Sunday, May 28, 2017

నాకు నచ్చిన పుస్తకం - "Hour Glass - Time,Memory Marriage" (2017) By Dani Shapiro





Hour Glass - Time,Memory Marriage (2017)
By Dani Shapiro

డానీ షపీరో అనే అమెరికన్ రచయిత్రి, ఇప్పటివరకూ అయిదు నవలలూ, రెండు మెమాయిర్స్ రాసారు. ఆత్మకథల వరసలో ఇది మూడో తాజాపుస్తకం.

తన 18 యేళ్ళ వైవాహిక జీవితం, అందులోని ఒడిదుడుకులు; పరిస్ఠితుల్లో, వ్యక్తుల్లో, వ్యక్తిత్వాల్లో కలిగే మార్పులూ -  వీటన్నింటి గురించి నిజాయితీగా రాసిన పుస్తకం ఇది. ఒకరికొకరు అన్న నేపథ్యంలో, భార్యా భర్తా  ఇద్దరూ ఎంత జీవితాన్ని, వ్యక్తిత్వాన్నీ కోల్పోతారు? ఎంత మార్పుకు గురౌతారు? తమలో కలిగిన మార్పునీ, అవతలి వ్యక్తిలోని మార్పునీ ఎలా తీసుకుంటారు?  జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు ఎలా ఒకరికొకరు ధైర్యాన్నిచ్చుకుంటారు?  తలిదండ్రులు, అత్తామామలు, భయాలూ, కష్టాలూ, ఆనందాలూ, అనారోగ్యాలూ, చావూ, పుట్టుక, గెలుపు, ఓటమి, దైనందిన జీవితం - ఇవన్నీ కలగజేసే ఉద్వేగాల, వైరాగ్యాల, అనుభూతుల శకలాలు మనస్సుకీ బుద్ధికీ ఎలాంటి పరిణతిని లేక సంయమనాన్నీ కలగజేస్తాయి అన్న చర్చకు తెరలేపటం బావుంది. పుస్తకంలో ఒకచోట ఒక చక్కటి ప్రస్తావన తెస్తారు రచయిత్రి : "What must we summon and continue to summon in order to form ourselves toward, against, alongside another person for the duration? To join ourselves to the unknown? What steadfastness of spirit? What relentless faith?"
‌‌
కుటుంబంలోని  అత్యంత ముఖ్యమైన వ్యక్తులు, తలితండ్రులు, భార్యాభర్తలూ, పిల్లలూ - ఒకరికొకరు ఎంత తెలుసు? అంతెందుకు - మన గురించి మనకు ఎంత తెలుసు? మనలో మనం ఎన్ని రూపాలు ధరించి ఉన్నాం? మనలో మనం ముక్కలుగా, ఎన్ని రకాలుగా విడిపొయి ఉన్నాం? ఒకప్పటి మనకి, ఇప్పటి మనకి మధ్య  కరిగిపోయిందేమిటి, మిగిలింది ఏమిటి? ఈ రెంటికీ వంతెనలా ఉన్న మనుషులూ, పరిస్థితులూ, ఆ ఛాయా చిత్రాలూ ఎన్ని మరుపు తెరలలోకి జారుకున్నాయి? మనం మనలా ఎంత మిగిలాం, ఎంత మార్పుకు గురి అయ్యాం లాంటి మౌలిక ప్రశ్నలు మనకు ఎదురౌతాయి ఈ పుస్తకంలో.

"I am on my chaise, journals all over the floor, trying to gather my whole lost tribe of selves around me." - కోల్పోయిన రూపాలని పోగేసుకోవడం కూడా, ధరించబోయే రూపాలకి కొంత శక్తినీ, స్థైర్యాన్నీ, ఆలోచననీ కలగజేస్తుంది!

కాకపోతే ఇది జీవిత చరిత్ర కాదు, ఒక మెమాయిర్. తన వైవాహిక జీవితంలోని కొన్ని సంఘటనలను, గుర్తులనూ కలబోసి తన ఆలోచనలను మనతో పంచుకోవటమే ఇందులో జరిగింది. రచయిత్రి తనకు తను దూరంగా నిలబడి తన జీవితాన్ని చూసే, చూపే  ప్రయత్నం బావుంది. ఆ ప్రయత్నంలో మనల్ని తనకూడా నడిపించటం, అలోచన రేకెత్తించటం బావుంది.

పుస్తకం గట్టిగా వందపేజీలు కూడా లేదు. కానీ చాలా ప్రశ్నల్ని రేపుతుంది!

మీరూ చదివి చూడండి! 

Saturday, April 22, 2017

ఫెయిల్యూర్ ఆఫ్ కైండ్నెస్.



ఫెయిల్యూర్ ఆఫ్ కైండ్నెస్.  అది చూపించవలసినచోట మనం చూపించలేకపోవడం. 


జార్జ్ సాండర్స్ (George Saunders) అనే రచయిత సిరక్యూస్ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ సెరిమనీలో  భాగంగా విద్యార్ధులని ఉద్దేశించి చేసిన ‌ప్రసంగం‌లో వాడిన మాట అది. 


"What I regret most in my life are failures of kindness.
Those moments when another human being was there, in front of me, suffering, and I responded . . . sensibly. Reservedly. Mildly." - George Saunders


ఆయన వాడిన 'Failure of kindness' అన్న మాట రెండు రోజుల్నుంచీ నన్ను వెంటాడుతూ ఉంది. ప్రతి క్షణం నన్ను నేను ప్రశ్నించుకునేలా, నన్ను నేను గమనించుకునేలా చేస్తూనే ఉంది. అది చాలనట్టు, ఆ ప్రసంగంలో ఆయన ఉదహరించిన ఓ చిన్న సంఘటనలోని పాత్రని మన జీవితంలో మనం ఎన్నిసార్లు - అనుకోకుండా అయినాసరే - పోషించివుంటామో అన్నది మరింత కలవరం కలగజేస్తుంది. 


"బీ కైండ్" అన్న మాట కొత్తగా వింటున్నదీ కాదు, తెలుసుకున్నదీ కాదు. కానీ ఈ రచయిత మాటలు మనసుని సున్నితంగా తట్టి లేపినట్టూ, చెమరింప చేసినట్టూ అనిపించింది. మనం చేయడం మరిచిపోయిన పనిని మనకి సున్నితంగా గుర్తుచేస్తున్నట్టు అనిపిస్తుంది. 


చాలా చిన్న ప్రసంగం ఇది. మీకూ నచ్చుతుంది! 



https://6thfloor.blogs.nytimes.com/2013/07/31/george-saunderss-advice-to-graduates/?_r=0



Monday, April 10, 2017

నాకు నచ్చిన పుస్తకం - “DEAR IJEAWELE, OR A FEMINIST MANIFESTO IN FIFTEEN SUGGESTIONS” By Chimamanda Ngozi Adichie.






“DEAR IJEAWELE, OR A FEMINIST MANIFESTO IN FIFTEEN SUGGESTIONS” 
By Chimamanda Ngozi Adichie. 
అడిచీ రాసిన తాజా పుస్తకం, మరో మంచిపుస్తకం! ఇంత మంచి పుస్తకం అందరూ చదివితే బావుంటుంది అనిపించింది. 

ఒక స్నేహితురాలు రచయిత్రిని, "మా అమ్మాయిని ఒక ఫెమినిస్ట్ గా ఎలా పెంచాలి?" అని అడిగిన ప్రశ్నకు ఉత్తరం రూపంలో  సమాధానమే ఈ పుస్తకం. ముందు మాటలో రచయిత్రి  అంటారు : "In response to my friend's request, I decided to write her a letter, which I hoped would be honest and practical, while also serving as a map of sorts for my own feminist thinking." 
ఇందులో నాకు నచ్చింది ఆ ప్రాక్టికల్ ఆలోచనే! 
పదిహేను సూచనలు, అరవై పేజీలు మాత్రమే ఉన్న చిన్న పుస్తకం ఇది.  ప్రింట్ పెద్దది - చదవటానికి చాలా సులువుగా ఉంది. చదువుతుంటే అడుగడుక్కీ ఆగి ఆలోచించాల్సి వస్తుంది - మనం ఎలా ఆలోచిస్తున్నాం, పిల్లలకి - ముఖ్యంగా ఆడపిల్లలకి - ఏమి నేర్పిస్తున్నాం, వాళ్ళ వ్యక్తిత్వాన్నికి ఎంత మెరుగు పెడుతున్నాం అన్న ప్రశ్నలు మనల్ని కొంత అసౌకర్యానికి గురి చేస్తాయి. మనల్ని మనం మభ్యపరుచుకోలేం కాబట్టి, ఆ అసౌకర్యం! 
ఓ ముప్ఫై నలభై ఏళ్లొచ్చాక, స్వతంత్రానుభవాల్లోంచి వ్యక్తిత్వాన్నీ, అస్తిత్వాన్నీ వెదుక్కునే శ్రమ లేకుండా, ఆడపిల్లలకి చిన్ననాటినుంచే ఆ విషయాలపట్ల సదవగాహన కల్పించడం అనేది నూతనతరం దంపతులు చేయాల్సిన పని అని కూడా అనిపించింది ఈ పుస్తకం చదివాక. 
చాలా సరళమైన భాషలో ఒక స్త్రీ జీవితానికి పనికివచ్చే ఇన్ని విషయాలను ఇంత చిన్నపుస్తకంతో చర్చలోకి తీసుకు వచ్చిన రచయిత్రి భావదారుఢ్యానికి, భాషపై ఉన్న పట్టుకీ ఆశ్చర్యం కలిగితీరాల్సిందే!
ఇది ఒక్కసారి కాదు, మళ్లీ మళ్లీ చదవాల్సిన పుస్తకం. అందరిచేతా చదివించాల్సిన పుస్తకం కూడా.