Showing posts with label సరదా కబుర్లు.... Show all posts
Showing posts with label సరదా కబుర్లు.... Show all posts

Friday, November 8, 2013

ముత్యపు చిప్పలూ... మట్టి గడ్డలూ....



ముత్యపు చిప్పలూ... మట్టి గడ్డలూ....

మొన్న పొద్దున్న ఏమైందంటే....
మొన్న పోద్దున్నా? అంతకు ముందు రోజా? నిన్నా??
వెన్, వాట్, వేర్???

మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చక్కగా, సరదాగా ఇది రాయాలనుకున్నాను. అలా నియమాలు పెట్టుక్కూర్చుంటే పని తెమలదు అని అర్థమైపోయింది. ఇంత హడావుడి జీవితంలో సాగర సమీరాలూ, పిల్లన గ్రోవులూ, చల్లగాలులూ అనుకుంటే ఎలా....హౌ? ఆహ, జస్ట్ హౌ?? మనమే టైమ్ చేసుకోవాలి, దానంతట అది మనకి  దొరకదు..సో, నేనే ఈ సాయంత్రం టైమ్ ని పట్టుకుని నా లాప్ టాప్ లో బంధించి మొదలు పెట్టేశా...హమ్మా, నన్ను తప్పించుకుందామనే ?

ఇంతకీ పొద్దున్న ఏమైందంటే....ఏ రోజు అని అడక్కండి...ఇవాళ్టి పొద్దున్న అనే అనుకుందాం, ఏమంటారు??

సో, ఇవాళ్టి పొద్దున్న ఏమైందంటే......

పొద్దున్న భయం భయం గా కాఫీ తాగుతూ, వాకిటి తలుపు కేసి చూస్తూన్నా. భయం కాఫీ బాలేదేమోనని కాదు, తలుపు తెరిచి ఉంటే ఏ దొంగ వాడో వస్తాడనీ కాదు. ఆరు గంటలవుతోందే,  ఎక్కడా ఆ అడుగుల సవ్వడి? ఎక్కడ ఆ పద ధ్వని ఇంకా వినిపించదు?  చిన్ని కృష్ణుడి పాద ముద్రల్లా, ఆ అడుగు జాడలు మా ఇంటి ముంగిట ఇంకా పడవేం? వీనుల విందుగా, మనసుకు చల్లగా ఆ పద సవ్వడులు ఇంకా వినిపించవేం? నా మనసు  పరిపరి విధాల పోతోంది. వస్తుందా, రాదా? అమ్మో రాదేమో? రాకపోతే ఎలా? ప్లాన్ ఆఫ్ ఆక్షన్ ఏమిటి? డిసాస్స్టర్ రికవరీ ప్లాన్ మనసులో వేసేసుకుంటున్నా. ఉన్న టైమ్ మరి రెండున్నర గంటలే. సిక్స్ టు ఎయిట్ థర్టీ!!! ఇప్పుడు టైమ్ ఈజ్ వెరీ ప్రష్యస్. ఈవిడ ఇంకా రాలేదంటే?? సమాధానాలు దొరకని ప్రశ్నలు ముసురుకుంటున్నాయి.. నా ఎదురుచూపులకి  తోడుగా, మెల్లిగా కొంచం టెన్షన్ కూడా వచ్చి చేరుతోంది.

ఇంతకీ ఎవరావిడ అంటారా? వాట్ ఆన్ ఇన్నోసెంట్ క్వశ్చెన్ అననా? లేకపోతే వాట్ ఆన్ ఆరోగంట్ క్వశ్చెన్ అననా?లేకపోతే ఏమిటండీ ఆ ప్రశ్న?

ఎవరావిడా? ఆవిడ ఎవరా?? అసలు అదేం ప్రశ్న???
హు, ఇలాంటి టైమ్ లో ఇలాంటి ప్రశ్నలు వేస్తే పిచ్చి కోపం వచ్చేస్తుంది నాకు. అసలు మా  స్త్రీ జాతి కన్నీటిని, కష్టాల్ని తెలుసుకునే వాళ్ళు లేకనే, ఆ కష్టాలు తీర్చే వాళ్ళు లేకనే ప్రపంచం ఇలాగవుతోంది. ఈ టైమ్ లో స్త్రీ వాదం అంతా గిర గిరా బుర్రలో తిరుగుతుంది నాకు. పౌరుషం కూడా వస్తుంది. ప్రపంచాన్ని, పురుష జాతిని ప్రశ్నించేందుకు ఈటెల్లాంటి ప్రశ్నలు రెడీ అయిపోతుంటాయి బుర్రలో. బట్ దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు టాక్ అబౌట్ అల్ దిస్. సో, బాక్ టు ద పాయింట్, ఎవరావిడ అంటారా?

