Saturday, March 30, 2013

Life Is Beautiful !!!





నాకూ ఓ కల ...ఓ అందమైన కల...నేను సన్నగా, జాజి తీగలాగా , ఓ ఇరవై ఏళ్ళ  అమ్మాయిలా  కాకపోయినా ... "నువ్వునాకు నచ్చావ్సినిమాలో వెంకటేష్ డైలాగ్ గుర్తుకొస్తోందా? హన్నా ఎంత మాటన్నారు? ఇంత స్వయం ప్రకాశంగా, క్రియేటివ్ గా నా మస్తిష్కంలోంచి  ఆలోచనలు పుట్టుకొస్తుంటే , కాపీ అనేస్తారా? బట్ నాకు కూడా  ఆ డైలాగే గుర్తుకు వచ్చింది స్మి ! హాశ్చర్యం !!! అయినా ఈ సినిమా గొప్పతనమే అది. జనజీవన స్రవంతిలో ( బావుందే ఈ పదప్రయోగమిక్కడ :)) ఈ సినిమా ఎంతగా ఇమిడిపోయిందంటే, సుత్తి (నేను వేస్తున్నది కాదు , జంధ్యాల గారి సినిమాలో సుత్తి కాన్సెప్ట్ గురించి చెప్తుంటా) ఎలా మన భాషలో ఇమిడి పోయిందో అలాగన్నమాట. అలా చాలా సినిమా పదాలు మన భాషలో కలిసిపోయాయి అనుకోండి.( కేక, సూపరు ,వగైరా...కాని ఇవి నాకు అంతగా ఖాస్ గా , తెలుగుతనం ఉన్నట్టుగా అనిపించవు .)  ఇంతకీ "నువ్వునాకు నచ్చావ్" సినిమాలో డైలాగులు కానీ, జంధ్యాల గారి కొత్త పదాల సృష్టిలో గాని ఒక తెలుగుతనం, ఒక హుందాతనం, ఒక నిండుతనం ఉంటాయి ....( వీరతాళ్ళు వేసేయొచ్చు ) సరే సరే ....ఎక్కడికో వెళ్ళిపోతున్నా. దీన్నే" స్ట్రీమ్ అఫ్ కాన్షియస్నెస్ " అంటారన్నమాట.

ఇంతకీ నాకూ ఒక కల ఉందన్నమాట. చక్కగా, పొట్ట లేకుండా ఉండాలని. ఎప్పుడొచ్చి చేరిందో గానీ,   పొట్ట చాపకింద నీరులాగ  తెలీకుండా వచ్చేసింది. సరే ఎలా వచ్చింది అన్న ఆలోచన పక్కనపెట్టి , ఎలా దీన్ని వదిలించుకోవాలా అన్న తపన మొదలైంది. ఇక అక్కడినించి అన్నీ కష్టాలే. ఊరుకోకుండా  మా అమ్మాయికీమా వారికీ నా మానసిక క్షోభ గురించి చెప్పాను. చెప్పటం ఏమిటీవెంటనే వాళ్ళిద్దరి దృష్టీ  నేను తినే తిండి మీద, నేను వేసుకునే  నెయ్యి మీద పడింది. నా నేతి చాపల్యం గురించి మాములుగానే ఆట పట్టిస్తుంటారు. వాళ్ళ ఆటపట్టించటం , జోకులు పక్కన పెడితే, నాకు మహా గడ్డుకాలం దాపురించింది. అసలు నెయ్యి లేకుండా భోంచేస్తారుటండి? విడ్డూరం కాకపోతేనూ? వీళ్ళి ద్దరికీ నెయ్యి అవసరం లేదు. నేను నేతి గత నాతిని !( వహ్వా ఏం పడిపోతున్నై పదాలు. నేతి  గత ప్రాణిని అని రాసా ముందు.) అసలు ముద్దపప్పులో చక్కగా నెయ్యి వేసుకుని, ఆవకాయతో తింటే ఎంత బావుంటుంది? అలాగే ఇడ్లి పొడిలో ఓ చెంచాడు నెయ్యి తగిలించి తింటే ఆ మజాయే వేరు. మళ్ళి నేను తిండిపోతుని అనుకునేరు. అదేం లేదు. కొంచం నెయ్యి , మీగడ, వేపుడుకూరలు ఇష్టపడతాను. అవే నా కొంపముంచాయి.

