Showing posts with label నాకు నచ్చిన సినిమా.. Show all posts
Showing posts with label నాకు నచ్చిన సినిమా.. Show all posts

Wednesday, September 18, 2013

నాకు నచ్చిన సినిమా!! “In a Better World” 2010 (Denmark)





ఒక మంచి సినిమా చూస్తే ఒక మంచి పుస్తకం చదివినంత హాయిగా ఉంటుంది.

“In a Better World” 2010 (Denmark) అలాంటి సినిమా!!

సుసాన్నే బయర్ (Susanne Bier) డైరెక్ట్ చేసిన ఈ సినిమా, మానవ భావోద్వేగాల గురించి చక్కగా చర్చిస్తుంది. మనల్ని ఎప్పుడూ వేధించే ప్రశ్నలు, మంచీ - చెడూ, క్షమ - ప్రతీకారం,
ప్రేమ ద్వేషం, వీటి పర్యవసానాలూ, వీటిని  సుసాన్నే అద్భుతంగా తెరకెక్కించారు.

చక్కటి భావ ప్రకటనతో, సీరియస్ ఆక్టింగ్ తో, మనల్ని కట్టి పడేసే నటులు,అంతే సీరియస్ గా అద్భుతంగా నటించిన  పిల్లలు మనల్ని ఆకట్టుకొంటారు. అందమైన సినిమాటోగ్రఫి, హంటింగ్ బాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని ఇంకో లెవెల్ కి తీసుకెళ్తుంది.

మంచి సినిమా కాబట్టే బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటెగరీ లో ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది ఈ సినిమా.

తప్పక చూడాల్సిన సినిమా!!




Monday, May 20, 2013

నాకు నచ్చిన సినిమా...బారాన్ !!!





డైరెక్టర్ మజీద్ మజీదీ సినిమాలు అన్నీ మాణిక్యాలే! ఇది బెస్ట్ అని ఏరుకోటం చాలా కష్టం. ఇరానియన్ సినిమా చరిత్ర పుటలలో తనకంటూ ఒక ప్రత్యేకతను, తనకంటూ కొన్ని పేజీలను, సృష్టించుకున్నఒక  గొప్ప డైరెక్టర్ మజీద్ మజీదీ . ఆత్మీయతలూ, అనుబంధాల గురించి సున్నితంగా, అందంగా చెప్పే, అద్భుతంగా ఆవిష్కరించే, హృద్యంగా చిత్రీకరించే ఒక ఉన్నతమైన సినీ శిల్పి.

మజీద్ మజీదీ సినిమాలలో  నాకు నచ్చిన ఒక  సినిమా...బారాన్. ఎన్నొ అవార్డ్స్ గెలుచుకున్న ఈ సినిమా (12 విన్స్ - 4 నామినేషన్స్ ) చూసినంత సేపూ ఉత్కంఠత  తోటి చూస్తాం.  ఈ సినిమాను పరిచయం చే్ద్దామని నా ఈ చిరు ప్రయత్నం. 2001లో విడుదలైన చిత్రంలో హీరో - హొసేన్ అబేదిని, హీరోయిన్ - జహ్రా బహ్రమీ.


కథా నేపధ్యం
అఫ్ఘనిస్తాన్ 1979 లో ఎదుర్కున్న దాడులు, తరవాత అలుముకున్న పొలిటికల్ వాతావరణం, ఆ తరవాతి వాతావరణ పరిస్థితులు, ఎందరో అఫ్ఘనీయులని తమ దేశం వదిలి, వేరే దేశాల్లో తలదాచుకునేలా చేసింది. అలా ఇరాన్ కి వలస వెళ్ళినవాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారట. అలాంటి రెఫ్యుజీస్ నేపధ్యంలోంచి పుట్టిన కధ ఇది.


క్లుప్తంగా కథ
ఇద్దరు యువతీ యువకుల మధ్య (టీనేజర్స్ నిజానికి), మాటలలో బహిర్గతం కాని, వ్యక్తీకరింపబడని, వ్యక్తీకరించని ప్రేమ కధ ఇది. అడోలసెంట్ లవ్ అన్నమాట. పిల్లలు అడోలసెంట్స్ గానీ, వాళ్ళ ప్రేమలో ఎక్కడా మనకు చిన్న పిల్లలు ఆకర్షణ అనిపించదు. వారి ప్రేమలో పరిణితి మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ పిల్లలు మోస్తున్న జీవితం ఏమీ చిన్నపిల్లల జీవితం కాదు.. బ్రతుకు భారాన్ని, కుటుంబ భారాన్నీ మోస్తున్న వీళ్ళల్లో పరిణితి సహజంగానే ఉంటుందేమో?


