Sunday, October 6, 2013

హైదరాబాద్ ఆటో వాలా జిందాబాద్!!!!



హైదరాబాద్ ఆటో వాలా జిందాబాద్!!!!

ఏడవలేక నవ్వటం అంటే ఇదే....

మహా నగరంలో మాయగాళ్ళు  ...
మనుషుల్ని నిలువునా పాతరేయగలిగిన పోటుగాళ్ళు ...
మన పర్సుల్ని మన కళ్ళముందే,  హక్కుగా నిలువు దోపిడీ చేసే వాళ్ళు ....
మన నిస్సహాయతే వాళ్ళ బలంగా మలుచుకున్న వాళ్ళు...
మన హైదరాబాదు ఆటో వాళ్ళు!!

మన హైదరాబాద్  రోడ్స్ మీద ప్రయాణం ఒక ఎత్తైతే, ఇక్కడ ఆటో ప్రయాణం మరో గమ్మత్తు.

ఆటొ నడిపేవారు పలు రకాలు.

ఒకరు అతి మంచివారు. వీళ్ళు ఎంత మంచి వాళ్ళంటే వీరితో సంభాషణ ఇలా ఉండొచ్చు:

పంజగుట్ట ద్వారకాపురి కాలనీ జానా హై...

ఠీక్ హై .. ఎక్కమని తల పంకిస్తూ, మీటరు తిప్పుతాడు.

మనకు అనుమానం వస్తుంది ఇతనికి అసలు అర్ధమైందా అని. భయ్యా సమఝ్ మే ఆయానా, ద్వారకాపురీ కాలనీ కె అందర్ జానా హై ... అంటాం మనం కొంచం అయోమయంగా.

ఆప్ బైఠొనా అమ్మా, కహా బోలెతో వహా లేకే జాయెంగే అంటాడు అతను.

మనల్ని మనం ఒక సారి గిల్లుకుని అరె నిజమే, పాపం ఇతను మంచివాడు లాగా ఉన్నాడు అనుకుంటూ (కొందొకచో పిచ్చివాడు లా ఉన్నాడే అని కొంచం జాలి కూడా పడుతూ), అయినా ఎందుకైనా మంచిది అని  అనుమాన నివృత్తి కోసం ఆటో ఎక్కకుండా, “మీటర్ పే ఆనా భయ్యా, ఫిర్ ఉతర్ నే కె బాద్ జ్యాదా దేనా బొల్కే నై బొల్నా అంటాం.

అతను మన వంక కొంచం చిరాగ్గా చూసి కొంచం జల్ది ఎక్కండమ్మా,  మీటర్ మీద డబ్బులు ఎందుకు అడుగుతాం?” అంటాడు అసలు అలాంటి అనుమానం ఎందుకు వచ్చింది అన్నట్టు. మనం ఒకసారి కింద పడబోయి ఆగి  ఆలస్యం అమృతం విషం అనుకుంటూ గబ గబా ఆ పడేది ఆటోలో  పడి, కూలబడతాం.



ఇక రెండో రకం. వీరితో సంభాషణ తమాషాగా ఉంటుంది. అటు మరీ మంచితనం ఉండదు అలాగని దండుకునే రకం కాదు.

ద్వారకాపురి కాలనీ పంజగుట్ట అంటాం మనం.

ద్వారకాపురీ కాలనీ లోపలికి పోవల్నా?” అంటాడు అతను ప్రతిగా.

అదే కదా కాలనీ అని అంటే, లేకపోతే పంజగుట్ట అనే చెప్పేవాళ్లం కదా,  అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అని మనసులో తిట్టుకుంటూ,  అవును బాబూ గుడి దగ్గరికి వెళ్ళాలి.”  అంటాం .

అతను కాసేపు ఆలోచనలో పడిపోతాడు. అసలు ఇలాంటి కాలనీలు ఎందుకు ఉంటాయో, ఇలాంటి కాలనీల్లో మనుషులు ఎందుకు ఉంటారో, అన్న జీవన మీమాంసలో ఉన్నట్టు, అసలు ఇలాంటి కాలనీల్లోకి వెళ్ళటం నాకిప్పుడు అవసరమా, హాయిగా ఉన్న చోట  ఉండక అన్నట్టు. నిమిషాలు గడుస్తాయి... మనకి ఎండ, ఛ ఎవరి మీదో ఆధారపడుతున్న బతుకు ఇదీ ఒక బతుకేనా అన్న శ్మశాన వైరాగ్యం, ఇప్పుడు ఎంత అడుగుతాడో అన్న చిరాకు తాలూకు బి‌పి పెరుగుతూ ఉంటుంది. ఇంతలో అతను తన కరుణా కటాక్ష వీక్షణాలను మన మీద ప్రసరించి, దేవుడు వరం ప్రసాదించినట్టు, మీటర్ ని తిప్పి, గేర్ పట్టుకుని  ఎక్కమ్మా , లోపట కాల్నిలోకి బోవాల కదా, అక్కడ్కెల్లి గిరాకీ దొర్కదు,  మీటర్ మీద దస్ రూపై దేనా అంటాడు. 