 సరే పొట్ట తగ్గాలంటే ఎక్సర్సైజులు చెయ్యాలికదా , యాభై ఏళ్ళకి , నా అంతట నేను ఏదో మొదలుపెట్టి, కీళ్ళు పట్టుకుపోతే కష్టం కదా. అంచేత ఓ డాక్టర్ దగ్గరకు సలహాకి వెళ్ళాను. పనిలోపని ఓసారి కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించేసుకున్నా. ఏతావాతా తేలిందేమిటంటే నాకు బాగా పొగరని. అంటే కొవ్వు, దట్ ఇజ్ కొలెస్టరాల్ ఎక్కువగా ఉందని. సరే నేనే నా ఇష్టమైనవి వదిలేయాల్సిన పరిస్థితి. డాక్టర్ చక్కగా,  తేలిగ్గా  చెప్పేసారు : నో  ఫ్రైడ్ ఫుడ్ , నో ఘీ , BP కూడ తొంగిచూస్తోందిట వెళ్ళనా వద్దా అని, సో,నో స్పైస్ ,లెస్ సాల్ట్ ....అసలిక తినటం ఎందుకు? ఉప్పు తక్కువ, కారం తక్కువ, నెయ్యి అసలు తినకూడదట , నూనె తక్కువ, వేపుడు కూరలు అసలు వద్దు ( బంగాళాదుంప వేపుడుకూడా కట్ .."వేదం" సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ గుర్తుకొస్తోంది.)

సరే ఓ గట్టి నిర్ణయం తీసుకున్నా.

ఓ నాలుగు నెలల పాటు "జిం" కి వెళ్లి,  ట్రెడ్ మిల్లులు వగైరాల సహాయంతో, కొంచం కష్టపడి, పొట్ట మరియు వెయిట్ తగ్గించుకుందామని. ఆ ప్రాసెస్ లో నా ఇష్టాలను కాసేపు పక్కన పెడదామని.

సో ప్రస్తుతం డైట్ లో మార్పుల్ని మనసారా ఆహ్వానించటానికి ప్రయత్నిస్తున్నాను. అఫ్ కోర్స్ , తిండి గురించి మరీ అంత పిచ్చి లేదు కాబట్టి, తొందరగానే అడ్జస్ట్ ఐపోయాను. ఐ డూ మిస్ నెయ్యి ..వేపుడు కూరలు...అవి లిబరల్ గా చేసుకుంటాం మన ఇళ్ళల్లో కాబాట్టి..బట్, ఫర్ ఎ బెటర్ ,సన్నజాజి తీగలాంటి నాకోసం..ఆ మాత్రం త్యాగం చెయ్యక పోతే ఎలా???  Anyways  "జిమ్మింగ్ " బాగా ఎంజాయ్ చేస్తున్నా. నా రొటీన్లో అదేమంత చిన్న విషయం కాదు. పొద్దున్న 6 to 7 జిమ్ కి వెళ్ళాలంటే , కొంచం కష్టమే. 7 గంటలకి అరగంటసేపు మంచినీళ్ళు  వస్తాయి. ఏడున్నర  నుంచి తొమ్మిది గంటల వరకు కరెంటు కోత!  సో వంట ప్లానింగ్ చాలా తెలివిగా చెసుకొవాలి. గ్రైండర్ వాడకం దగ్గర్నుంచి ఆలొచించుకోవాలి,  9.45 కి ఆ ఫీసుకి బయల్దేరాలి. బట్ అనుకున్నాక వెనకడుగు వెయ్యటం ఏమిటి అని జిమ్ లో జాయిన్ అయిపొయాను. (ఆఫ్ కోర్స్ మా వారూ, మా అమ్మాయి  నాకు ఫుల్ సపోర్ట్ అనుకోండి !!)