హీరో లతీఫ్, హీరోయిన్ బారాన్
ఇరాన్ కి వలస వచ్చి,  రెఫ్యుజీ గా ఉంటూ,  కంస్ట్రక్షన్ సైట్ లో  పని చేస్తూ ఉంటాడు లతీఫ్. అక్కడే  పని చేస్తున్న నజఫ్ పనిచేస్తూ పై అంతస్తు మీదనుంచి కిందపడితే, కాళ్ళు విరుగుతాయి. నజఫ్ స్నేహితుడు సుల్తాన్, నజఫ్ కొడుకు రహ్మత్ ని పనిలోకి తీసుకు వస్తాడు. అయితే రహ్మత్  అబ్బాయి కాదూ, అబ్బాయి వేషంలో ఉన్న అమ్మాయి అని లతీఫ్ కి యాదృచ్చికంగా తెలుస్తుంది. లతీఫ్  ఆ అమ్మాయిని అభిమానిస్తాడు, ప్రేమిస్తాడు. ఆ ప్రేమతో తన ఐడెంటిటీనే కోల్పోతాడు. (నిజంగానే తన ఐడెంటిటీ కార్డ్ అమ్మేసి మరీ ఆ కుటుంబానికి సహాయం చేస్తాడు.)

తన ప్రేమను వ్యక్తీకరించే పరిస్థితులు ఉండవు. తను చేసిన సహాయాన్ని కూడా బయట పెట్టకుండా కేవలం ప్రేమిస్తున్నాడు కాబట్టి తను ఆ అమ్మాయికీ, ఆమె కుటుంబానికి చేయగలిగిన సహాయం చేసి వాళ్ళు అఫ్ఘనిస్తాన్ వెళ్తుంటే చూస్తూ ఉండిపోతాడు. ఆ అమ్మాయికీ అతని ప్రేమ తెలుసు. కానీ కట్టుబాట్లూ, కుటుంబ పరిస్థితులు ఆమెను మాట్లాడనివ్వవు. అబ్బాయి వేషంలో కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది ఆ అమ్మాయి.

ఇద్దరూ పేదరికంలో మగ్గుతున్నవారే, జీవిత పోరాటం సాగిస్తున్న వారే. అలాగని ఎక్కడా పేదరికం వారి మనస్తత్వాన్ని డామినేట్  చెయ్యదు, సినిమానీ  డామినేట్  చెయ్యదు. పరిస్థితుల్లోని పేదరికం కంటే మనస్సుకు పట్టే పేదరికం పైనే, డైరెక్టర్ దృష్టి సారించినట్టు అనిపిస్తుంది.  మనల్ని ఆశ్చర్యానికి గురిచేసే విషయం ఎమిటంటే ఎంత కష్టంలో ఉన్నా, చుట్టూ కష్టాల్నీ కల్మషాల్నీ చూస్తున్నా తమ నైతిక విలువల్ని సహజంగా నిలుపుకునే తత్వం వీరిలో ఉండటం. పరిస్థితుల్ని అర్ధం చేసుకునే ప్రయత్నంలో, పరిస్థితుల్ని తట్టుకుని నిలబడే ప్రయత్నంలో, వారి మానసిక సంక్షోభం, వారి ఎదుగుదల, పరిణితి మనకు కనిపిస్తాయి.


అఫ్ఘాన్ రెఫ్యుజీలు - ఉద్యొగ పరిస్థితులు
ఇందులో అఫ్ఘాన్ ఇరాన్ ఉద్యొగ పరిస్థితుల గురించి మనకు కొంత పరిచయం కలుగుతుంది.  అఫ్ఘాన్ నుంచి వలస వచ్చిన వారు ఒక ఐడెంటిటీ కార్డ్ కలిగి ఉండాలి. వాళ్ళ ఉనికికి ఉన్న ఒకే ఒక ప్రూఫ్ అది! (హీరో దాన్ని అమ్మేసి బారాన్ కుటుంబానికి సహాయ పడటం అల్టిమేట్ సాక్రిఫైస్). అలాగే పని చెయ్యటానికి సర్కారీ పర్మిషన్ ఉండాలి. రోజు గడవటం కోసం, పర్మిషన్ లేకున్నా అతి తక్కువ వేతనంతో పని చెయ్యటానికి, కష్ట పడటానికీ అఫ్ఘనీ రెఫ్యుజీస్ సిద్దంగా ఉంటారు. ఇరానీ దేశస్థులకు ఉద్యొగాల్లో వీరినుంచి గట్టి పోటీ ఉంటుంది. పైగా ఇరానియన్ వాళ్ళ కన్నా, వీరికి జీత భత్యాలు చాలా తక్కువగా ఉంటాయి. సర్కారీ అధికారులు చెక్ చేయడానికి వస్తే పర్మిషన్ లేకుండా పనిచేస్తున్న అఫ్ఘనీ వాళ్ళందరూ దాక్కొవలసిందే. దొరికితే ఉద్యోగంలో పెట్టుకున్నవాళ్ళూ, ఉద్యోగం చేస్తున్నవారూ -  ఇద్దరూ శిక్షార్హులే!