మనకు కొంచం ఉక్రోషం వస్తుంది. అప్పటి వరకూ రాని ఆటోలు, వందలు అడిగిన తాలూకు చిరాకు లోంచి, మన కాలనీకి రావటానికి ఇంత ఆలోచన ఏంటి అని, వెంటనే ఆవేశంలో కొంచం గట్టిగా గుడి దగ్గర గిరాకీ దొర్కదా ఏం చెప్తున్నావయ్య , నేను అమెరికా నుంచి రాలే, రోజూ పొయ్యేడ్డే, పైసా ఎక్కువివ్వను, మీటర్ మీద వస్తే రా అంటాం.

అరె, గంత కోపం జెస్కుంటావెందుకమ్మ,  సరే కూసో,  మీటర్ గెంతైతే గంతనే ఇవ్వు”, అంటాడు పెద్దరికపు నవ్వు విసిరేస్తూ.  మనం ఎక్కువ రియాక్ట్ అయ్యమా అనుకుంటూ ఆటోలో ఎక్కుతాం. అతను దోవ పొడుగునా ఆటో వాళ్ళ కష్టాలు ఏకరువు పెడతాడు నవ్వుతూనే. పాపం డెబ్బై రూపాయలు పెట్టి ఉల్లిపాయలు, పది రూపాయలు పెట్టి కొత్తిమీర కట్ట  కొనుక్కోటానికి మనమే ఇంత ఆలోచిస్తుంటే వీళ్ళకి ఇంకెంత కష్టమో కదా అని మనలో ఎక్కడో చిన్న ఫీలింగ్. దిగుతూ మీటర్ మీద పది రూపాయలు, అతను అడిగినప్పుడు నో అనిన ఆ పది రూపాయలు,(ఇది రొటీన్ గా ఇచ్చేదే) అతనికి ఇచ్చేస్తాం, చాలా గర్వంగా, ఉదారంగా.

 అతను సంతోషంతో షుక్రియా అమ్మా, గిట్ల సంతోషంల ఇస్తే తీసుకుంటం, జబర్దస్తి తీస్కోనుడు మంచిదికాదు అని వెళ్ళిపోతాడు నాకు నీతి బోధ చేస్తున్నట్టు. విన్ విన్ పరిస్థితిలో ఒక మంచి పని చేసిన ఫీలింగ్లో నేను, పది రూపాయలు ఎక్కువ వచ్చింది కదా అని అతను ....ఆ రోజుకి ఆటో ప్రహసనం ముగుస్తుంది.

ఇక మూడో రకం. మోస్ట్ టఫ్ పీపుల్. వీళ్ళు రారు, మనల్ని ఇంకో ఆటో దొరికే వరకు వదల్రు. మహా నాన్పుడు గాళ్ళు.

ద్వారకాపురి కాలనీ పంజగుట్ట, వస్తుందా?” అంటాం మనం.

అతను ఇప్పుడే అమెరికా నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో దిగుమతి అయినట్టు,

ద్వారకాపురి కాలనీ?  పంజగుట్ట??? ఎక్కడుంది ఇది?” అని తాపీగా అడుగుతాడు. మనిషిలో ఒక కేర్లెస్ నెస్, ఒక ఈసీగోయింగ్ తనం, వెరసి ఒక నిర్లక్ష్యం తో కూడుకున్న వినోదపు ఛాయలు కనిపిస్తూ ఉంటాయి.

ఖైరతాబాద్ లో ఉన్న ఆటో వాళ్ళకి పంజగుట్ట తెలీదా అని మనకు కొంచం అనుమానం వస్తుంది. అనుమానాన్ని తోసి రాజని, అతనికి వివరిస్తాం, “నిమ్స్ తరవాత గల్లీలో వస్తుంది అని.

గల్లీలోకి పోవాలా?” అసలు నన్ను నా ఆటోని ఏమనుకుంటున్నారు మీరు? అంత చిల్లరగా అడుగుతారా అన్నట్టు ఉంటుంది ఆ ప్రశ్న.

అవును గల్లీలో గుడి దగ్గరకు పోవాలి. బింకంగా సమాధానమిస్తాం.

