ, ఆయనలో చికాకు పెట్టే విషయాలూ, కరోనా పరిమితులవల్ల ఆయన మరణించిన వెంటనే నైజీరియా చేరుకోలేని నిస్సహాయత, నిర్వహించవలసిన విధులూ, అందులోని సామాజిక కోణాలూ, ఒప్పుకోలేకపోయినా ఒద్దనలేని క్రతువులూ - వీటన్నిటీగురించీ హృద్యంగా ప్రస్తావిస్తారు రచయిత్రి.
తనని సమూలంగా కుదిపేసిన బాధని అలతి పదాల్లో చెప్పడం వల్ల అడీచి బాధలో నిజాయితీ కనిపిస్తుంది. భాషలో ఎక్కడా క్లిష్టత, బరువైన భావుకతా, పటాటోప ప్రయోగాలూ, అనవసరమైన అలంకారాలూ కనిపించవు. చిన్న వాక్యాలూ, చిన్న అధ్యాయాలూ ఉండే అతి సన్నని పుస్తకం విషయంలోకి సూటిగా వెళ్లిపోయేలా చేస్తుంది. భాష, శైలిపై రచయిత్రికి ఉన్న పట్టు, సామర్థ్యం మరోసారి ఈ పుస్తకం ద్వారా ప్రకటింపబడింది.
ఎదురైన చేదు అనుభవాన్ని కొంత దూరంనుంచి చూస్తూ, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ, సలపరిస్తున్న బాధని సరళమైన భాషలోకి అనువదించిన ఇలాంటి రచనల పట్ల ఆసక్తి ఉన్నవారు, ఈ పుస్తకాన్ని తప్పక చదవాల్సిందే.
******