మానవీయ కోణంమెమర్
 శ్రమ దోపిడీ చేస్తున్నామని యజమాని మెమర్ కి  తెలుసు. దోచుకోబడుతున్నామని వీళ్ళకు తెలుసు. అలాగని మానవీయ కోణం పూర్తిగా వదిలెయ్యరు ఇద్దరూ. ఇద్దరికీ ఒకరిపట్ల ఒకరికి తమ బాధ్యత ఏమిటొ తెలుసు. యజమానిగా మెమర్ పాత్రధారి బాగా చేసారు. తనున్న పరిస్థితిలో న్యాయంగా ఉండటానికి అతను అతి సహజంగా మొగ్గు చూపటం బావుంటుంది. కేవలం శ్రమను దోచుకునే పెత్తందారీ మనస్తత్వం కాకుండా, అవసరానికి సలహా చెప్తూ, హీరో చెల్లికి బాగాలేదని తన జీతం మొత్తం అడిగినప్పుడు, (ఈ డబ్బు తీసుకెళ్ళేది నమ్మకస్తుడేనా అని కనుక్కుని మరీ డబ్బు చేతిలో పెడతాడు) ఆదుకోటానికి  సిద్దపడిన ఆతను, లతీఫ్ ని పొలీసుల నుంచి విడిపించటం, నజఫ్ కి తన దగ్గర ఉన్న డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయటం.... మెమర్ లోని మంచితనాన్ని చూపిస్తుంది. ఇక్కడ కూడా నిజాయితీకి పెద్దపీట వేశారు డైరెక్టర్.


స్వాభిమానం
ఇంకో విషయం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఈ సినిమాలో. అది వీరిలోని అత్మాభిమానం. అయ్యోపాపం అని దానం చెస్తే ఎవ్వరూ పుచ్చుకోరు. వారి కష్టానికి ప్రతిఫలం తీసుకుంటారు, లేదా అప్పుగా తీసుకుంటారు కానీ, ఉదారంగా మాత్రం తీసుకోరు. బారాన్ కుటుంబానికి సహాయం చేయాలని తను అప్పటి వరకూ కూడబెట్టిన జీతాన్ని అంతా, మెమర్ ని అడిగి సుల్తాన్ కి ఇచ్చి పంపిస్తాడు లతీఫ్. తనకంటే కష్టం లో ఉన్న సుల్తాన్ పరిస్థితి గమనించిన నజఫ్ ఆ డబ్బు అతన్నే ఉంచేసుకొమ్మని అంటాడు. ఆ స్నేహితుడూ అప్పుగానే ఆ డబ్బు తీసుకుంటాడు. అలాగే లతీఫ్ తన ఐడెంటిటీ కార్డ్ అమ్మి డబ్బు తెచ్చి నజఫ్ కి ఇస్తే,  తను అఫ్ఘనిస్తాన్  వెళ్ళాక డబ్బు తిరిగి పంపిస్తానని చెప్తాడు నజఫ్. పక్కవాడికి తాము సహాయపడటానికి వెనకాడని మనస్తత్వం మనకు ఇక్కడ కనిపిస్తుంది. పరిస్థితులకే తప్ప మనసుకి పేదరికం లేదు, వ్యకిత్వానికీ పేదరికం లేదు అనిపిస్తుంది.  వీరి స్వాభిమానపు అరిస్టోక్రసీ ముందు పరిస్థితుల దరిద్రం తలవంచుకోక తప్పదు. 

ప్రతీ పాత్రా దరిద్రంలో, పేదరికంలో మగ్గుతున్నదే ఐనా, ప్రతి ఒఖ్ఖరూ ఎమోషనల్లీ రిచ్, స్పిరిచువల్లీ రిచ్. జీవన పోరాటం చేస్తూనే ఉంటారు కానీ ధైర్యాన్నీ, స్థైర్యాన్నీ కోల్పోరు. నిజాయితీనీ, నీతినీ కోల్పోరు. అందువల్ల మనకు సినిమాలో పేదరికం కనిపించదు. మనుషులు, రిలేషన్షిప్స్, ఆప్యాయతలూ కనిపిస్తాయి. పరిస్థితులు ఏవైనా మనం మన మనసును పేదరికం ఆవరించకుండా చూసుకోవాలి అని చెప్పకనే చెప్పిన మజిద్ మజిదీ కి జోహార్లు!


పిట్ట కధ
బారాన్ కోసం వెతుకుతున్నప్పుడు, లతీఫ్ కి ఒక  చెప్పులు కుట్టే వాడు కనిపిస్తాడు. ఎంతో కవితాత్మక హృదయం ఉన్న అతన్ని, నువ్వు ఎవరితో ఉంటావ్ అని లతీఫ్ అడిగితే "ఒంటరి వాళ్ళకు భగవంతుడే ఇరుగూ పొరుగూ" అంటాడు. బహుశ లతీఫ్ కి భవిష్యత్తులో కలిగే ఒంటరి తనానికి భగవంతుడి తోడు అవసరమని సూచన ప్రాయంగా తెలియ చెయ్యటం మజిద్ మజీదీ ఉద్దేశం ఏమో?
 