నిమ్స్ తరవాత గల్లీ, మాడల్ హౌస్ తాన వచ్చే గల్లీ నా?” సాలోచనగా అడుగుతాడు.
వస్తున్న విసుగుని ఆపుకుంటూ, నుదుటిమీద చెమటని తుడుచుకుంటూ, మధ్యాహ్నం పడ్డ వర్షపు నీళ్ళు నిలిచిపోతే, వాటి మీదనుంచి పడుతూ లేస్తూ వెళ్తున్న ద్విచక్ర వాహనాలను తప్పుకుంటూ, నీళ్ళతో నిండిన గుంటల మీద అడుగు వేయకుండా విశ్వప్రయత్నం చేస్తూ, ఒక చేతిలో సెల్లు, మరో చేతిలో లంచ్ బాగ్, భుజాన హాండ్ బాగ్ మానేజ్ చేస్తూ మనం, ఆటోలో చిద్విలాసంగా కూర్చుని మనం పడుతున్న ఇబ్బందుల్ని చూసీ చూడనట్టుగా చూస్తూ, తాపీగా మాట్లాడుతూ అతను....నిస్సహాయంగా, కనుచూపు మేరలో ఇంకో ఆటో కనిపిస్తుందేమో అని వెతుకుతూనే, “అవును బాబూ అవును (జండూ బామో, విక్సో -  ఆడ్ లో ఎంత విసుగ్గా అంటాడో అంత విసుగ్గా చదుకోవాలి దీన్ని) అంటాం మనం - కొడిగడ్తున్న ఆశను కూడదీసుకుంటూ, మనసులో ఇతను మీటర్ మీద వస్తే బావుండు అనుకుంటూ.


మళ్ళీ కాసేపు ఆలోచన్లో పడి లేచి, “ఏమిస్తారు?” అంటాడతను.

నువ్వే చెప్పు ఇప్పుడు మీటర్ మీద ఆటో దొరకటం కష్టమేమో అనిపించి మనం తగ్గుతాం.

సిక్స్టీ రుపీస్ ఇచ్చేయమ్మా, ఎక్కండి అంటాడు అతను.

సిక్స్టీ రుపీసా? మీటర్ ఇరవై అవుతుంది! వద్దులే అని ముందుకు అడుగేస్తాం మనం.

మనతో పాటే ఆటో ముందుకి కదుల్తుంది, “అరె, గల్లీ లోపట్కి పోవాలే కదా?”

వద్దులే బాబు ఇంకో ఆటో కోసం చూస్తూ ఇతనితో మాటలు అనవసరం, అని ముందుకి వెళ్ళటానికి ప్రయత్నిస్తాం మనం.

అరె ఉండమ్మా? గల్లీ నుంచి బేరం ఉండదు ఖాళీ గా రావాలి, ఎంతిస్తావ్ చెప్పమ్మా?” వదలని బేరం.
ముప్పై ఇస్తాను బస్ ఎక్కలేని మన చేతకాని తనానికి మన మీద మనకే చిరాకు వస్తుంది. బస్ స్టాప్ కి పక్కనే ఇల్లు లేదని ఇంటి మీద చిరాకు వస్తుంది. మధ్యలో ఈ వర్షపు నీళ్ళు, దరిద్రంగా! అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందో, ఆ టాక్స్ అనీ ఈ టాక్స్ అనీ దండుకోటం కాదు రోడ్లు బాగు చేయించ వచ్చు కదా? మనలోని సగటు పౌరుడు ఆవలిస్తూ నిద్ర లేస్తాడు.

యాభై ఇచ్చేయ్య్ వెంటాడుతూ ఆటో వాడు.

నువ్ పోవయ్యా, నీ ఆటో నాకు అవసరం లేదు. చిరాకు గొంతులోంచి ఒలికిపోతుంది కొంత మేరకు. సగటు పౌరులు పూర్తి స్థాయి కోపాన్ని ప్రదర్శించరు కదా!

అరె అంత గుస్సా ఏమిట్కి? యాభై రూపాయలకు ఈ దినాలల్లా ఎమొస్తయ్?” మనతో  పాటే ఆటో నడుపుతూ ఆటో వాడు.

మీకేమోస్తాయో నాకు తెలీదు కానీ, ఎక్కేవాడికి హార్ట్ అట్టాక్ వస్తుంది అన్న నువ్వునాకు నచ్చావ్ సినిమాలో వెంకటేష్ డైలాగ్ గుర్తొస్తుంది. 

ఈ లోపల వెనకే ఇంకో ఖాళీ ఆటో రావటం, ముప్పై రూపాయలకు ఎక్కటం జరుగుతాయి. మనం  బేరమాడుతూ ఖైరతాబాద్ సర్కల్ దాకా వచ్చేసి ఉంటాం. ఆటో ఎక్కి, మా అమ్మాయి మోచేత్తో పొడిస్తే  చూద్దును కదా, పాత ఆటో వాడు, రోడ్డు వారగా పార్క్ చేసుకుని, కాళ్ళు బారచాపుకుని, చిద్విలాసంగా నవ్వుకుంటూ, బేరం పోయిందన్న చింత లేకుండా సిగరెట్టు వెలిగిస్తున్నాడు!
వీళ్ళను తట్టుకోటమే పెద్ద సవాల్!!!