పొద్దున్న ఆరింటికి, ఏ తెలుగింటి ఆడబడుచైనా ఎవరి కోసం బెంగెట్టుకుంటుంది???  మొగుడికి  కాఫీ ఇవ్వాలనో, అత్తగారికి బూస్ట్ ఇద్దామనో, పిల్లలకి కాంప్లాన్ ఇద్దామనో ఆలోచించే టైమ్ అది. కానీ వీటిని దాటి ఇల్లాలు మనసు కల్లోల పడుతోందంటే, ఆలోచిస్తోందంటే ఏమిటి అర్థం? ఈ బూస్ట్ కాఫీల గురించీ.. లంచ్ గట్రా గురించీ... వీటన్నిటి గురించి నేను (ఆ మాట కొస్తే ఏ ఇల్లాలైనా సరే)  ప్రశాంతంగా ఆలోచించాలంటే, ఆవిడ, ఆ మహా ఇల్లాలు ఇంట అడుగు పెట్టాల్సిందే!! ఆవిడ నిండు చందమామలా ఇంట అడుగుపెడితే సరి! రవితేజ అదేదో సినిమాలో అన్నట్టు గలగలలాడుతూ లచిందేవి వచ్చినట్టుండదూ? అక్కడ లచిందేవి మబ్బుల్లోంచి వస్తే, మా లచిందేవి లిఫ్ట్ లో వస్తుంది అంతే తేడా..హి హి!!

ఇంకా అర్థం కాలా? ఆవిడెవరో? ఆవిడ ఆవిడే! ఆవిడకి మరెవరూ సాటి రారు. అందరూ గుర్తించిన నిత్య సత్యం ఇది. ఆవిడ వస్తే, ఇల్లూ, ఇల్లాలూ, ఇంట్లో అందరూ కళకళ లాడుతూ ఉంటారు, రాకపోతే వెల వెల బోతారు. ఆవిడ ఎప్పుడైనా ఇంటికి రావొచ్చు, ఎపుడైనా పోవచ్చు. పరోక్షంగా ఇంటిమీద ఓ అధికారం సంపాదించుకున్న ఆవిడ - ఆవిడ ఎప్పుడొస్తే అప్పుడు, ఎంత చేస్తే అంతా....ఇంకా అర్ధం కాలేదా?? వామ్మో, మీరెవరో అమెరికా వాసులు అయ్యుంటారు. అందుకే మీకు అర్ధం అయ్యుండదు. ఇక్కడివాళ్ళకి ఎప్పుడో అర్ధమై పోయి ఉంటుంది. ఎనీవేస్ చెప్పేస్తున్నా, అదేనండీ బాబూ ఆవిడెవరో చెప్పేస్తున్నా.., సరే సరే, ఒకే ఒకే, అంత ఉత్కంఠ ఎందుకు? చెప్తున్నాగా, ఆవిడే....మా పనిమనిషి, ఆవిడ గురించే ఇందాకటి నుంచి  చెప్తుంటా!!!

భలేవారే, సూర్యుడు పొడవక పోయినా పరవాలేదు, ఆవిడ రాకపోతే నాకంతా చీకటే.....జీనా యహా మర్ నా యహా అనో ఇస్ కోహి జీనా కేహెతే హైతో, యూ హీ జీలెంగే, ఉఫ్ న కరెంగే, లబ్ సీలెంగే, ఆంసూ పీలెంగే.. అని హిందీ పాటలు పాడుకుంటూనో, మనసున కెన్నో మార్గాలు, కనులకు ఎన్నో స్వప్నాలు, ఎవరొస్తారో, ఎవరుంటారో, ఎమౌనో మన కలలూ”, అని తెలుగు విషాద గీతాలు పాడుకుంటూనో  సింక్ దగ్గర గిన్నెలు తోముకుంటూ దినచర్య మొదలుపెట్టాలి. నాకది అస్సలు ఇష్టంలేదు స్మీ....

నా నోములు ఫలించి ఆవిడ వచ్చేస్తుంది....6.30. ఇంకా ఆశ వీడలేదు నేను. కాకపోతే అవసరమైన నాలుగు గిన్నెలూ కడిగి కుకర్ స్టవ్ మీదకి ఎక్కించి వంట పనిలోకి దిగిపోయాను. ఇప్పటికే ఎదురుచూపుతో కొంత టైమ్ వేస్ట్ అయ్యింది. చెప్పాగా ఇప్పుడు టైమ్ ఈజ్ వెరీ ప్రష్యస్. ఒక రోజుకి సరిపడే పనులు రెండు గంటల్లో చెయ్యాలి కదా..మనదంతా జెట్ స్పీడ్. అంతా చక చకా అయిపోవాల్సిందే (యు హవ్ టు ఫినిష్, యు డోంట్ హవ్ ఎ ఛాయిస్ దేర్, అని కూడా మనం దీన్ని తర్జమా చేసుకోవచ్చు).  

పేపర్ చదువుతూ క్రీగంట నన్ను గమనిస్తున్నారు శ్రీవారు. ఆ చూపులను నేనూ గమనించాను. అందులో రెండో విడత కాఫీ ఆడిగే సమయమిదేనా, అడగొచ్చా, కూడదా అన్న మీమాంస కించిత్తు  కనిపిస్తోంది. నేనేమన్నా ఆ చూపు లోని భావాన్ని అర్ధం చేసుకుంటనేమోనని, అడక్కుండానే ఓ కప్పు చిక్కటి ఫిల్టర్ కాఫీ పట్టుకొస్తానేమోనని ఆయన దురాశ. మా ఆయన కాఫీ గత ప్రాణి అని తెలిసిన అత్తయ్య ఆయన అవస్థ గ్రహించి, వంటింట్లో నా నడకలోని స్పీడూ, పనిలో తొందరతో కూడిన విసురూ కూడా గ్రహించి, ఇలాంటి టైమ్ లో కాఫీ అడుగుతే, విడాకులు ఇస్తానంటుంది అదేదో సినిమాలో, ఊరుకో, ఇది రెండో కాఫీ అడిగే టైమ్ కాదు అని చప్పరించేశారు, మనవడికి తో పాటూ తానూ బూస్ట్ చప్పరిస్తూ. వాళ్ళిద్దరికీ తెలుసు, టైమ్ కి ఓ నిమిషం అటు ఇటూగా నేను ఎలాగూ కాఫీ ఇచ్చేస్తాననిన్నీ, అది నా వీక్నెస్ అనిన్నీ!!!

