సినిమాలైనా, పుస్తకాలైనా- ఓ ధోరణిలో పడితే అదే తరహా సినిమాలో పుస్తకాలో చూస్తూ చదువుతూ ఉండటం బహుశా నాలాగే చాలామందికీ అలవాటేనేమో!
ఏప్రిల్ నెలలో చదివిన ఐదు పుస్తకాలలో మొదటి మూడూ ఆటోబయోగ్రఫీలే! The Awakened Woman (Dr. Tererai Trent), Can’t Hurt Me (David Goggins), When Breath Becomes Air (Paul Kalanithi) - ఈ మూడు స్వీయచరిత్రలూ మూడు భిన్న ప్రపంచాలు. ముందు చదివింది టెరెరాయ్ ట్రెంట్ పుస్తకం. కాబట్టి ముందు ఆ పుస్తకాన్ని పరిచయం చేస్తాను.
అసలు ఈ పుస్తకం చదవటం చాలా తమాషాగా జరిగింది. ఆవిడది ఒక ఇంటర్వ్యూ చూసి కుతూహలం కొద్దీ పుస్తకం చదివాను. నన్ను ఆ ఇంటర్వ్యూ లిటరల్‌గా హాంట్ చేసింది. కొన్ని రోజులు ఆవిడ మాటలు నన్ను అంటిపెట్టుకుని వదలలేదు. ఆవిడ మాటలో ఒక నిజాయితీ - ఆథెంటిసిటీ - నన్ను కట్టిపడేసాయి. ఉత్సాహం ఉన్న వాళ్ళు యూట్యూబ్ లో ఆవిడ ఇంటర్వ్యూని చూడవచ్చు.
టెరెరాయ్ ట్రెంట్ జింబాబ్వే వనిత. ఆవిడ మాటల్లో చెప్పాలంటే తను ఒక పితృస్వామ్య సమాజంలో, తరతరాలుగా వంశానుగతంగా వస్తున్న స్త్రీల వారసత్వాన్ని మోసుకుంటూ పుట్టింది. ఏమిటా వారసత్వం అంటే నిరక్షరాస్యత, పేదరికం, బహుభార్యత్వం. 18 ఏళ్ళకే నలుగురు పిల్లల తల్లి అయిన టెరెరాయ్ (అందులో ఒక బిడ్డ చనిపోతుంది) 'నేను ఇలాంటి జీవితాన్ని కోరుకోలేదు. ఇది నేను సృష్టించుకున్న నా ప్రపంచం కాదు. నేను ఒక మూసలోకి నెట్టబడ్డాను. నాకు చదువుకోవాలనే తాపత్రయం చాలా ఉన్నా, చిన్న వయసులోనే పెళ్ళి, పిల్లలూ పేదరికం వీటిలో కూరుకుపోయాను' అని అంటారు. అలాంటి టెరెరాయ్ జీవితంలోకి ఒక అమెరికన్ యువతి రావటం, టెరెరాయ్‌ని నీ కలలు ఏమిటి అని అడగటం జరుగుతుంది. నేను కలలు కూడా కనవచ్చా? అని తనలో అనుకున్నా, తన మనసులో ఉన్న మాట బయటకు చెప్పేస్తుంది టెరెరాయ్. తనకు నాలుగు కోరికలు: ఒకటి అమెరికా వెళ్లటం; రెండు: గ్రాడ్యుయేట్ కావటం; మూడు: పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యటం; నాలుగు: పీహెడీ చెయ్యటం. 'నువ్వు అనుకుంటే చెయ్యగలవు' అన్న ఆ అమెరికా అమ్మాయి మాటలు తొలి ప్రోత్సాహం అయితే. టెరెరాయ్ తన ఆశలను తల్లితో చెప్పినప్పుడు ఆవిడ 'టెరెరాయ్, నువ్వు చదువుకుంటే నీకడుపున పుట్టిన పిల్లలే కాదు, భావితరాల్లో ఎంతో మంది జివితాలు బాగుపడతాయ్' (“If you believe in this dream of education and you achieve it, you are not only defining your future, but that of every life coming out of your womb, as well as those of generations to come.”)అని చెప్పిన మాటలు టెరెరాయ్ కి ఎంతో మానసిక ధైర్యాన్నీ, స్థైర్యాన్నీ ఇస్తాయి. ఆవిడ తల్లి ఇంకో మాట కూడా చెప్తారు: 'టెరెరాయ్, నీకలలు నీకొసం. వీటిని సమాజపు బాగుకు ఉపయోగించు. నీ కలలకు ఒక సార్ధకత ఏర్పడుతుంది.' (Your dreams will have greater meaning when they are tied to the betterment of your community.)చేయాల్సిందేమిటో కూడా తల్లే సలహా ఇస్తుంది: “You are following a path that has existed for generations, Tererai…it comes from a blindness shaped by ignorance, ignorance that grows out of poverty, war and lack of education….we say to ourselves,'This is our culture and our tradition. It is just the way things are.' But this is not true. It will not always be this way. Someone needs to break the cycle.” టెరెరాయ్ తనే ఆ బంధనాలను ఛేదించాలని నిర్ణయించుకుంటుంది.