 ఇంతకీ సన్నజాజి తీగ అంటే మీకు అర్ధమైందా?? నా ఉద్దేశంలో సన్నజాజి తీగ = ఫ్లాట్ టమ్మీ అన్నమాట. లేకపోతే ఇప్పుడు నేను సన్నజాజితీగలాగ ఉండటం ఎందుకు?. నందివర్ధనం పువ్వులా నిండుగా ఉంటే  చాలు.
కాకపొతే కాస్త పొట్ట, వెయిట్ తగ్గితే ఆరోగ్యానికి మంచిదని తాపత్రయం. ఇందులో ఇంకో అద్భుతమైన విషయం ఏమిటంటే Gym కి నేను  మా అమ్మాయి కలిసి వెళ్ళటం.. ఇట్స్ సో వెరీ  ప్రెషియస్ .... తనతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ,  విషయాలు షేర్ చేసుకుంటూ .... పొద్దుటి సమయం గడపటం......దట్ టూ వన్ అవర్ టోటల్లి అండ్ కంప్లిట్లీ !! ఎంత ఆనందంగా ఉంటుందో అ సమయం, అంత తొందరగానూ  అయిపోయినట్టు ఉంటుంది !!
ప్రతి చిన్న విషయంలోనూ ఎంత ఆనందం దాగివుంటుందో కదా? మనం గమనించాలే గానీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ !!
నా ఈ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటూ ఇక్కడితో ముగిస్తున్నాను. 
  
నాలుగు నెలల తరవాత పరిస్థితి అప్పుడు చూద్దాం !!


Monday, March 25, 2013

నాకు నచ్చిన సినిమా...

ముందుగా సినిమా క్రెడిట్స్ .

సినిమా పేరు  : Turtles Can  Fly
డైరెక్టర్: Bahman Ghobadi
Iranian Film -2004.

సినిమా చూసాక బావుందా - బాలేదా, అన్న మీమాంస  పక్కనపెడితే కాసేపు ఏమి చెప్పలేని పరిస్ధితి -  .నిర్వచనాలకు అందని అనుభూతి.
నాకు చాలా  నచ్చింది ఈ  సినిమా . మనల్ని తొందరగా వదిలి పెట్టదు. ఆ దృశ్యాలు, ఆ పిల్లలు, ఆ జీవితం అన్నీ మనల్ని కదిలిస్తాయి.
(మనవాళ్ళు ఇలాంటి సినిమాలు ఎన్నడైనా తీస్తారా , అసలు డిఫరెంట్  సబ్జెక్టుతో సినిమాలు ఎందుకు తియ్యరు, అనే బాధ కూడా  మనసుల్ని తొలుస్తుంది !! )

సినిమా చూసిన వెంటనే మనం ఎంత చిన్న ప్రపంచంలో  బతుకుతున్నాం? ఎంత చిన్న జీవన చట్రంలొ మనల్ని మనం బంధించుకుంటున్నాం ? అన్న ప్రశ్న మన మనసును వెంటాడుతూనే ఉంటుంది. అసలు ఇన్ని రకాల పరిస్థితులు , ఇన్ని రకాల సంఘర్షణలు ...మన ఊహకు
అందని జీవితాలు. హృదయాన్ని ఒక అంతర్లీనమైన బాధ ఆవరిస్తుంది. ఒక నిస్సత్తువ - ఇంత చిన్న ప్రపంచంలో , అతి చిన్న పరిధిలో
పరిభ్రమిస్తూ, అదే ultimate అనుకుంటూ ఎలా గడిపేస్తున్నాం,  అన్న ప్రశ్న  మనల్ని ఆలోచింప చేస్తుంది.

యుద్ధ వాతావరణం లో పెరుగుతున్న పిల్లల గురించిన జీవితాన్ని డైరెక్టర్ Bahman  Ghobadi  చక్కగా ఆవిష్కరించారు.
ఒక పది పదిహేనేళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయి , తన అన్న ,మరో చిన్న పిల్లాడితో మనకు కనిపిస్తుంది.
సైనికుల తాకిడిలో తమ తల్లి తండ్రుల్ని బంధువుల్ని కోల్పోవటం ఒక ఎత్తైతే ,
వాళ్ళ పాశవికతకు బలై , నిండా పదిహేనేళ్ళు రాకుండానే ఒక తల్లై, ఆ కొడుకుని సాకుతూ కనిపిస్తుంది.
ఇక ఎవ్వరూ  లేని  అనాధలుగా  ఈ పిల్లలు తమని తాము పోషించుకోటానికి మందుపాతర ని తవ్వి తీసి , వాటిని అమ్మి
డబ్బు సంపాదిస్తూ  ఉంటారు. యుద్ధ  ప్రణాళికలో భాగంగా ఈ  మందుపాతర ని ఉపయోగించిన నేపధ్యంలో విపరీతంగా
ఎక్కడపడితే అక్కడ ఇవి కనిపిస్తూ ఉంటాయి. అలా పేలకుండా భూమిలో ఉన్న మందుపాతరని జాగ్రత్తగా తీసి అమ్ముతున్న సమయంలో
ఒకటి పేలిపోయి ఆ అమ్మాయి వాళ్ళ అన్న రెండు చేతులూ  పోగొట్టుకుంటాడు.