వంట అల్మోస్ట్ అయిపోయింది. పిల్లవెధవ స్కూల్ బాగ్ సర్దాలీ, అందరికీ లంచ్ బాగ్గులు సర్దాలి, నేను ఆఫీస్ కి ఏ డ్రెస్ వేసుకోవాలో చూసుకోవాలి, అత్తయ్యకి గోధుమ రవ ఉప్మా చేసిపెట్టాలి. టైమ్ 7.30 అవుతోంది. ఇంకో గంటలో వీడి స్కూల్ బస్సు వచ్చేస్తుంది...హడావుడిగా ఉంది...హైరానగా ఉంది...(బై ద వే, సెకండ్ కాఫీ ఎప్పుడో డెలివర్డ్)!! ఇంట్లో మార్నింగ్ డెడ్ లైన్స్ మీట్ అవటం, ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ మీట్ అవటం కన్నా కష్టం. అక్కడ ఫోకస్ ఒక ప్రాబ్లం మీదే. ఇక్కడ అలాక్కాదే..మల్టీ టాస్కింగ్ ఆయే!!! ఇంత హడావుడిలోను అనుకున్న పాటలు, విషాద గీతాలు మర్చిపోయి నాకు తెలీకుండానే భానుమతి గారు పాడిన ఎందుకే నీకింత తొందరా హమ్ చేసుకుంటూ, ఆ పాట తాలూకు ఉత్సాహం నాకు తెలీకుండానే ఫీల్ అవుతూ, ఉత్సాహంగా పని చేసేసుకుంటున్నాను ఆ తోట, ఆ తోపు, ఆకుపచ్చని గూడు, ఆ వంక నెలవంక అన్నీ ఉన్నాయిలే అనటంలో ఎంత పాసిటీవ్ ఫీలింగ్ ఉందో? ఎన్నిసార్లు అనుకున్నా ఓ అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ఇంత హడావిడిలో ఈ కళా పోషణ ఏంటి అంటారా? ఏం చేస్తాం, కవి గార్ని, కంపోసర్ని,గాయనిని అనాలి...ఇంత అద్భుతమైన పాట ఇచ్చినందుకు. మధ్య నన్ను ఆడిపోసుకోటం ఎందుకు? మేరా దిల్, మచల్ గయా తో, మేరా క్యా కుసూర్ హై??” (రఫీ పాట గుర్తొచ్చిందా? ఆప్ కీ హాసిన్ రుఖ్ పే, ఆజ నయ నూర్ హై సూపర్బ్ సాంగ్ అది!!! .....పిడకల వేట!!!)

అసలు ఇలా హమ్ చేసుకుంటూ పనిచేసుకుంటే పని చాలా ఉల్లాసంగా చేసుకుంటాం. పని కూడా చులాగ్గా అయిపోయిన్నట్టు ఉంటుంది. ఇది నేను కనిపెట్టిన సత్యం ప్లస్ నేను వాడే చిట్కా కూడా!! అయితే మనం గట్టిగా గొంతెత్తి పాడి ఇంట్లో హర్మనీని దెబ్బతీయకూడదు సుమీ. సుతి మెత్తగా హామ్ చేసుకోవాలి అంతే. మన గొంతు మనకి వినిపిస్తే చాలు. పాట పాడుతూ పరిసరాల్ని మర్చిపోయి గొంతెత్తి పాడితే జరిగే ప్రమాదాలకి పూర్తిగా మనదే బాధ్యత కాబట్టి మనం జాగ్రత్తగా గొంతుని అదుపులో పెట్టుకోవాలి... ఇది థంబ్ రూల్! లేకపోతే(దాష్టికపు మనుషులు ఇంట్లో ఉంటే), ఇంట్లో యుద్దాలు జరగొచ్చు, పిల్లలు భయపడొచ్చు, పసిపిల్లలు చెప్పుకోలేక గుక్కపట్టి ఏడవ వచ్చు..కొండొకచో పక్కింటి వాళ్ళూ మనపై దాడికి దిగవచ్చు...కాబట్టి, ఇంట్లో వారి ఆరోగ్య, శాంతి భద్రతల దృష్ట్యా మన జాగ్రత్తలో మనం ఉండాలి.

ఇంతలో(టైమ్ ఎనిమిది గంటలవుతోంది) కంచు కంఠం తో వచ్చేశానమ్మగోరూ కాసింత ఆలీసం అయిపోనాది అంటూ రైట్ రాయల్ గా మా లచిందేవి వచ్చేసింది. మా పనమ్మాయి పేరు అదే. నా మొహం కలువపువ్వులా విచ్చుకుంది...అమ్మయ్య,  సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చాక ఇల్లు చిమ్మి, తుడిచి, (బట్టలుతకడం పోస్ట్ పోన్ చెయ్యొచ్చు) గిన్నెలు చచ్చినట్టు తోముకోవాలే అని బెంగ పెట్టుకున్న నాకు మినిమమ్ గా కావల్సిన గిన్నెలు తోముకునే పనితో తెమిలిపోయింది అన్న సంతోషంతో. సంతోషమేల సంగీతమేల పొంగి పోరలేను మనసీవేళా అని పాడుకుంటూ కమ్మటి కాఫీ మూడో విడత మా ఆయనకి ఇచ్చేశాను..బోనస్గా !!! ఇల్లంతా నా నవ్వులతో కలిసి నవ్వుల పువ్వులే....