ముగింపు
ఇందులో  హీరో మానసిక సంఘర్షణ, ఆ సంఘర్షణలోంచి పుట్టిన పరిపక్వత చాలా బాగా చూపించారు. అలాగే సినిమా మొత్తం ఒక్క మాట కూడా మాట్లాడని హీరోయిన్ (పాత్రోచితంగా అబ్బాయి వేషంలో ఉంటుంది కాబట్టి, మాట్లాడకూడదు కూడా) కళ్ళతో కనబరిచే భయం, కష్టం, ఇష్టం, నిస్సహాయత మనల్ని ఆకట్టుకుంటాయి. నటనలో ఇద్దరూ ఉద్ధండులు, పేరు పొందిన నటులు కాకపోయినా మనల్ని మెప్పించే వారి నటనకు జోహార్లు అనక తప్పదు. కొత్త నటీ నటులు (హీరో ఒక సినిమా చేశాడు అనుకుంటాను) అంత చక్కగా చేయటం ఒప్పుకోవాల్సిన విషయం.

చివరి సీన్లో సమాధుల దగ్గర లతీఫ్ పడే సంఘర్షణ, అప్పుడు  వినిపించే ప్రేయర్, ఆ మ్యూజిక్,  అన్నీ అద్భుతంగా అనిపిస్తాయి. అక్కడ లతీఫ్ తన ఆత్మ సంఘర్షణలోంచి బయటపడతాడు. ఆత్మస్థైర్యంతో  బారాన్కి వీడ్కోలు తెలపటానికి సిద్ధపడతాడు. బారాన్ వస్తువులు పడిపోయినప్పుడు ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా, కేవలం చూపులతోనే మాట్లాడుకుని విడిపోవటం - ఒక గంభీరతను, గాఢతను కలగచేస్తుంది. అలాగే ఆమె వెళ్ళిపోయాక , లతీఫ్ పెదవులపై వెలిగే నవ్వూ, కళ్ళలోని ప్రశాంతత...నేలమీద పడిన ఆమె పాదం గుర్తు, దానిపై కురుసే వర్షపు నీరూ.... ఇవి మనల్ని చాలా రోజులు వెంటాడుతూనే ఉంటాయి.

జీవితం గురించి, జీవించటం గురించి, మనుషుల గురించి, మానవత్వం గురించి, మనల్ని ఆలోచింపచేసే చిత్రమిది. ఇంత సున్నితంగా ప్రేమని ఆవిష్కరించి, పెద్దగా కధ లేకపోయినా మనల్ని కదలకుండా కూర్చోపెట్టేట్టుగా కధా గమనాన్ని నిర్దేశించిన  డైరెక్టర్ కి జోహార్లు.

మజీద్ మజీదీ సినిమాలలో తప్పక చూడాల్సిన చిత్రం ఇది.




Sunday, April 14, 2013

నాకు నచ్చిన సినిమా ! "ది హెల్ప్".



మొన్నే ఒక కొత్త తెలుగు సినిమా చూసాను!!  చాలా బాధ పడ్డాను. మన తెలుగు సినిమా ఎప్పుడు మారుతుందా అని మధన పడ్డాను. ఎప్పుడో ఆ రోజు వస్తుందని నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను . ఈ ఉపోద్ఘాతం పక్కనపెడితే నాకు నచ్చిన మరో సినిమా గురుంచి మొదలుపెట్టడం బెటర్ అనుకుంటాను.

నాకు నచ్చిన సినిమా !  "ది హెల్ప్".
ముందుగా సినిమా క్రెడిట్స్. 
Title : The Help.
Year : 2011
Director : Tate Taylor
Writers : Screenplay : TateTaylor ,    Novel : Kathryn Stockett
Music : Thomas Newman

సినిమా పేరు : ది హెల్ప్.
సంవత్సరం : 2011
డైరెక్టర్ :  టేట్ టేలర్ .
నవల : కాతరిన్ స్టాకేట్ .

ముఖ్యమైన పాత్రలు ధరించిన వారు :
ఎమ్మా స్టోన్, వయోల డేవిస్, మరియు ఒక్టేవియా స్పెన్సర్.



The Help (2011) Poster


Emma Stone : Skeeter Phelan
Still of Emma Stone in The Help

Viola Davis : Aibileen Clark
Still of Viola Davis and Octavia Spencer in The Help

Octavia Spencer : Minny Jackson
Still of Octavia Spencer in The Help

 


ఈ సినిమా అమెరికాలో 1960 సివిల్ రైట్స్ మూవ్మెంట్ జరుగుతున్న సమయంలో ఉన్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా. వర్గ పోరాటాలు అని పెద్ద పోరాటాలు చూపించకుండా, సునిశితంగా, ఆఫ్రో అమెరికన్ విభేదాలని ఒక మెయిడ్ కళ్ళతో, మనసుతో చూడటానికి, చూపటానికి  చేసిన ప్రయత్నమే ఈ సినిమా. 

క్లుప్తంగా స్టొరీ :
స్కీటర్ (ఎమ్మా స్టోన్) అప్పుడే ఉన్నత విద్య ముగించుకుని, తానో  రచయిత్రి కావాలని నిశ్చయించుకుని, తన ఊరికి వస్తుంది. అక్కడ అమెరికన్స్ ఆఫ్రికన్స్ పట్ల చూపించే వివక్ష ఆమె మనసుని కదిలిస్తుంది. తను రాయబోయే పుస్తకానికి అదే ఇతివృత్తాన్ని ఎన్నుకుని, ఒక అమెరికన్ ఇంట్లో పనిచేసే ఆఫ్రికన్ మెయిడ్  ఐబిలీన్ (వయోల డేవిస్) సహాయాన్ని అర్ధిస్తుంది. ఐబిలీన్ తన స్నేహితురాలు మిన్ని (ఒక్టవియా స్పెన్సర్) తో కలిసి తెల్ల జాతీయుల ఇళ్ళల్లో మెయిడ్సగా (హెల్ప్ ) తాము ఎదుర్కునే వివక్ష గురించి, సాధక బాధకాల గురించి వివరించటం, ఏతావాత పుస్తకం ప్రచురింపబడటంతో కలిగే పరిణామాలతో సినిమా ముగుస్తుంది. 

ఇందులో ప్రముఖంగా 1960స్ లో ఉన్న వాతావరణాన్ని(సెట్టింగ్స్, ఆక్టర్స్ డ్రెస్సింగ్ వగైరాలు) చాలా బాగా చూపించారని, మిన్ని పాత్రలో సహజంగా నటించిన ఒక్టవియా స్పెన్సర్ కి ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ దక్కింది అని, ఐబిలీన్ పాత్రలో వయోల డేవిస్ జీవించింది అన్నవి ఒక ఎత్తు ఐతేజాతివివక్ష గురించిన ప్రస్తావన ఇంకో ఎత్తు. నవలని అద్భుతంగా తెరకెక్కించారన్న ప్రశంసలని కూడా పొందింది ఈ సినిమా. ఎన్నో అవార్డ్స్ , మరెన్నో రివార్డ్స్ ని సొంతం చేసుకున్న సినిమా ఇది. 

ఇందులో జాతివివక్షతను  తొలిగించే సూత్రాలేమి లేవు. కేవలం జాతి వివక్షతని లైట్ గా, అంటే పెరిఫెరల్ లెవెల్ లో డీల్ చేశారు. లోతుగా పరిశీలించి నివారించటం, లేక సూచనలు ఇవ్వటం మనకు కనబడదు. కాకపొతే ఉన్న పరిస్థితుల్ని సున్నితంగా మనముందుకు తెచ్చే ప్రయత్నంలో "టేట్ టేలర్" సఫలీకృతులు అయ్యారనే చెప్పాలి.

స్కీటర్ తో మాట్లాడటానికే ఐబిలీన్ భయపడటం, కనీసం తమ జీవితాల గురించి స్కీటర్ తో చర్చించటానికి కూడా మెయిడ్స్అందరూ జంకటం, తాము పనిచేసే ఇళ్లలోని శ్వేతజాతీయులకు ఇది తెలిస్తే, తమ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో అన్న భయం వాళ్ళను  వెంటాడటం, సమాజాన్ని వెక్కిరిస్తున్నట్టు ఉంటుంది. వాళ్ళు ఆ ఇళ్ళల్లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అన్ని పనులు చేస్తారు.  పసి పిల్లల ఆలనా పాలనా చూస్తారు, వంటా వార్పూ చేస్తారు, ఇంటికి కావాల్సిన సామాన్లు తెస్తారు, ఇంటి పనులన్నీ చేస్తారు. వాళ్ళు పెంచిన పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని, పిల్లల్ని కంటే వాళ్ళని కుడా పెంచుతారు. వీళ్ళు ఆ ఇంట్లో మనుషులతో విడదీయలేని బంధాన్ని ఏర్పరుచుకుంటారు (తమ పిల్లల్ని కూడా అలా చూసుకోలేని పరిస్థితి). కొంతమంది యజమానులకి కూడా వీరి పట్ల అబిమానం ఉంటుంది. కానీ వీళ్ళు ఆ ఇంటిలో, ఆ మనుషులలో, ఒకరు కారు. ఎన్ని ఏళ్ళు పనిచేసినా వీళ్ళు కేవలం పనివళ్ళూగానె ట్రీట్ చెయ్యబడతారు. నిజానికి స్కీటర్ మెయిడ్ కూడా ముసలితనంలో ఆ ఇంటి నుండి గెంటివేయబడుతుంది.  దే కాన్ నెవెర్ బీ ఈక్వల్ ...... దే ఆర్ ఆల్వేస్ లెస్సెర్ మొర్టల్స్. అగ్ర జాతి ఆధిపత్యం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. అసలు స్కీటర్ వీళ్ళతో మాట్లాడటం తోటి తెల్ల స్నేహితులకి కుడా నచ్చదు. ఈక్వల్స్ అంటే యజమానితో సమానం అనికాదుఒక వ్యక్తిగా, ఒక మనిషిగా పొందాల్సిన గౌరవ మర్యాదల గురుంచిన ప్రస్తావన ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇన్ని ఏళ్ళు పనిచేస్తున్నా కేవలం మెయిడ్స్ గా మిగిలిపోవటం అన్నది వాళ్ళని బాధించే విషయం.

వాళ్ళు కిచెన్ లోనె తినాలి, తమ బాత్రూమ్స్  ఎట్టి  పరిస్తితుల్లోను వాడకూడదు.  ఐబిలీన్ తో ఇంటర్వ్యూ కావాలని స్కీటర్ బస్సు స్టాండ్ లో కలిసి అడిగినప్పుడు ఐబిలీన్ ఎంత భయపడుతుందో ఆమె నటనలో అద్భుతంగా పలికిస్తుంది. తను ఒక తెల్ల అమ్మాయితో మాట్లాడటం ఎవరైనా చూస్తారేమోనని ఆమె భయంగా చుట్టూ చూస్తూ ఉంటుంది.  నీకు ఇందులో ఎంత సమస్య ఉందొ తెలీకపొవటం నన్ను భయపెడుతోంది .."జిమ్ క్రో " కంటే భయపెడుతోంది అని అంటుంది . ఇక్కడో విషయం చెప్పుకోవాలి. 1880 నుంచి 1960 వరకు అమెరికాలో ముఖ్యమైన స్టేట్స్ లో "జిమ్ క్రో" లాస్ అమలులొ ఉండేవట. శ్వేత వర్గీయులు, ఇతరుల మధ్య ఎలాంటి సంబంధాలు ఉండవచ్చు , వాళ్ళ మధ్య ఉండాల్సిన గీతలు ఏమిటి , ఆ గీతలు దాటితే ఉండే లీగల్ పనిష్మెంట్స్ ఏమిటి అన్న విషయాలను జిమ్ క్రో లాస్ నిర్వచించాయి. అందులో ఒక రూల్ ఏమిటంటే, ఎవరైనా సమానత్వం గురించి రాసినా, పబ్లిష్ చేసినా , మాట్లాడినా లేక అలాంటి  ప్రయత్నం గానీ ఆర్గ్యుమెంట్ గానీ ప్రచారంలోకి తేవటానికి ప్రయత్నించినా వాళ్ళు ఒక లీగల్ అఫెన్స్ చేసినట్టుగా పరిగణింపబడతారు, వాళ్ళు శిక్షార్హులు కూడా.
ఇలాంటి చట్టాలు శ్వేత వర్గీయులు కాని వాళ్ళ కోసం తయారు చెయ్యబడ్డాయి. శ్వేత వర్గీయులు కాని వాళ్ళు ఎలా నడుచుకోవాలో నిర్దీశించె ఈ చట్టాలకు ఐబిలీన్ లాంటి వాళ్ళు చాలా భయపడే  వాళ్ళు . అదీ వాళ్ళ పరిస్థితి. అలాంటి సమయంలో స్కీటర్ కార్ ఎక్కడో  ఆపుకుని, కాబ్లో కొంత దూరం వచ్చిఐబిలీన్ వాళ్ళ ఇంటికి చాలా దూరంలో దిగిఅక్కడినించి నడుచుకుంటూ వస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఐబిలీన్ ఎంత భయపడుతోందోఅంతే ఇబ్బందికి  భయానికీ శ్వేత జాతీయురాలు అయిన స్కీటర్  కూడా గురి కావటం. ఇద్దరూ కలిసి మాట్లాడుకోటమే తప్పు అయినప్పుడు, ఇద్దరూ ఐబిలీన్ ఇంట్లో కూర్చుని మట్లాడుకోవటం ఇంకా ఘోరమైన నేరం. ఈ భయాన్ని స్కీటర్ కూడా బాగా ప్రదర్శించింది. మిన్ని మాత్రం కొంత ప్రతిఘటించే లక్షణాన్ని కలిగి ఉంటుంది. భయంకరమైన వర్షం వస్తున్నా ఇంట్లో టాయిలెట్ వాడటానికి ఒప్పుకోని యజమానిని ధిక్కరించి సైలెంట్ గా వాళ్ళ టాయిలెట్ వాడుకుంటుంది. ఆ విషయంగానే తన ఉద్యోగాన్ని కోల్పోతుంది మిన్ని. మిన్ని కుడా ఐబిలీన్తో కలిసి స్కీటర్ తో తన మెయిడ్ జీవితం గురించి చెప్తుంది. 

చివరికి స్కీటర్ తనని పెంచిన మెయిడ్ ఏ తప్పూ చెయ్యకుండానే ఇంట్లోంచి తరిమి వేయబడింది అని తెలుసుకుని బాధ పడుతుంది. కానీ సమాజానికి భయపడి ఆమెను తరిమేసిన స్కిటర్ తల్లిపుస్తక ప్రచురణ జరిగాక, "ఒకోసారి ధైర్యం ఒక జనరేషన్ దాటి వస్తుంది" అని స్కీటర్ తను చెయ్యలేని పని చేసింది అని సంతోషిస్తుంది.

ఇందులో స్కీటర్ మెయిడ్, ఐబిలీన్ పిల్లలను పెంచే విధానం చాల బాగా ఉంటుంది. స్కీటర్ తనని ఎవ్వరు డాన్సు కి పిలవలేదని , తను అందంగా ఉండనని అగ్లిగా ఉంటానని అందరు అంటారని అన్నప్పుడు ఆమె మెయిడ్ ఒకటే చెప్తుంది  : " I wish you'd  quit  feeling sorry for yourself, now that's ugly." అగ్లీ అన్న భావన మనలోపల్నుంచి  పుడుతుంది, అది మనల్ని చాలా హర్ట్ చేస్తుంది అవతలి వాళ్ళ కామెంట్స్ లాగా, నువ్వు ఆ అవతలి వాళ్ళలో ఒకదానివా? ప్రతిరోజూ నువ్వు చచ్చిపోకుండా, మరురోజు ఉదయం నిద్ర లేచినప్పుడు,  "ఇవాళ ఎవరో నా గురించి అన్న నెగటివ్ మాటలను నేను నమ్మాలా? అని నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో," అని చెప్తుంది. అలాగే ఐబిలీన్ తను చూసుకుంటున్న పసిపాపకు ' యు ఇస్ కైండ్ , యు ఇస్ స్మార్ట్ , యు ఇస్ ఇంపార్టెంట్ " అని నేర్పించటం .... ఆ పిల్లలకి అంత ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే ఐబిలీన్ లాంటి వాళ్ళను చూసినప్పుడు, ఒక తల్లి నిర్వర్తించాల్సిన బాధ్యతల్ని వీళ్ళు పరాయి పిల్లల పట్ల, ఎంత బాధ్యత తోటి నిర్వర్తిస్తారో కదా అనిపించక మానదు. అది కుడా తమ యజమానుల పిల్లల పట్ల, తమని తక్కువగా చూసే జాతి వివక్షని మరిచి పిల్లలను స్వచ్చంగా ప్రేమించటం ఎంత గొప్ప లక్షణం? జీవిత సత్యాలను, జీవించటానికి కావాల్సిన ధైర్యాన్ని తాము చూసుకుంటున్న పిల్లల్లో నింపటానికి వీరికి జాతి అడ్డం రాదు. ఈ మెయిడ్స్ అండ్ పిల్లల మధ్య అనుబంధం అందంగా ఉంటుంది.  క్లైమాక్స్ సీన్ లో ఐబిలీన్ నటన పరమాద్భుతం. యజమాని పట్ల కోపం, అసహ్యం, పసిపాపను విడిచి వెళ్తున్న దుఃఖం, కేవలం స్కీటర్ పుస్తకంలొ తన అనుభవాల్ని చెప్పినందుకు యజమాని తనని పరోక్షంగా దెబ్బకొట్టడానికి దొంగగా చిత్రీకరించటానికి  ప్రయత్నించటం వల్ల కలిగే నిర్వేదం, ఆగ్రహం కలగలిపిన ఆ సీన్ చూడాల్సిందే !!

నేను ఇంతకు ముందే చెప్పినట్టు ఇందులో అసలు ఇష్యూని కేవలం స్పృశించి వదిలేశారు. అద్భుతాల్ని, సొల్యూషన్స్ని అందించదు సినిమా. కానీ ఖచ్చితంగా మానవ అసమానతల గురించి, మనం మనుషుల్ని ఎలా చూస్తాం, మనం మన కన్నా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని ఎలా చూస్తాం, ఎలా ట్రీట్ చేస్తాం అన్న విషయం గురించి పునరాలోచించేలా  చేస్తుంది  ఈ సినిమా. ఇట్ స్కోర్స్ మార్క్స్ దేర్! ఇట్స్ ఎ గుడ్ ఫిలిం, అందులో డౌట్ లెదు.























Monday, March 25, 2013

నాకు నచ్చిన సినిమా...

ముందుగా సినిమా క్రెడిట్స్ .

సినిమా పేరు  : Turtles Can  Fly
డైరెక్టర్: Bahman Ghobadi
Iranian Film -2004.

సినిమా చూసాక బావుందా - బాలేదా, అన్న మీమాంస  పక్కనపెడితే కాసేపు ఏమి చెప్పలేని పరిస్ధితి -  .నిర్వచనాలకు అందని అనుభూతి.
నాకు చాలా  నచ్చింది ఈ  సినిమా . మనల్ని తొందరగా వదిలి పెట్టదు. ఆ దృశ్యాలు, ఆ పిల్లలు, ఆ జీవితం అన్నీ మనల్ని కదిలిస్తాయి.
(మనవాళ్ళు ఇలాంటి సినిమాలు ఎన్నడైనా తీస్తారా , అసలు డిఫరెంట్  సబ్జెక్టుతో సినిమాలు ఎందుకు తియ్యరు, అనే బాధ కూడా  మనసుల్ని తొలుస్తుంది !! )

సినిమా చూసిన వెంటనే మనం ఎంత చిన్న ప్రపంచంలో  బతుకుతున్నాం? ఎంత చిన్న జీవన చట్రంలొ మనల్ని మనం బంధించుకుంటున్నాం ? అన్న ప్రశ్న మన మనసును వెంటాడుతూనే ఉంటుంది. అసలు ఇన్ని రకాల పరిస్థితులు , ఇన్ని రకాల సంఘర్షణలు ...మన ఊహకు
అందని జీవితాలు. హృదయాన్ని ఒక అంతర్లీనమైన బాధ ఆవరిస్తుంది. ఒక నిస్సత్తువ - ఇంత చిన్న ప్రపంచంలో , అతి చిన్న పరిధిలో
పరిభ్రమిస్తూ, అదే ultimate అనుకుంటూ ఎలా గడిపేస్తున్నాం,  అన్న ప్రశ్న  మనల్ని ఆలోచింప చేస్తుంది.