అప్పుడు తన కలలకు అయిదో కలను చేరుస్తుంది టెరెరాయ్- తను తిరిగివచ్చి జింబాబ్వేలో ఉన్న పిల్లలకూ, స్త్రీలకూ ఉపయోగపడే పని ఏదైనా చేయాలి.
ఇక ఇక్కడినుంచి అత్యంత పేదరికంలో, రాచి రంపాన పెట్టే భర్తతో, పిల్లలతో - అసలు చదువే లేని టెరెరాయ్ అమెరికా వెళ్ళేందుకు కావలసిన బేసిక్ పరీక్షలు ఎలా రాసింది, అమెరికా ఎలా వెళ్ళింది, చివరికి పీహెచ్‌డీ చేసి డాక్టర్ టెరెరాయ్ ట్రెంట్ గా ఎలా మారింది, జింబాబ్వేలో పేద పిల్లల చదువుకోసం ఏ కార్యక్రమాలు చేపట్టింది - ఇంకా ఎన్నెన్ని మెట్లెక్కిందీ అన్నది ఈ పుస్తకం చెప్పే సంగతులు! ఇది ఒక గైడ్ కూడా. కాకపోతే కొన్ని పద్ధతులు మనకు అర్థం కాకపోవచ్చు, విచిత్రంగా అనిపించవచ్చు. కానీ టెరెరాయ్ ట్రెంట్ జీవితమే ఒక ఉత్తేజమై మనల్ని కొన్ని రోజులు ఆవరిస్తుంది అన్నది మాత్రం నిజం.
ఈ పుస్తకంలో స్త్రీలు ఎంత సాధించగలరో కనిపిస్తుంది, స్త్రీలు ఒకరికొకరు ఎలా అండగా నిలబడవచ్చు అన్నది తెలుస్తుంది, తమ గమ్యాలను తాము ఎలా నిర్ణయించుకోవాలో, ఎలా తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలో కనిపిస్తుంది. గెలుపుకి కావలసిన పట్టుదలా, ఓరిమి, సింప్లిసిటీ, కాన్ఫిడెన్స్ ఇంకా ఎన్నో కనిపిస్తాయి. ఒక ఫెమినిస్ట్ కనిపిస్తుంది. ఒక భాస్వరం లాంటి మహిళ కనిపిస్తుంది. ఒక సుతిమెత్తని గర్జన వినిపిస్తుంది. చదివి చూడండి. మనకూ ఆ భాస్వరపు వెలుగు కొంత తగలకుండా ఉండదు. మనల్నీ మన మనసుల్నీ వెలిగించకుండా ఉండదు.
మిగితా రెండు పుస్తకాల గురించి తరువాతి పోస్టుల్లో రాస్తాను.
simple yet powerful review.
ReplyDeleteThank you very much. She is a very inspiring and a very powerful person indeed!
DeleteThis comment has been removed by the author.
ReplyDelete