అత్తయ్య నేను కష్టపడ్డానని (మరి వంటకి కావల్సిన గిన్నెలు తోముకున్నాను కదా), మా ఇద్దరికీ లంచ్ పాక్ చేసి పెట్టారు. ఝామ్మని బైక్లో మా వారితో  కలిసి ఆఫీసుకు వెళ్తునప్పుడు మావారు నాకు కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు,  పాపం ఇవాళ నీకు పనిఎక్కువైంది రాజీ అని. లచిందేవి రావటం ఒక అదృష్టమైతే, నేను కష్టపడ్డాను అని గుర్తెరిగి లంచ్ పాక్ చేసిన అత్తయ్య, ఇవాళ బస్లో వద్దు నేను దింపుతాను నిన్ను అని మరీ, ఆఫీస్ దగ్గర దింపి కష్టాన్ని పంచుకున్న శ్రీవారూ...

ఇప్పుడిలా తాపీగా కూర్చుని పొద్దుటి గురించి ఆలోచిస్తేనాకు చాలా సంతోషంగా అనిపించింది. లచిందేవి రాలేదన్న చిరాకు, ఆ చిరాకులో, ఇన్ని పనులెలా అన్న టెన్షన్అన్నీ తుడిచేశారు వీళ్ళిద్దరు...తమకు తోచిన సహాయాన్ని అందించి. ప్రతిరోజూ జరిగే సంఘటనలే. కోపాలూ, తాపాలు, విసుగులూ విసుర్లూ, మట్టిగడ్డల్లా ఏరేసి, ముత్యాల్లాంటి మనసుల్ని గుర్తెరగటమే కదా జీవితం!!!




Sunday, October 6, 2013

హైదరాబాద్ ఆటో వాలా జిందాబాద్!!!!



హైదరాబాద్ ఆటో వాలా జిందాబాద్!!!!

ఏడవలేక నవ్వటం అంటే ఇదే....

మహా నగరంలో మాయగాళ్ళు  ...
మనుషుల్ని నిలువునా పాతరేయగలిగిన పోటుగాళ్ళు ...
మన పర్సుల్ని మన కళ్ళముందే,  హక్కుగా నిలువు దోపిడీ చేసే వాళ్ళు ....
మన నిస్సహాయతే వాళ్ళ బలంగా మలుచుకున్న వాళ్ళు...
మన హైదరాబాదు ఆటో వాళ్ళు!!

మన హైదరాబాద్  రోడ్స్ మీద ప్రయాణం ఒక ఎత్తైతే, ఇక్కడ ఆటో ప్రయాణం మరో గమ్మత్తు.

ఆటొ నడిపేవారు పలు రకాలు.

ఒకరు అతి మంచివారు. వీళ్ళు ఎంత మంచి వాళ్ళంటే వీరితో సంభాషణ ఇలా ఉండొచ్చు:

పంజగుట్ట ద్వారకాపురి కాలనీ జానా హై...

ఠీక్ హై .. ఎక్కమని తల పంకిస్తూ, మీటరు తిప్పుతాడు.

మనకు అనుమానం వస్తుంది ఇతనికి అసలు అర్ధమైందా అని. భయ్యా సమఝ్ మే ఆయానా, ద్వారకాపురీ కాలనీ కె అందర్ జానా హై ... అంటాం మనం కొంచం అయోమయంగా.

ఆప్ బైఠొనా అమ్మా, కహా బోలెతో వహా లేకే జాయెంగే అంటాడు అతను.

మనల్ని మనం ఒక సారి గిల్లుకుని అరె నిజమే, పాపం ఇతను మంచివాడు లాగా ఉన్నాడు అనుకుంటూ (కొందొకచో పిచ్చివాడు లా ఉన్నాడే అని కొంచం జాలి కూడా పడుతూ), అయినా ఎందుకైనా మంచిది అని  అనుమాన నివృత్తి కోసం ఆటో ఎక్కకుండా, “మీటర్ పే ఆనా భయ్యా, ఫిర్ ఉతర్ నే కె బాద్ జ్యాదా దేనా బొల్కే నై బొల్నా అంటాం.

అతను మన వంక కొంచం చిరాగ్గా చూసి కొంచం జల్ది ఎక్కండమ్మా,  మీటర్ మీద డబ్బులు ఎందుకు అడుగుతాం?” అంటాడు అసలు అలాంటి అనుమానం ఎందుకు వచ్చింది అన్నట్టు. మనం ఒకసారి కింద పడబోయి ఆగి  ఆలస్యం అమృతం విషం అనుకుంటూ గబ గబా ఆ పడేది ఆటోలో  పడి, కూలబడతాం.



ఇక రెండో రకం. వీరితో సంభాషణ తమాషాగా ఉంటుంది. అటు మరీ మంచితనం ఉండదు అలాగని దండుకునే రకం కాదు.

