Friday, April 6, 2012

అనగనగా ఓ తెలుగు సినిమా ....అందులో ఓ హీరో...

అనగనగా ఓ తెలుగు సినిమా ....అందులో ఓ హీరో...


చదువు :
ఏమి ఉండదు..మహా అయితే ఏదో కాలేజీలో ఉంటాడు. ఏం చదువుతాడో మనకి తెలియదు.  కాలేజీ ఒక షూటింగ్ లొకేషన్ మాత్రమే. ముదురు మొహంతో రెండు పుస్తకాలూ చేతిలో నిర్లక్ష్యంగా పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. మరి హీరోయిన్ కాలేజీ చదువు వెలగబెడుతుంది కదా..అందుకన్నమాట.  హీరోకి ఇంకా  కొన్ని లక్షణాలు ఉంటాయి.
౧. షర్టు నీటుగా టక్ చేసుకోకూడదు.
౨. షర్టు మొదటి రెండు బొత్తాలు ( వీలైతే మూడు ) పెట్టుకోకూడదు. అంటే కొంచం రౌడి లుక్ ఉండాలన్నమాట.
౩. జుట్టు సరిగ్గా దువ్వుకోనక్కర్లేదు. చింపిరిగా ఉంటే మరి మంచిది.
౪. కొంచం మాసిపోయిన jeans ప్యాంటు, లేదా లూస్ గా నడ్డి మీదనుంచి ఈ  క్షణమో మరు క్షణమో జారిపోయేలా 
ఉండాలి. దానికి బోలెడన్ని జోబిలు ఉండొచ్చు ఉండకపోవచ్చు.
౬. షూస్ మాత్రం ఖరిదైనవే ఉండాలి. మంచి స్పోర్ట్స్ షూస్ అన్నమాట.
౩. హీరోకి ఒక తెలివేలేని బంటు ఒకడు ఉండాలి. హీరో ఎంత ఎద్దేవా చేసినా నవ్వుతూ భరించాలన్నమాట. అతనే మన హాస్య నటుడు . వీళ్ళందరూ కలిసి తిరగటం కాకుండా, బాధ్యతగా ఇంకేమి చెయ్యరు. వాళ్ళకున్న బాధ్యత ఒకటే. ఎవడన్నా విలన్ దొరుకుతాడా కధని ముందుకు నడపడానికి అని వెతకడం, హీరోయిన్ తో చిలిపి ( మండుతుంది చూసేవాళ్ళకి ఆ వెర్రి చేష్టలు , కుళ్ళు జోకులు, మొరటు డైలాగులు వింటుంటే, చూస్తుంటే..) అల్లర్లు..అక్కడితో నాలుగు ఫీట్లు (ఫైట్లు ...ఒక చేత్తో ఎద్దులా ఉన్న ఓ రౌడిని చితక్కోడుతూ ఇంకో చేత్తో వెనకనించి భయంకరమైన స్పీడ్ తో వస్తున్న  బొలెరో లాంటి పెద్ద బండిని ,కొండొకచో లారీని  ఆపేస్తారు ఈ హీరోలు.) ఈలోపు రెండు రొమాంటిక్ సాంగ్స్ ఐపోతాయి.  ఆవకాశం కుదుర్చుకుని వంశవృక్షం పాటలు ఓ రెండు (కనీసం ఒకటి) ఉంటాయి. ఇది నేను కొత్తగా పెట్టిన పేరు. మాస్ పాటలు, మెలోడి పాటలు, లాలి పాటలు ( ఒకప్పుడు ఉండేవిగా ! పాటల పోటిలలో అప్పుడప్పుడు - ఇప్పుడు వినపడుతూ ఉంటాయి..),ఏడుపు పాటలు, వీణ పాటలు, కామెడీ పాటలు ( "ఆయయో చేతిలో డబ్బులు పోయెనే" లాంటివి )..ఇవన్ని తెలిసినవే..(నాకిక్కడ మాయాబజార్లో డైలాగు గుర్తొస్తోంది.."ఇవన్ని భక్ష్యాలు..అవన్నీ భోజ్యాలు..ఆంధ్రుల అసలు సిసలు వంటకం ...).  ఇప్పుడు  వస్తున్నా కొత్త తరహా పాటలే వంశ వృక్షం పాటలన్నమాట...(వీటిగురించి మరెప్పుడైనా...)