యుద్ధ వాతావరణం లో పెరుగుతున్న పిల్లల గురించిన జీవితాన్ని డైరెక్టర్ Bahman  Ghobadi  చక్కగా ఆవిష్కరించారు.
ఒక పది పదిహేనేళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయి , తన అన్న ,మరో చిన్న పిల్లాడితో మనకు కనిపిస్తుంది.
సైనికుల తాకిడిలో తమ తల్లి తండ్రుల్ని బంధువుల్ని కోల్పోవటం ఒక ఎత్తైతే ,
వాళ్ళ పాశవికతకు బలై , నిండా పదిహేనేళ్ళు రాకుండానే ఒక తల్లై, ఆ కొడుకుని సాకుతూ కనిపిస్తుంది.
ఇక ఎవ్వరూ  లేని  అనాధలుగా  ఈ పిల్లలు తమని తాము పోషించుకోటానికి మందుపాతర ని తవ్వి తీసి , వాటిని అమ్మి
డబ్బు సంపాదిస్తూ  ఉంటారు. యుద్ధ  ప్రణాళికలో భాగంగా ఈ  మందుపాతర ని ఉపయోగించిన నేపధ్యంలో విపరీతంగా
ఎక్కడపడితే అక్కడ ఇవి కనిపిస్తూ ఉంటాయి. అలా పేలకుండా భూమిలో ఉన్న మందుపాతరని జాగ్రత్తగా తీసి అమ్ముతున్న సమయంలో
ఒకటి పేలిపోయి ఆ అమ్మాయి వాళ్ళ అన్న రెండు చేతులూ  పోగొట్టుకుంటాడు.

వీళ్ళు  ముగ్గురు ఒక పక్క ...మిగితా పిల్లలు ఒక పక్క. వీరిలో చాలామంది అనాధాలే. అందరూ  వాళ్ళను వాళ్ళే పోషించుకోవాలి.
ఇందులో సగం మందికి  కాలో కాలో , చెయ్యో ఉండదు. అయినా వాళ్ళు ఉత్సాహంగా, పోటిపడి మందుపాతర పనికి దిగిపోతుంటారు.
అది అవసరం మాత్రమే కాదు , భయానికి అవతల బతకాల్సిన పరిస్థితి. చిన్న చిన్న పిల్లలు, హాయిగా ఆడుతూ , పాడుతూ చదువుకుంటూ,
అమ్మ నాన్నల సంరక్షణలో బతకాల్సిన పిల్లలు - ఒక  యుద్ధ వాతావరణంలో అనాధలుగా, బుల్లెట్ల చప్పుళ్ళ  మధ్య ,
Tankers మధ్య, ఉన్నట్టుండి పేలిపోయే మందుపాతర మధ్య , చూసుకునే పెద్ద వాళ్ళు  లేక, ఉన్న వాళ్ళు ఏదో ఒక అంగ వైకల్యంతో
బాధ పడుతూ పెరగటం ఎంత అమానుషం?

ఇందులో నటించిన పిల్లలు అందరూ శరణార్థులేనట. అందరూ చాలా సహజంగా నటించారు. అమ్మాయి నటన
చాలా బావుంది. నేపధ్యంలో వినిపించే సంగీతమూ బావుంది.

ఇలా క్షణ క్షణం బ్రతుకు భయాన్ని అధిగమిస్తూ, ఆకలిని ఆపుకుంటూ, బాల్యాన్నే కోల్పోయిన ఈ చిన్నారులు
ఎలాంటి మానసిక వైకల్యాలకు గురి ఔతారు? ఎలా వీళ్ళు రేపటి పౌరులై దేశాల్ని ఏలుతారు? వీళ్ళ జీవితాలు ఎలా
ఉంటాయి? అసలు వీళ్ళు  ఎందుకు ఇలా suffer అవాలి? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?
సభ్య సమాజంలో అసలీ యుద్ధాలు  ఎందుకు? రాజ్య కాంక్షకు, దేశాల మధ్య విద్వేషాలకు పిల్లలు ఎందుకు బలికావాలి?
రకరకాల ప్రశ్నలు ముసురుకునేలా చేసి, మనల్ని ఆలోచింపచేసేలా చేస్తుంది ఈ సినిమా.
అసలు మన మనసును ఎదిగేలా చేస్తుంది ఈ సినిమా. మన మైక్రో లెవెల్ చట్రం  నుంచి కొంచం
విశాలంగా మాక్రో లెవెల్ లో ఆలోచించటానికి ఉపయోగపడే చిత్రం. మన మానసిక పరిధుల్ని తొలగించి
అధిగమించి , బియాండ్ అస్ ఆలోచింప చేసే ఒక మంచి సినిమా. ఒక మంచి పుస్తకం మానసిక వికాసానికి
ఎలా దోహదపడుతుందో అలా ఒక మంచి సినిమా కూడా మనల్ని కదలిస్తుంది అన్నదానికి ఇదో మంచి ఉదాహరణ.

ప్రస్తుతానికి ఇంతటితో ముగిస్తున్నాను.