ద్వారకాపురి కాలనీ పంజగుట్ట అంటాం మనం.

ద్వారకాపురీ కాలనీ లోపలికి పోవల్నా?” అంటాడు అతను ప్రతిగా.

అదే కదా కాలనీ అని అంటే, లేకపోతే పంజగుట్ట అనే చెప్పేవాళ్లం కదా,  అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అని మనసులో తిట్టుకుంటూ,  అవును బాబూ గుడి దగ్గరికి వెళ్ళాలి.”  అంటాం .

అతను కాసేపు ఆలోచనలో పడిపోతాడు. అసలు ఇలాంటి కాలనీలు ఎందుకు ఉంటాయో, ఇలాంటి కాలనీల్లో మనుషులు ఎందుకు ఉంటారో, అన్న జీవన మీమాంసలో ఉన్నట్టు, అసలు ఇలాంటి కాలనీల్లోకి వెళ్ళటం నాకిప్పుడు అవసరమా, హాయిగా ఉన్న చోట  ఉండక అన్నట్టు. నిమిషాలు గడుస్తాయి... మనకి ఎండ, ఛ ఎవరి మీదో ఆధారపడుతున్న బతుకు ఇదీ ఒక బతుకేనా అన్న శ్మశాన వైరాగ్యం, ఇప్పుడు ఎంత అడుగుతాడో అన్న చిరాకు తాలూకు బి‌పి పెరుగుతూ ఉంటుంది. ఇంతలో అతను తన కరుణా కటాక్ష వీక్షణాలను మన మీద ప్రసరించి, దేవుడు వరం ప్రసాదించినట్టు, మీటర్ ని తిప్పి, గేర్ పట్టుకుని  ఎక్కమ్మా , లోపట కాల్నిలోకి బోవాల కదా, అక్కడ్కెల్లి గిరాకీ దొర్కదు,  మీటర్ మీద దస్ రూపై దేనా అంటాడు. 

మనకు కొంచం ఉక్రోషం వస్తుంది. అప్పటి వరకూ రాని ఆటోలు, వందలు అడిగిన తాలూకు చిరాకు లోంచి, మన కాలనీకి రావటానికి ఇంత ఆలోచన ఏంటి అని, వెంటనే ఆవేశంలో కొంచం గట్టిగా గుడి దగ్గర గిరాకీ దొర్కదా ఏం చెప్తున్నావయ్య , నేను అమెరికా నుంచి రాలే, రోజూ పొయ్యేడ్డే, పైసా ఎక్కువివ్వను, మీటర్ మీద వస్తే రా అంటాం.

అరె, గంత కోపం జెస్కుంటావెందుకమ్మ,  సరే కూసో,  మీటర్ గెంతైతే గంతనే ఇవ్వు”, అంటాడు పెద్దరికపు నవ్వు విసిరేస్తూ.  మనం ఎక్కువ రియాక్ట్ అయ్యమా అనుకుంటూ ఆటోలో ఎక్కుతాం. అతను దోవ పొడుగునా ఆటో వాళ్ళ కష్టాలు ఏకరువు పెడతాడు నవ్వుతూనే. పాపం డెబ్బై రూపాయలు పెట్టి ఉల్లిపాయలు, పది రూపాయలు పెట్టి కొత్తిమీర కట్ట  కొనుక్కోటానికి మనమే ఇంత ఆలోచిస్తుంటే వీళ్ళకి ఇంకెంత కష్టమో కదా అని మనలో ఎక్కడో చిన్న ఫీలింగ్. దిగుతూ మీటర్ మీద పది రూపాయలు, అతను అడిగినప్పుడు నో అనిన ఆ పది రూపాయలు,(ఇది రొటీన్ గా ఇచ్చేదే) అతనికి ఇచ్చేస్తాం, చాలా గర్వంగా, ఉదారంగా.

 అతను సంతోషంతో షుక్రియా అమ్మా, గిట్ల సంతోషంల ఇస్తే తీసుకుంటం, జబర్దస్తి తీస్కోనుడు మంచిదికాదు అని వెళ్ళిపోతాడు నాకు నీతి బోధ చేస్తున్నట్టు. విన్ విన్ పరిస్థితిలో ఒక మంచి పని చేసిన ఫీలింగ్లో నేను, పది రూపాయలు ఎక్కువ వచ్చింది కదా అని అతను ....ఆ రోజుకి ఆటో ప్రహసనం ముగుస్తుంది.

ఇక మూడో రకం. మోస్ట్ టఫ్ పీపుల్. వీళ్ళు రారు, మనల్ని ఇంకో ఆటో దొరికే వరకు వదల్రు. మహా నాన్పుడు గాళ్ళు.

ద్వారకాపురి కాలనీ పంజగుట్ట, వస్తుందా?” అంటాం మనం.

అతను ఇప్పుడే అమెరికా నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో దిగుమతి అయినట్టు,

ద్వారకాపురి కాలనీ?  పంజగుట్ట??? ఎక్కడుంది ఇది?” అని తాపీగా అడుగుతాడు. మనిషిలో ఒక కేర్లెస్ నెస్, ఒక ఈసీగోయింగ్ తనం, వెరసి ఒక నిర్లక్ష్యం తో కూడుకున్న వినోదపు ఛాయలు కనిపిస్తూ ఉంటాయి.

