Monday, March 25, 2013

నాకు నచ్చిన సినిమా...

ముందుగా సినిమా క్రెడిట్స్ .

సినిమా పేరు  : Turtles Can  Fly
డైరెక్టర్: Bahman Ghobadi
Iranian Film -2004.

సినిమా చూసాక బావుందా - బాలేదా, అన్న మీమాంస  పక్కనపెడితే కాసేపు ఏమి చెప్పలేని పరిస్ధితి -  .నిర్వచనాలకు అందని అనుభూతి.
నాకు చాలా  నచ్చింది ఈ  సినిమా . మనల్ని తొందరగా వదిలి పెట్టదు. ఆ దృశ్యాలు, ఆ పిల్లలు, ఆ జీవితం అన్నీ మనల్ని కదిలిస్తాయి.
(మనవాళ్ళు ఇలాంటి సినిమాలు ఎన్నడైనా తీస్తారా , అసలు డిఫరెంట్  సబ్జెక్టుతో సినిమాలు ఎందుకు తియ్యరు, అనే బాధ కూడా  మనసుల్ని తొలుస్తుంది !! )

సినిమా చూసిన వెంటనే మనం ఎంత చిన్న ప్రపంచంలో  బతుకుతున్నాం? ఎంత చిన్న జీవన చట్రంలొ మనల్ని మనం బంధించుకుంటున్నాం ? అన్న ప్రశ్న మన మనసును వెంటాడుతూనే ఉంటుంది. అసలు ఇన్ని రకాల పరిస్థితులు , ఇన్ని రకాల సంఘర్షణలు ...మన ఊహకు
అందని జీవితాలు. హృదయాన్ని ఒక అంతర్లీనమైన బాధ ఆవరిస్తుంది. ఒక నిస్సత్తువ - ఇంత చిన్న ప్రపంచంలో , అతి చిన్న పరిధిలో
పరిభ్రమిస్తూ, అదే ultimate అనుకుంటూ ఎలా గడిపేస్తున్నాం,  అన్న ప్రశ్న  మనల్ని ఆలోచింప చేస్తుంది.

యుద్ధ వాతావరణం లో పెరుగుతున్న పిల్లల గురించిన జీవితాన్ని డైరెక్టర్ Bahman  Ghobadi  చక్కగా ఆవిష్కరించారు.
ఒక పది పదిహేనేళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయి , తన అన్న ,మరో చిన్న పిల్లాడితో మనకు కనిపిస్తుంది.
సైనికుల తాకిడిలో తమ తల్లి తండ్రుల్ని బంధువుల్ని కోల్పోవటం ఒక ఎత్తైతే ,
వాళ్ళ పాశవికతకు బలై , నిండా పదిహేనేళ్ళు రాకుండానే ఒక తల్లై, ఆ కొడుకుని సాకుతూ కనిపిస్తుంది.
ఇక ఎవ్వరూ  లేని  అనాధలుగా  ఈ పిల్లలు తమని తాము పోషించుకోటానికి మందుపాతర ని తవ్వి తీసి , వాటిని అమ్మి
డబ్బు సంపాదిస్తూ  ఉంటారు. యుద్ధ  ప్రణాళికలో భాగంగా ఈ  మందుపాతర ని ఉపయోగించిన నేపధ్యంలో విపరీతంగా
ఎక్కడపడితే అక్కడ ఇవి కనిపిస్తూ ఉంటాయి. అలా పేలకుండా భూమిలో ఉన్న మందుపాతరని జాగ్రత్తగా తీసి అమ్ముతున్న సమయంలో
ఒకటి పేలిపోయి ఆ అమ్మాయి వాళ్ళ అన్న రెండు చేతులూ  పోగొట్టుకుంటాడు.

వీళ్ళు  ముగ్గురు ఒక పక్క ...మిగితా పిల్లలు ఒక పక్క. వీరిలో చాలామంది అనాధాలే. అందరూ  వాళ్ళను వాళ్ళే పోషించుకోవాలి.
ఇందులో సగం మందికి  కాలో కాలో , చెయ్యో ఉండదు. అయినా వాళ్ళు ఉత్సాహంగా, పోటిపడి మందుపాతర పనికి దిగిపోతుంటారు.
అది అవసరం మాత్రమే కాదు , భయానికి అవతల బతకాల్సిన పరిస్థితి. చిన్న చిన్న పిల్లలు, హాయిగా ఆడుతూ , పాడుతూ చదువుకుంటూ,
అమ్మ నాన్నల సంరక్షణలో బతకాల్సిన పిల్లలు - ఒక  యుద్ధ వాతావరణంలో అనాధలుగా, బుల్లెట్ల చప్పుళ్ళ  మధ్య ,
Tankers మధ్య, ఉన్నట్టుండి పేలిపోయే మందుపాతర మధ్య , చూసుకునే పెద్ద వాళ్ళు  లేక, ఉన్న వాళ్ళు ఏదో ఒక అంగ వైకల్యంతో
బాధ పడుతూ పెరగటం ఎంత అమానుషం?

ఇందులో నటించిన పిల్లలు అందరూ శరణార్థులేనట. అందరూ చాలా సహజంగా నటించారు. అమ్మాయి నటన
చాలా బావుంది. నేపధ్యంలో వినిపించే సంగీతమూ బావుంది.

ఇలా క్షణ క్షణం బ్రతుకు భయాన్ని అధిగమిస్తూ, ఆకలిని ఆపుకుంటూ, బాల్యాన్నే కోల్పోయిన ఈ చిన్నారులు
ఎలాంటి మానసిక వైకల్యాలకు గురి ఔతారు? ఎలా వీళ్ళు రేపటి పౌరులై దేశాల్ని ఏలుతారు? వీళ్ళ జీవితాలు ఎలా
ఉంటాయి? అసలు వీళ్ళు  ఎందుకు ఇలా suffer అవాలి? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?
సభ్య సమాజంలో అసలీ యుద్ధాలు  ఎందుకు? రాజ్య కాంక్షకు, దేశాల మధ్య విద్వేషాలకు పిల్లలు ఎందుకు బలికావాలి?
రకరకాల ప్రశ్నలు ముసురుకునేలా చేసి, మనల్ని ఆలోచింపచేసేలా చేస్తుంది ఈ సినిమా.
అసలు మన మనసును ఎదిగేలా చేస్తుంది ఈ సినిమా. మన మైక్రో లెవెల్ చట్రం  నుంచి కొంచం
విశాలంగా మాక్రో లెవెల్ లో ఆలోచించటానికి ఉపయోగపడే చిత్రం. మన మానసిక పరిధుల్ని తొలగించి
అధిగమించి , బియాండ్ అస్ ఆలోచింప చేసే ఒక మంచి సినిమా. ఒక మంచి పుస్తకం మానసిక వికాసానికి
ఎలా దోహదపడుతుందో అలా ఒక మంచి సినిమా కూడా మనల్ని కదలిస్తుంది అన్నదానికి ఇదో మంచి ఉదాహరణ.

ప్రస్తుతానికి ఇంతటితో ముగిస్తున్నాను.