వీళ్ళు  ముగ్గురు ఒక పక్క ...మిగితా పిల్లలు ఒక పక్క. వీరిలో చాలామంది అనాధాలే. అందరూ  వాళ్ళను వాళ్ళే పోషించుకోవాలి.
ఇందులో సగం మందికి  కాలో కాలో , చెయ్యో ఉండదు. అయినా వాళ్ళు ఉత్సాహంగా, పోటిపడి మందుపాతర పనికి దిగిపోతుంటారు.
అది అవసరం మాత్రమే కాదు , భయానికి అవతల బతకాల్సిన పరిస్థితి. చిన్న చిన్న పిల్లలు, హాయిగా ఆడుతూ , పాడుతూ చదువుకుంటూ,
అమ్మ నాన్నల సంరక్షణలో బతకాల్సిన పిల్లలు - ఒక  యుద్ధ వాతావరణంలో అనాధలుగా, బుల్లెట్ల చప్పుళ్ళ  మధ్య ,
Tankers మధ్య, ఉన్నట్టుండి పేలిపోయే మందుపాతర మధ్య , చూసుకునే పెద్ద వాళ్ళు  లేక, ఉన్న వాళ్ళు ఏదో ఒక అంగ వైకల్యంతో
బాధ పడుతూ పెరగటం ఎంత అమానుషం?

ఇందులో నటించిన పిల్లలు అందరూ శరణార్థులేనట. అందరూ చాలా సహజంగా నటించారు. అమ్మాయి నటన
చాలా బావుంది. నేపధ్యంలో వినిపించే సంగీతమూ బావుంది.

ఇలా క్షణ క్షణం బ్రతుకు భయాన్ని అధిగమిస్తూ, ఆకలిని ఆపుకుంటూ, బాల్యాన్నే కోల్పోయిన ఈ చిన్నారులు
ఎలాంటి మానసిక వైకల్యాలకు గురి ఔతారు? ఎలా వీళ్ళు రేపటి పౌరులై దేశాల్ని ఏలుతారు? వీళ్ళ జీవితాలు ఎలా
ఉంటాయి? అసలు వీళ్ళు  ఎందుకు ఇలా suffer అవాలి? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?
సభ్య సమాజంలో అసలీ యుద్ధాలు  ఎందుకు? రాజ్య కాంక్షకు, దేశాల మధ్య విద్వేషాలకు పిల్లలు ఎందుకు బలికావాలి?
రకరకాల ప్రశ్నలు ముసురుకునేలా చేసి, మనల్ని ఆలోచింపచేసేలా చేస్తుంది ఈ సినిమా.
అసలు మన మనసును ఎదిగేలా చేస్తుంది ఈ సినిమా. మన మైక్రో లెవెల్ చట్రం  నుంచి కొంచం
విశాలంగా మాక్రో లెవెల్ లో ఆలోచించటానికి ఉపయోగపడే చిత్రం. మన మానసిక పరిధుల్ని తొలగించి
అధిగమించి , బియాండ్ అస్ ఆలోచింప చేసే ఒక మంచి సినిమా. ఒక మంచి పుస్తకం మానసిక వికాసానికి
ఎలా దోహదపడుతుందో అలా ఒక మంచి సినిమా కూడా మనల్ని కదలిస్తుంది అన్నదానికి ఇదో మంచి ఉదాహరణ.

ప్రస్తుతానికి ఇంతటితో ముగిస్తున్నాను.