Thursday, January 31, 2013

హోల్డాల్ ! రైలు ప్రయాణం .....ఇలాకూడా ప్రయాణం చెయ్యొచ్చు!

హోల్డాల్ ! రైలు ప్రయాణం .....ఇలాకూడా ప్రయాణం చెయ్యొచ్చు ???

 ఊరికి వెళ్ళాలంటే VIP సూట్కేసు ...స్టైల్ గా ఉండే ఓ airbag ....ఓ రెండువేలు ఖర్చు.ఇది ఇప్పటి పరిస్థితి. నా చిన్నతనంలో ట్రంక్ పెట్టెలు, వెదురు బుట్టలు, వైర్ తో అల్లిన బుట్టలు, ఒక హోల్డాలు ఉండేవి. ముఖ్యమైనవి ట్రంక్ పెట్టెలో భద్రంగా పెట్టి తాళం వేసేవారు. తిండి సామాన్లు బుట్టల్లో సర్దేవాళ్ళు.

ఇకపొతే హోల్డాల్. ఏమిటీ  హోల్డాల్???? అసలు ఈ పేరు ఇప్పటివాళ్ళకి తెలుసా? ఇంత అద్భుతమైన వస్తువు? ఎలా కను మరుగైంది?? అసలు హోల్డాల్ ఎలా ఉండాలి? ఖాకి material తో తయారై ఉండాలి. క్రీమిష్ ,బ్రౌనిష్ మధ్యలో ఉంటుంది రంగు. నేను పెరిగినదంతా హైదరాబాద్ లోనే. స్వస్థలం నెల్లూరు.

 సెలవుల్లో నెల్లూరు వెళ్ళటం ఒక ఉత్సవం, ఉత్సాహం, ఆనందం.....అప్పట్లో బొగ్గుతో నడిచే రైల్లో ప్రయాణం. ఊరికి వెళ్ళాలంటే ఒక హోల్డాల్, ఒక ట్రంకు పెట్టె, ఒక బుట్ట మినిమం. హోల్డాల్లో దుప్పట్లు ,ఒకటిరెండు దిళ్ళు , ఉతికిన+ ఇస్త్రీ  చెయ్యని బట్టలు వేసి కట్టేవాళ్ళం. ఇది multipurpose వస్తువు. బెర్తులున్న పెద్దవాళ్ళకి దిండ్లు దుప్పట్లు ఇచ్చేసి, చిన్నపిల్లలు ఉతికిన బట్ ఇస్త్రి చెయ్యని బట్టల్ని హోల్డాల్ అరల్లో సర్దుకుని ఓ దిండు తయారు చేసుకుని ఓ దుప్పటి సంపాదించి ( మనకి అని ఒకటి అమ్మ ముందే ప్యాక్ చేస్తుంది కదా ) హోల్డాల్ని  రైల్లో రెండు నేల బెర్తుల మధ్య వేసుకుని ( మళ్లీ దీనికి కూడా పోటి ఉంటుంది.ఊరికి వెళ్ళేటప్పుడు ఒకరు తిరిగి వచ్చేప్పుడు ఇంకొకరు..హోల్డాల్ మీద పడుకోడానికి అర్హులు....)! ఈ హోల్డాల్లో అమ్మ ఏం ప్యాక్ చెయ్యాలని అనుకుంటుందో కానీ, మా వస్తువుల్ని మేము పెడుతూనే ఉండే వాళ్ళం.( అసలు రెండు lower berths మధ్య కింద పడుకోవటం ఈ మధ్య ఎక్కడైనా కనిపించిందా ? అదో అవమానం లాగా అనిపిస్తుంది ఇప్పుడు. నిజానికి నేనే ఊహించలేను.)

రైలెక్కిన పావుగంటకి బుట్ట చుట్టూ చూపులు.. మరి అందులోనే సున్నుండలు, కారప్పూస (సాయంత్రం తినటానికి) పూరి కూర (రాత్రి భోజనం ) వగైరాలన్నీ ఉండేది.నేను కాసేపు కిటికీ దగ్గర కుర్చుని బయటకి చూస్తూ భావుకత ఒలకబోసేదాన్ని. మనసులో కొన్ని కవితలు (శ్రీలక్ష్మి తవికలు కావండి బాబూ) అల్లెసుకుంటూ రవీంద్రనాథ్ టాగోర్ లా ఫీలైపొతూ ఉండేదాన్ని. మెల్లిగా అందరు సర్దుకుని కూర్చునేసరికి అరగంట అయ్యేది. ప్రయాణం మొదలుపెట్టిన గంటకి అమ్మ మాచేత కట్ చేయించి పెట్టిన న్యూస్ పేపర్ ముక్కల్లో ఒక సున్నుండ కాస్త కారప్పూస పెట్టేది.అప్పట్లో పేపర్ plates అంతగా లేవేమో మరి.(ఏమిటో మరీ పురాతనంగా అనిపిస్తోంది.ఎప్పటి మాట ఇది? Somewhere around  1970-76 అనుకుంటా ) అసలు పేపర్ని కోన్ లాగా చుట్టి అందులో వేయించిన వేరుసెనగపప్పు ఓ చిన్న బెల్లపు ముక్కతో ఇస్తే అదో త్రిల్లు. సరే తరవాత మంచినీళ్ళు తాగడాలు, కొండొకచో పొరపాటున కింద పారపోయ్యటం, అమ్మ పెట్టే  సన్నని చీవాట్లను  తల ఒంచుకుని తిని, మళ్లీ కిటికీ దగ్గరకి చేరటం. ఇప్పుడు ఆకాశం కొంచెం తేడాగా కనిపిస్తుంది. ఇందాక బావున్న ఆకాశం , అమ్మ తిట్లతో తను కాస్త రంగు మారి అంత అందంగా కనిపించదు. అదీ కాసేపే. మళ్లీ కిటికీ కోసం గొడవలు, అమ్మ దగ్గర రాజకీయ చతురతలు, చాణక్య తెలివితేటలూ ప్రదర్శించి ఆవిడ తెలివికి తలొగ్గి, ఒకరు కిటికీని త్యాగం చెయ్యటం. అప్పుడు గుర్తుకొస్తుంది బుట్టలో ఉన్న చందమామ, బాలమిత్ర పుస్తకాల గురించి. ఈ లోపల పక్క సీట్లలో వాళ్ళని మనం గమనించటం, వాళ్ళు మనల్ని ఏదో ఒకటి అడగటం.....ఎం చదువుతున్నావని అలాంటి ప్రశ్నలు. వాళ్ళకి మహా బుద్దిమంతుల్లాగా సమాధానం చెప్పి "మాయలమారి రాజకుమారి" కధలోకో , " భేతాళ కధల్లోకో వెళ్లి పోతాం !

 అదో, ఇంజిను మలుపు తిరుగుతూంది చూడూ, అన్న అన్నయ్య మాటలకు ఉలిక్కిపడి తలను వీలైనంత కిటికీ  దగ్గరకి చేర్చి, ప్రపంచం లోని పరమాద్భుతాన్ని చూస్తున్నంత  ఆనందంగా చూసేదాన్ని . ఖచ్చితంగా ఓ బొగ్గునలుసు కంట్లో పడాల్సిందే! ఈ లోపల బైట కరెంటు తీగలపైన వాలిన పిట్టలు , ఆకశంలో పరిగెడుతున్న మేఘలూ,పక్కనున్న పట్టాలపైనుంచి వెళ్ళే గూడ్స్ బండి .....చీకట్లు కమ్ముతున్నై అన్నప్పుడు అమ్మ భోజనానికి పిలిచేది.... అమ్మ పెట్టిన పూరీకూరా ఎంత రుచిగా ఉండేదో (అదేంటో ఇప్పుడు అన్నీ రొటీనే . ఏదీ తిన్నా స్పెషల్ గా అనిపించదు - పనీర్ బట్టర్ మసాలాతో సహా ! ఏదైనా విరివిగా దొరికితే అంతేనేమో ?) ఎప్పుడు నిద్రాదేవి మమ్మల్ని ఆహ్వానించేదో , ఎప్పుడు నేను లోయర్ బెర్త్ మీద కలల అలల ఒడిలోకి చేరేదాన్నో .... అన్నయ్యా , చెల్లీ , అమ్మా ,నాన్నా ఎపుడు పడుకునేవారో.....

 ఊరొస్తోంది లేమ్మా అని అమ్మ చెప్తే.....అప్పుడు ఇహ అసలు కధ మొదలు.... రైలు దిగి, జట్కా బండి ఎక్కి (నిజం జట్కా - అనగా హార్స్ పుల్డ్ కార్ట్ అన్నమాట ) అమ్మమ్మా వాళ్ళ ఇంటికి చేరాక - వామ్మో అది ఎంత పెద్ద కధ ? ఆ వేసవి సెలవుల గురుంచి కమ్మహా (ఎవరికీ కమ్మహా అంటారా? నిజం చెప్పండి, కొంచం బానే ఉందికదా ఈ రైలు ప్రయాణం?? మీ చిన్నతనం గుర్తుకు రాలేదూ?? అంతకంటే కమ్మని విషయం ఏముంటుంది?) మరోసారి కలుద్దాం. అందాకా సెలవా మరి?