ఖైరతాబాద్ లో ఉన్న ఆటో వాళ్ళకి పంజగుట్ట తెలీదా అని మనకు కొంచం అనుమానం వస్తుంది. అనుమానాన్ని తోసి రాజని, అతనికి వివరిస్తాం, “నిమ్స్ తరవాత గల్లీలో వస్తుంది అని.

గల్లీలోకి పోవాలా?” అసలు నన్ను నా ఆటోని ఏమనుకుంటున్నారు మీరు? అంత చిల్లరగా అడుగుతారా అన్నట్టు ఉంటుంది ఆ ప్రశ్న.

అవును గల్లీలో గుడి దగ్గరకు పోవాలి. బింకంగా సమాధానమిస్తాం.

నిమ్స్ తరవాత గల్లీ, మాడల్ హౌస్ తాన వచ్చే గల్లీ నా?” సాలోచనగా అడుగుతాడు.
వస్తున్న విసుగుని ఆపుకుంటూ, నుదుటిమీద చెమటని తుడుచుకుంటూ, మధ్యాహ్నం పడ్డ వర్షపు నీళ్ళు నిలిచిపోతే, వాటి మీదనుంచి పడుతూ లేస్తూ వెళ్తున్న ద్విచక్ర వాహనాలను తప్పుకుంటూ, నీళ్ళతో నిండిన గుంటల మీద అడుగు వేయకుండా విశ్వప్రయత్నం చేస్తూ, ఒక చేతిలో సెల్లు, మరో చేతిలో లంచ్ బాగ్, భుజాన హాండ్ బాగ్ మానేజ్ చేస్తూ మనం, ఆటోలో చిద్విలాసంగా కూర్చుని మనం పడుతున్న ఇబ్బందుల్ని చూసీ చూడనట్టుగా చూస్తూ, తాపీగా మాట్లాడుతూ అతను....నిస్సహాయంగా, కనుచూపు మేరలో ఇంకో ఆటో కనిపిస్తుందేమో అని వెతుకుతూనే, “అవును బాబూ అవును (జండూ బామో, విక్సో -  ఆడ్ లో ఎంత విసుగ్గా అంటాడో అంత విసుగ్గా చదుకోవాలి దీన్ని) అంటాం మనం - కొడిగడ్తున్న ఆశను కూడదీసుకుంటూ, మనసులో ఇతను మీటర్ మీద వస్తే బావుండు అనుకుంటూ.


మళ్ళీ కాసేపు ఆలోచన్లో పడి లేచి, “ఏమిస్తారు?” అంటాడతను.

నువ్వే చెప్పు ఇప్పుడు మీటర్ మీద ఆటో దొరకటం కష్టమేమో అనిపించి మనం తగ్గుతాం.

సిక్స్టీ రుపీస్ ఇచ్చేయమ్మా, ఎక్కండి అంటాడు అతను.

సిక్స్టీ రుపీసా? మీటర్ ఇరవై అవుతుంది! వద్దులే అని ముందుకు అడుగేస్తాం మనం.

మనతో పాటే ఆటో ముందుకి కదుల్తుంది, “అరె, గల్లీ లోపట్కి పోవాలే కదా?”

వద్దులే బాబు ఇంకో ఆటో కోసం చూస్తూ ఇతనితో మాటలు అనవసరం, అని ముందుకి వెళ్ళటానికి ప్రయత్నిస్తాం మనం.

అరె ఉండమ్మా? గల్లీ నుంచి బేరం ఉండదు ఖాళీ గా రావాలి, ఎంతిస్తావ్ చెప్పమ్మా?” వదలని బేరం.
ముప్పై ఇస్తాను బస్ ఎక్కలేని మన చేతకాని తనానికి మన మీద మనకే చిరాకు వస్తుంది. బస్ స్టాప్ కి పక్కనే ఇల్లు లేదని ఇంటి మీద చిరాకు వస్తుంది. మధ్యలో ఈ వర్షపు నీళ్ళు, దరిద్రంగా! అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందో, ఆ టాక్స్ అనీ ఈ టాక్స్ అనీ దండుకోటం కాదు రోడ్లు బాగు చేయించ వచ్చు కదా? మనలోని సగటు పౌరుడు ఆవలిస్తూ నిద్ర లేస్తాడు.

యాభై ఇచ్చేయ్య్ వెంటాడుతూ ఆటో వాడు.

నువ్ పోవయ్యా, నీ ఆటో నాకు అవసరం లేదు. చిరాకు గొంతులోంచి ఒలికిపోతుంది కొంత మేరకు. సగటు పౌరులు పూర్తి స్థాయి కోపాన్ని ప్రదర్శించరు కదా!

అరె అంత గుస్సా ఏమిట్కి? యాభై రూపాయలకు ఈ దినాలల్లా ఎమొస్తయ్?” మనతో  పాటే ఆటో నడుపుతూ ఆటో వాడు.

మీకేమోస్తాయో నాకు తెలీదు కానీ, ఎక్కేవాడికి హార్ట్ అట్టాక్ వస్తుంది అన్న నువ్వునాకు నచ్చావ్ సినిమాలో వెంకటేష్ డైలాగ్ గుర్తొస్తుంది. 

ఈ లోపల వెనకే ఇంకో ఖాళీ ఆటో రావటం, ముప్పై రూపాయలకు ఎక్కటం జరుగుతాయి. మనం  బేరమాడుతూ ఖైరతాబాద్ సర్కల్ దాకా వచ్చేసి ఉంటాం. ఆటో ఎక్కి, మా అమ్మాయి మోచేత్తో పొడిస్తే  చూద్దును కదా, పాత ఆటో వాడు, రోడ్డు వారగా పార్క్ చేసుకుని, కాళ్ళు బారచాపుకుని, చిద్విలాసంగా నవ్వుకుంటూ, బేరం పోయిందన్న చింత లేకుండా సిగరెట్టు వెలిగిస్తున్నాడు!
వీళ్ళను తట్టుకోటమే పెద్ద సవాల్!!!





Monday, July 22, 2013

మన హైద్రాబాదే...బాదే...బాదే...



ఎప్పుడైనా సాయంత్రం కొంచం చీకటి పడ్డాక , ఆంటే కాస్త వెలుతురు తగ్గాక -   హైద్రాబాద్ రోడ్ల మీద ప్రయాణం చేస్తే ? అదీ కాస్త వర్షం పడిన తరవాత?

అబ్బో , విఠలాచార్య సినిమాల్లో కాంతారావు గారి  కత్తి యుద్ధాలు ఎందుకూ పనికిరావు స్మీ! అంతెందుకు, ఇప్పటి సినిమాల్లో హీరోలు టాటా సుమోల్ని ఎడం చేత్తో ఎత్తి పడేయగలరేమో గానీ, చస్తే మన గతుకుల రోడ్లమీద, గుడ్డివెల్తుర్లో సింపుల్గా ఓ బైకు నడపమనండి  చూద్దాం. బస్తీమే సవాల్ వాళ్ళ వల్ల కాదు.  వంద మంది విలన్లను ఒక్క చేత్తో కొట్టి మట్టి కరిపించ వచ్చు , కంటి చూపుతో కోట్లాదిమందిని కడతేర్చవచ్చు…. హైద్రాబాద్ రోడ్ల మీద రెండు చక్రాల బండిని అసలేదైనా బండిని,  వర్షం పడుతున్నప్పుడు చులాగ్గా, ఓర్పుగా నడపటం వాళ్ళ వల్ల అవుతుందా? ఇంపాసిబుల్!!!

మొన్నటికి మొన్న, మా పక్కింటి పిన్నిగారి వాళ్ళమ్మాయి పెళ్ళిచూపులు అయినై. పెళ్ళి చూపులకొచ్చిన అబ్బాయికి హైద్రాబాద్ రోడ్ల మీద బండి నడపటం రాదని, “ఇంకేం చాతనవు బాబూ ఐతే అని ముక్కున వేలేసుకుని ఆ సంబంధానికి  నై నై అని చెప్పేసారట.

అదేమిటి పిన్నిగారూ? అబ్బాయి ఏదో పెద్ద చదువులు చదివాడనీ, బాగా సంపాదిస్తున్నాడనీ సంబర పడ్డారుగా అంటే : ఆ ఏం సంబడం లేమ్మా, పెరటి చెట్టు వైద్యానికి పనికి రానట్టు, హైద్రాబాద్ రోడ్లమీద బండి నడపలేడట అని కరివేప ఆకును తీసేసినట్టు తీసేసింది.

అదేమిటి పిన్నీఅంటే, “నువ్వే చెప్పు లక్ష్మీ లక్షలు సంపాదించవచ్చుగాక, అబ్బాయికి తెలివిగా బండి నడపటం రాకపోతే, ఎప్పుడు ఇంటికి చేరేనూ? ఓ సరదా సబ్బుముక్క ఏమేడుస్తుందీ? సాయంత్రం అయిదింటికి బయల్దేరిన మనిషి కనీసం ఏడింటికి ఇల్లు చేరాలంటే ఎంత డ్రైవింగ్ నైపుణ్యం ఉండాలి?  అవేమీ లేకుండా మొద్దు రాచిప్ప లాగా ఈడ్చుకుంటూ పదింటికి ఇల్లు చేరితే ఓ ముద్దూ మురిపెం ఉంటుందా? లక్షలేం చేసుకుంటాం లక్ష్మీ - బొక్కుతామా? నా కూతురు రోజంతా ఎదురుచూస్తూ ఇంటో కూచోడం నాకిష్టం లేదు. మన హైద్రాబాద్ రోడ్డు మీద బండి నడపలేడు అంటే తెలివి తక్కువ దద్దమ్మ ఐనా అయుండాలి, లేక ఓర్పు లేని వాడు ఐనా అయుండాలి,” అని బల్ల గుద్ది మరీ చెప్పారు పిన్నిగారు. రాయి లాంటి బల్ల, మా తాతల నాటి బల్ల  విరిగినట్టై  ఓపక్కకు ఒరిగి పోయిందని, నువ్వూ నీ పనికిమాలిన ఇంక్విసిటీవ్ నేస్సూ  అని మా ఆయన నన్ను ఆడిపోసుకున్నారు కూడా!

అంతకు ముందు, మా ఎదురింటి కళ్యాణి ఉన్నట్టుండి లడ్డూలు పంచితే, అక్కా ఏమిటి సంగతి అని అడిగాను. ఏం లేదు లక్ష్మీ మా అమ్మాయి...