ఇక హీరో ఇల్లు :
అందమైన ప్రేమతో నిండిన పొదరిల్లు. ఒక చాదస్తపు ( హీరో, ఇంకా హీరో తల్లి దృష్టిలోఎందుకు పనికిరాని వేస్ట్ కాండిడేట్ అన్నమాట ) తండ్రి. ఆయన మాములు వ్యక్తీ,  ఓన్లీ సెన్సిబుల్  వ్యక్తీ. ఎవ్వరూ అయన మాట వినరు.   హీరోని పొద్దున్నే నిద్రలేవమని, సరిగ్గా తల దువ్వుకోమని,చక్కగా చదువుకోమని చెప్పి ఆ  ప్రాసెస్ లో ఓ జోకరులా తయారయ్యి, ఎవ్వరూ మర్యాద ఇవ్వని ఒక వాయిస్ లేని తండ్రిగా సాగుతుంటుంది అతని సినీ ప్రయాణం.
హీరో తల్లి మాత్రం చాలా ఆధునిక భావాలూ గల మనిషి. ఆవిడ ఆలోచనలు, భర్తని కొడుకుతో పాటు చేరి ఎగతాళి చెయ్యటం, కొడుకు పనికిరాని వెధవ ఐపొతున్నా "ఉందిలే మంచి కాలం ముందు ముందునా" అని భరోసాగా సపోర్ట్ చెయ్యటం, సామాన్యంగా సగటు మానవ ప్రపంచంలో ఎక్కడా మనకు కనపడదు.అందుకని ఆవిడ వ్యవహారశైలి మనకు మింగుడుపడదు. ఏ  ఇంట్లోనూ  ఇలాంటి భార్య భర్తల్ని చూడం....కొడుకు విలన్లతో గొడవ పడాలా వద్దా అని ఆలోచిస్తుంటే ఈవిడ  పుడింగిలా హుంకరించి "విజయమో వీరస్వర్గమో "అంటుంది.  అక్కడికి ఇదో యుద్ధం, హీరో ఓ సైనికుడు, ఆవిడో వీరమాత , విలన్లు శత్రు సైనికులు,  చూసేవాళ్ళు బుర్రలేని, వెర్రి వెధవలు. ( వెర్రి వెధవల కన్నా హీనం...అన్నాతప్పు లేదంటారా..)
 ఇవన్ని చూస్తూ కూడా ఏమి చెయ్యలేని నిస్సహాయతలో తండ్రి.. తరవాత తరవాత ఆ తండ్రి కుడా పరిస్థుతల ప్రభావానికి గురై , కొడుకు చేస్తున్న పనిలో ఎంత విషయం ఉందొ అర్ధం చేసుకుని ఓ కత్తో లేక ఓ గన్నో గిఫ్ట్ ఇస్తాడు కొడుకుకి. .." వెళ్ళరా వెళ్ళు .... ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని నేనిచ్చిన గన్నుతో కడిగేసి ఓ నందనవనాన్ని సృష్టించు నాన్నా...ఫో.." అనేసి అమ్మయ్య చూసావా అని భార్యనో చూపు చుస్తాడన్నమాట.
అయన అమాంతం  భార్య మరియు కొడుకు దృష్టిలో ఓ నవ మానవతావాది అయ్యి తన తండ్రి పదవికి సార్ధకతను కలిగించి తరిస్తాడు.

ఇక హిరోయిన్..
మీకూ కొంచం విరామం కావాలికదా??? (అదేదో సినిమాలో, హీరొయిన్ స్టైల్ లో అనుకోవలెను...)
ఈ విషయానికి మళ్లీ వస్తాను ...అందాకా
విరామం...





2 comments: