మిరియమ్ వేసిన కేక, మామూలు కేక కాదు. అది గొంతులోనుంచి వచ్చినట్టు లేదు. పేగులు చించుకుని వచ్చినట్టు ఉంది. ఒక దెబ్బతిన్న అడవి జంతువు పెట్టిన చావు కేకలా ఉంది. పిల్లల్ని అలా చూసిన ఆమె ఒక ఉన్మాదిలా కేకలు పెడుతోంది. చూసినది తట్టుకోలేక వాంతి చేసుకుని, అక్కడే కూలబడి పెనుకేకలు పెడుతోంది. ఆ అరుపులకు గది గోడలు వణుకుతున్నట్టు ఉన్నాయి. అక్కడినుంచి బయటకి తీసికెళ్ళటానికి ప్రయత్నిస్తున్న వైద్య బృందాన్ని ప్రతిఘటిస్తూ, కాళ్ళతో తంతూ, అరుస్తున్న ఆమెను బలవంతంగా మత్తు మందు ఇచ్చి బయటకి తీసికెళ్ళారు అక్కడికి వచ్చిన వైద్యులు. పోలీసులు తమపని తాము చేసుకుని పోతున్నారు. ఇద్దరు పిల్లలు. ఒకడు ఎక్కువ కష్టపడకుండానే చచ్చిపోయాడు. అమ్మాయి మాత్రం కొన ఊపిరితో ఉంది…
**
లల్లబై - లైలా స్లిమని (Lullaby - French: Leila Slimani - Translated by: Sam Taylor)
ప్రెంచ్ నుంచి ఇంగ్లీష్ లోకి అనువదింప బడ్డ ఈ నవల ఒక క్రైమ్ / సస్పెన్స్ థ్రిల్లరా? ఒక సైకలాజికల్ థ్రిల్లరా?? ఒక సోషియలాజికల్ / జెండర్ / జాతి వివక్షల ప్రతిబింబమా?
పుస్తకం మొదలుపెట్టిన దగ్గరనుంచి ఒక చిక్కటి, నల్లని, సుడిగుండంలోచిక్కుకున్న అనుభూతి. అందులోనుంచి పైకి రావటానికి ప్రయత్నం చేస్తాం, పట్టు దొరకదు. ఊపిరాడని సఫొకేషన్. ఆ భాషా, ఆ పాత్రలూ మనల్ని చుట్టేసి, కమ్మేస్తాయి. ఆ సుడిగుండంలో చిక్కుకుని సుడులు తిరుగుతూ మనం కూడా కిందకు వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకుంటే బావుండు అనిపిస్తుంది. ఈ ఊబిలోనుంచి, ఈ పాత్రల జీవితాల్లోనుంచి బయట పడితే బావుండు అనిపిస్తుంది. బలమైన పాత్రలను సృష్టించటం ఒక ఎత్తు, అంతటి పాత్రలనూ ఒక కథనంతో ముడిపెట్టి చదువరిని అంతే బలంగా శక్తిమంతంగా కట్టిపడేసి చివరి వాక్యం వరకూ చదివించే శక్తిని ప్రదర్శించటం ఒక ఎత్తు. ప్రెంచ్ భాష నుంచి ఈ నవలని ఇంగ్లీష్ లోకి అనువదించింది సామ్ టెయిలర్.
కథ - ప్రస్తుత కాలానికి చెందినదే. ఒక కుటుంబం - ప్రేమించి పెళ్ళిచేసుకున్న పాల్, మిరియమ్, వారి పిల్లలు ఆడమ్, మిలా. పిల్లల్ని పెంచటం వర్సస్ కరీర్ ప్రధాన సమస్య. మిరియమ్ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఒక భార్యగా ఇంటికి పరిమితమౌతుంది. రోజులు గడిచే కొద్దీ ఆమెకు జీవితం దుర్భరంగా అనిపిస్తుంది. ఎన్నో కష్టాలకోర్చి చదివిన చదువు - అన్నీ వదులుకుని ఇలా మిగిలిపొవటం ఆమెకు నచ్చదు. రచయిత్రి ఇక్కడ జెండర్ గురించి పట్టుగా లోతుగా విశ్లేషిస్తారు. పిల్లల్ని పెంచటం, స్త్రీ పాత్ర - శారీరక మానసిక ఇబ్బందులు, ఇష్టం లేకపోయినా చేసే త్యాగాలూ, అసమానతలు ఇవన్నీ మిరియమ్ ద్వారా చర్చించటం జరుగుతుంది. అలాగే పరిస్థితుల పట్ల పాల్ అసహనం, ఇద్దరిలో జీవితంలో ఏదో సాధించాలన్న ఆత్రం గురించి కూడా రచయిత్రి నిశితమైన పరిశీలన చేస్తారు. భార్యా భర్తలిద్దరూ కలిసి పిల్లల్ని చూసుకోవటానికి ఒక సహాయకురాలిని(Nanny) ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటారు.
ఆలా ఆ ఇంట్లోకి ఒక నానీగా(Nanny), పిల్లల్ని చూసుకునే వ్యక్తిగా ప్రవేశిస్తుంది లూయిస్. ఆమె తమ సమస్యలు అన్నింటికీ ఒక అద్భుతమైన సమాధానంలా కనిపిస్తుంది దంపతులిద్దరికీ. పిల్లల్ని చక్కగా చూసుకుంటూ, ఇంటి పనులనీ, వంట పనులనీ అవలీలగా చేస్తూ తనకంటూ ఆ ఇంట్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటుంది లూయిస్. పిల్లలపై ఆమె చూపే శ్రద్ధా, పనితీరు, ఆ దంపతులకి ఇంటిపై బెంగ లేకుండా తమ పనులు/వృత్తులపై, మనసుపెట్టి పని చేసుకునే వెసలుబాటు కల్పించి, వారి ఎదుగుదలకు తోడ్పడుతుంది. వారు కోరుకున్న జీవితానికి బాటలు వేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఆర్ధికంగా ఎదగటం, ఈనాటి సమాజంలో ఒక ముఖ్యమైన విషయం అన్నది మరోసారి గుర్తుచెయ్యటం రచయిత్రి ఉద్దేశం అనిపిస్తుంది. అన్నీ తానే అయ్యి, అన్ని పనులూ చేస్తూ, నెమ్మదిగా ఆ ఇంటి మధ్యలో తనకంటూ ఒక గూడుని కట్టుకునే ప్రయత్నం మొదలు పెడుతుంది లూయిస్. తనూ ఆ కుటుంబంలో ఒక భాగమవటానికి తయారవుతుంది ఆమె. ఇక్కడే యజమానులకి పనివాళ్ళకి మధ్య వచ్చే భేదాభిప్రాయాలూ, లూయిస్ స్వతంత్ర నిర్ణయాలు, యజమానులకూ పనివారికీ మధ్య ఎంత సాన్నిహిత్యం ఉన్నా, సమానత్వం ఉండే అవకాశం తక్కువ అన్న నిజం, పనివారు కుటుంబంలో ఒక భాగం కావటం అంత సులభమైన విషయం కాదూ అన్న విషయం, జాతి వివక్ష, వీటన్నిటి తాలుకు క్లిష్టతలూ రచయిత్రి ప్రస్తావిస్తారు. లూయిస్ ఒక చిక్కని నీలినీడలు నింపుకున్న బలమైన పాత్ర. ఆమె ఒంటరి బ్రతుకు, కుంగిన ఆర్థిక పరిస్థితులూ, ఆమెని విడిచి వెళ్ళిపోయిన కూతురూ, చనిపోయిన భర్తా, ఎవరికీ తన గురించి తెలియకుండా గుంభనంగా ఆమె మసులుకునే తీరూ, ఆమెలో ఎక్కడో పొంచి ఉన్న ఒక విపరీత ధోరణి వీటిని మనకు రచయిత్రి పరిచయం చేస్తూనే ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, తన అవసరం ఇక యజమానులకు ఉండదు అన్న భయం, వాళ్ళకు ఇంకొక బిడ్డ పుడితే తను అక్కడే ఉండవచ్చన్న ఆలోచన ఆమెను నిలవనీయకుండా చేస్తాయి. చివరికి తను అమితంగా ప్రేమించిన పిల్లల్ని చంపి హంతకురాలు అవుతుంది లూయిస్.
మనుషుల మధ్య నిరంతరంగా సాగే బంధాల మధ్య కదలాడే చీకటి కోణం సాక్షిగా, ఊహకి అందని ఒక భయంకరమైన కథ ఇది. ఇలాంటి కథలు వార్తల్లో వింటూ, చూస్తూ ఉంటాం. కానీ ఆ కథల వెనక కదలాడే నీడల చిత్రాలనూ, మానసిక ఘర్షణలనూ ఎత్తి చూపించిన పుస్తకం ఇది.
మనసుని వేధించే పుస్తకం ఇది.