 ఏమిటి  అక్కా తను ఎవర్నో ప్రేమించింది అన్నావ్, అందరూ పెళ్ళికి ఒప్పుకున్నారా?” అని అడిగాను ఆత్రంగా.

ఛ చ...లేదు లక్ష్మీ, మా అమ్మాయే, మమ్మీ నేనిప్పుడు అతన్ని ప్రేమించట్లేదు, మీరు తెచ్చిన గుంటూరు సంబంధమే ఖాయం చేయండి అని చెప్పింది  అనింది కళ్యాణి.

అదేమిటక్కా మొన్నటిదాకా ప్రేమ ప్రేమ అని అరిచి గీ పెట్టి గొడవ చేసిందిగా?”  దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యి అరిచాను నేను. నన్నిలా అయోమయ పరిస్థితిలోకి నెట్టడానికి మీకెవరు హక్కు ఇచ్చారు అని కొంచం ఆవేదన కూడా ధ్వనించింది నా గొంతులో.

ఇంతకూ తెలిసిన విష్యం ఏమిటంటే శుభ  ప్రేమించిన రాజుకి స్కూటీ నడపటం కూడా రాదట. కారు రాకపోతే పోయే స్కూటీ కూడా రాదట ఆంటీ అని ముక్కు చీదింది శుభ. అది కాదు శుభా అదేమంత పెద్ద విషయమని? అని చెప్పబోయాను...మీకు తెలీదాంటీ ఏ సెమిస్టర్ లోనూ ఒక్క పేపర్ తప్ప పాసు కాలేదు, సర్లే బాక్ లాగ్స్ అందరికీ ఉంటాయికదా పోతేపోనీ, పిల్లాడు రవితేజా లా పోకిరీగా దబాయించి కుళ్ళు జోకులేస్తాడు, బానే ఉన్నాడు కదా అనుకున్నా, చింపిరి జుట్టు జులపాలూ ఉంటే హీరో లా ఉన్నాడు కదా అనుకున్న, బేవార్సుగా సోమరిగా తిరుగుతూ ఉంటే సరిగ్గా మన తెలుగు హీరోలాగా ఉన్నాడు కదా అని ముచ్చట పడ్డాను కానీ ఏం లాభం స్కూటీ నడపటం రాదట ఆంటీ...మళ్ళీ ముక్కు చీదుడు కార్యక్రమం మొదలుపెట్టింది శుభ. అసలు ఈ స్కూటీ గొడవెంటీ తల్లీ అని అడిగాను....

ఆంటీ మన రోడ్లు ఎలా ఉంటాయి? అడుక్కో గొయ్యి , రెండడుగులకు ఓ మూత లేని manhole అవునా? వీటి మధ్య వాన తుంపరకు తెగి పడ్డ కంకర రోడ్డు. ఈ రోడ్డు మీద బైకు నడిపితే , ఓ హీరో గుర్రపు స్వారీ చేస్తూ యుద్ధం చేస్తున్నట్టుగా, ఓ టాటా సుమోని ఎడం చేత్తో ఆపినట్టుగా, ఎంత మాన్ లీ గా ఉంటుంది? అలా విజయోత్సాహంతో ఇంటికి వస్తే ఎంత గొప్పగా ఉంటుంది. అదేమీ లేకుండా డొక్కు బస్సు ఎక్కి కాలేజీకి వస్తాడట...ఆన్ బిలీవబ్ల్...అంటూ ముక్కు ఎగ బీలుస్తూ వెళ్లిపోయింది శుభ.

నీకెందుకీ అనవసర అజలూ, వ్యాపకాలూ, హాయిగా యే  టీవీ సీరియలో చూస్కోక, అని నన్ను తిట్టిపోశారు మా ఆయన ఆ రోజు.... తలనొప్పీ, జ్వరం, పైత్యం అన్నీ వచ్చినట్టై నేను పిచ్చి చూపులు చూస్తూ కూర్చుంటే!  

ఇంతకీ విషయం ఏమిటంటే, ఇవాళ రాత్రి తొమ్మిది గంటలప్పుడు, వర్షం పడుతుంటే, మా బాల్కనీ లో నుంచుని చూస్తున్నా. రోడ్డు  మీద పిట్ట పురుగు లేదు. వర్షపు జల్లుకి ఇంటి ముందు ఉన్న చెట్లన్నీతడిసి, ఆకులన్నీ  చినుకులతో నిండిపోయి ఉన్నాయి. గుడ్డిగా వెలిగే వీధి దీపపు వెలుతురు ఆకులపైన ఉన్న చినుకుల మీద పడి ఆకులన్నీ నక్షత్రాలై. మా ఇంటి ముందు అంతా, చెట్లకి  నక్షత్రాలు పూసినట్టు ఉంది. నిశ్శబ్దం, సన్నటి వర్షం, చెట్లపైన నక్షత్రాలూ మా ఆయిన వినిపించిన అల్లదే అవతల అదిగో నా ప్రియా కుటీరా వాటిక వింటుంటే రోజూ మనం తిట్టుకునే గుడ్డి దీపాలు, వర్షంఇంత అందంగా ఉంటాయా అనిపించి, రోజూ వర్షాకాలంలో మనం ఎదుర్కునే అవస్తల గురించి సరదాగా రాయాలని అనిపించింది!!!

ప్రతి మేఘానికి ఒక మెరుపు అంచు ఉంటుందట!!!