Monday, January 27, 2020

నాకు నచ్చిన పుస్తకం



The Days of Abandonment
Elena Ferrante
Translated from the Italian by Ann Goldstein



ఎలీనా ఫెరాంటే.

ఇటలీలో ప్రముఖమైన, ఎవరికీ తెలియని రచయిత్రి అంటారు జేమ్స్‌వుడ్ ఆవిడని పరిచయం చేస్తూ. ఎలీనా ఫెరాంటే ఆవిడ కలం పేరు. ఆవిడ ఎవరో, ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. తన మొదటి పుస్తకం ప్రచురించినప్పుడే ఎట్టి పరిస్థితుల్లోనూ పుస్తకం ప్రమోట్ చేయటానికి కానీ, ఇంటర్వ్యూలూ టాక్‌షోలకు కానీ, అవార్డులు ఏమన్నా వస్తే  స్వీకరించటానికి కానీ తను ఎక్కడికీ రానని ప్రచురణ కర్తలతో ఒప్పందం చేసుకున్నారట ఆవిడ. ప్రెస్ చాలా శోధించినా ఆవిడ ఎవరూ అన్నది ఖచ్చితంగా తెలుసుకోలేకపోయారని అంటారు.

డేస్ ఆఫ్ అబాన్‌డన్‌మెంట్ ఆవిడ రాసిన నవలలలో పేరుపొందిన నవల. ఇది ఒక స్త్రీ కథ. ఓల్గా అనే పాత్ర కథ. భర్తవదిలెయ్యటం, ఓల్గా పడే క్షోభ, అందులోంచి తేరుకుని మళ్ళీ మామూలుగా జీవించటానికి ఆమె చేసే ప్రయత్నం – ఇదీ కథ స్థూలంగా. రచన చిక్కగా, నిజాయితీగా, తీక్షణంగా, పదునుగా ఉంటుంది. మొదలుపెడితే చివరివరకూ ఆగకుండా చదివేయాల్సిందే!

ఓల్గాకి పెళ్లై పదిహేనేళ్లవుతుంది. ఇద్దరు పిల్లలు ఉంటారు. ఒక మధ్యాహ్నం భోజనం చేసి నేనిక నీతో ఉండలేను, వెళ్లిపోతున్నాను అని ఓల్గా భర్త వెళ్లిపోతాడు. అక్కడినుంచీ అతలాకుతలమయ్యే ఓల్గా మనఃస్థితే మిగతా కథంతా. నా సమయాన్ని మొత్తం అతనికిచ్చాను అతను ఎదగాలని. నా కలలనన్నింటినీ పక్కన పెట్టేసాను అతని ఆశలు తీరాలని. ఇల్లూ పిల్లలూ వంటా పద్దులూ లాంటి రసహీనమైన పనులన్నింటినీ నేను ఉత్సాహంగానే చేస్తూ, అతను తన ఆశాసౌధాల మెట్లు పట్టుదలగా ఎక్కుతుంటే చూసి ఆనందించాను. నేను అతని సెకనులలో క్షణాల్లో గంటల్లో కలిసిపోయాను. నేనంటూ వేరే లేకుండా పోయాను. నా జీవితంలో అతిముఖ్యమైన కాలాన్ని అతను నానుంచి తీసేసుకుని, ఇద్దరం పడిన కష్టం తాలూకు ఫలాలు వేరొకరికి అందించటానికి వెళ్లిపోయాడు. ఎవరి ఆనందంకోసం పదిహేనేళ్లు నా ఆనందాన్నీ కలల్నీ సమయాన్నీ శరీరాన్నీ ధారపోసానో, అతనికి ఇప్పటి నేను అక్కర్లేదు. ఇప్పటి నా శరీరం అక్కర్లేదు. ఇప్పటి మా సంసారంఅక్కర్లేదు. ఒకప్పటి నేనులా (నా శరీరంలా)  ఉండే అమ్మాయికోసం, ఇంటినీ పిల్లల్నీ బాధ్యతల్నీ నాకొదిలి వెళ్లిపోయాడు. ఎంత సులభం అతనికి! నేనూ అన్నింటినీ వదిలి వెళ్లగలనా?”

ఇప్పుడు ఓల్గాకి ఉద్యోగం లేదు. ఎదురుగా బాధ్యతలు, బిల్లులు. భయం, కసి, ఉక్రోషం, ఎలాగైనా భర్తని తిరిగి తన సొంతం చేసుకోవాలన్న తాపత్రయం….ఓల్గా స్వభావమే మారిపోతుంది. తనను తను పట్టించుకోదు. ఇంటిని పట్టించుకోదు. పిల్లలని పట్టించుకోదు. ఒంటరితనం  ఆమెను కమ్ముకుంటూ ఉంటుంది. తను మానసికంగా కుంగిపోతోందని ఆమెకు తెలుసు. తనలోని సంఘర్షణనీ, తనేమైనా తప్పు చేసిందా అన్న ప్రశ్ననీ, తన పరిస్థితినీ విశ్లేషించుకుని అర్థం చేసుకుని బయటపడే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఆమె- అదంత సులువు కాదని తెలిసినా. అదే సమయంలో నువ్వు కూడా మీ ఆయన లాగానే క్రూరురాలివి,’ అని పక్కింటి అతను అన్న మాటలు ఓల్గాను మరింత కుదిపేస్తాయి.

భర్తతో గడిపిన జీవితంలో తనను తను కోల్పోవటం అన్నది పక్కనపెడితే, తను అతనిలా మారిపోయిందా అన్న ప్రశ్న ఆమెను వేధిస్తుంది. తనలో జీర్ణించుకుపోయిన అతని అలవాట్లనుంచీ ఆలోచనలనుంచీ బయటపడి తను తనుగా మిగలటం తన ముఖ్యమైన పని అని నిర్ణయించుకుంటుంది. తనకు తనే బలం అని తెలుసుకుని తిరిగి జీవించటానికి ఉపక్రమిస్తుంది.

ఈ కథని ఓల్గా చెబుతుంది. పారిస్ రివ్యూఇంటర్వ్యూలో రచయిత్రి ఇలా అంటారు: “రచయిత అనేవాడికి తనకు తెలిసిన విషయం చెప్పాలన్న తాపత్రయం ఉండవచ్చు. కానీ ఆ చెప్పే విషయానికి సరిపోయే భాష, రాసే వాక్యాలలో విషయానికి సరిపోయే లయ (రిథమ్), ఆ కథకు కావల్సిన టోన్ ఉండాలి. అప్పుడే ఆ కథ జీవాన్ని పోసుకుంటుంది”. దీన్ని ఆవిడ సంపూర్ణంగా అమలుపరచడం నవల మొత్తం కనిపిస్తూ ఉంటుంది.

ఓల్గా ఒక ఉన్మాదస్థితికీ, నార్మల్సీకీ మధ్యలో ఊగిసలాడుతూ చేసే ప్రయాణం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. రచయిత్రి భాషపైన చూపించే పట్టు, అందులో కనిపించే శక్తి, పచ్చిదనం, తీవ్రత, అర్జెన్సీ ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఓల్గా పాత్ర ఎంతకు దిగజారినా క్షమించేసి జాలిపడగలిగినంత క్రెడిబిలిటీ ఉంది నేరేషన్‌‌కి. ఒక స్త్రీ తనని తాను ఎన్ని విధాలుగా కోల్పోతుంది, తిరిగి తన అస్తిత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం ఎంత కష్టం అన్న విషయం చాలాకాలం మనల్ని అంటిపెట్టుకుని ఉంటుంది.  చాప్టర్స్ కూడా మరీ పెద్దగా లేకుండా, ఒక దాంట్లోంచి ఇంకో చాప్టర్‌‌లోకి బలంగా లాక్కెళ్లిపోతాయి.

నవలలో అంతర్లీనంగా వినిపించే కథలూ సంఘటనలూ చాలా ఉన్నాయి. ఓల్గాని ముంచెత్తే జ్ఞాపకాలు, సంఘంలో భర్త విడిచిపెట్టిన స్త్రీని ఎలా చూస్తారూ, ఆ భార్య తనని తాను ఎలా చూసుకుంటుందీ, మదర్‌హుడ్ అన్న చట్రంలో ఇరికించబడిన స్త్రీ నోటివెంట నేను ఎంత క్లీన్ చేసుకున్నా ఆ తల్లితనం తాలూకు కంపు నా శరీరాన్ని వదిలిపెట్టడం లేదూఅన్న మాట ఎలా ధ్వనిస్తుందీ- ఇంకా ఇలాంటి ప్రశ్నలు ఎన్నో హాంట్ చేస్తాయి.

ప్రస్తుతం ఫెరాంటె ఫీవర్ నడుస్తోంది! ఆవిడ నవల ఇంకోటి వెంటనే చదవాలి అనిపించేలా ఈ నవల ఉంది!  

Friday, January 24, 2020

నాకు నచ్చిన పుస్తకం - ద ఛాయిస్


The Choice - A Memoirby Dr Edith Eva Eger


“I don’t want you to hear my story and say, ‘My own suffering is less significant.’ I want you to hear my story and say, ‘If she can do it, then so can I!’”– Dr Edith Eva Eger




తనను చంపేస్తాను. అందుకే లోడ్ చేసిన గన్‌కూడా తెచ్చుకున్నాను,” అంటూ గన్ తీసాడతను.
ఒక్క క్షణం ఉలిక్కి పడ్డాను. లోడెడ్ గన్..
చంపితే ఏమవుతుంది?” పట్టు జారిపోనివ్వకుండా అడిగాను
ఆమెను చంపెయ్యటమే కరెక్ట్. ఆమె చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవల్సిందే,” కోపంగా అన్నాడతను గన్ ఝళిపిస్తూ.

అతన్ని చూసినప్పుడే ప్రమాదం ఏదో పొంచి ఉన్నట్టు అనిపించింది నాకు. సిక్స్త్ సెన్స్ లాంటిది. ఎంతైనా హింసనీ విధ్వంసాన్నీ విద్వేషాన్నీ దగ్గరనుంచి చూసినదాన్ని కదా! ప్రమాదాన్ని పసికట్టటం నాలో ఆటోమేటిక్‌గా జరిగిపోతూ ఉంటుంది.
అతనిలోని సంఘర్షణ కుతకుతా ఉడుకుతున్న లావాలా నన్ను కూడా తాకుతోంది. అతన్ని నా ఆఫిసుకి ఎవరూ పంపలేదు. తనంతట తనే వచ్చాడు.  సహాయం కోసమే వచ్చాడు. కానీ మాట్లాడటానికి తయారుగా లేడు.అతికష్టం మీద అతనిచేత మాట్లాడించాను. నిజం బద్దలయింది.  

అతని భార్య వేరొకరితో రిలేషన్‌షిప్‌లో ఉంది.  
కానీ అతని సమస్యకు మూలం అదికాదని నాకు తెలుసు.
సమస్య అదికాదనీ, అంతకన్నా పెద్దదనీ, అది తన గతానికి చెందిందనీ అతనికి తెలీదు.

గతం చేసిన గాయాల్ని  ప్రస్తుత సమస్య మళ్లీ తెరపైకి తెచ్చి అతనిలో అంతకుముందే ఉన్న కసిని పెంచుతోంది. మళ్లీ మళ్ళీ జీవితంలో ఓడిపోతున్నాననే దుఃఖం. జేసన్ పూర్తిగా కోలుకోవటానికి చాలా కాలమే పట్టింది.

గతాన్ని తెలిసి కొన్నిసార్లు, తెలియకుండానే చాలాసార్లూ జేసన్‌లాగా అందరం మోసుకుంటూ తిరుగుతుంటాం. గతం తాలూకు విజయాల్నీ గెలుపుల్నీ మోస్తే ఫరవాలేదు. అప్పటి ట్రామాస్‌నీ, అవమానాల్నీ, అపజయాల్నీ కూడా మోసుకుంటూ తిరిగేలా చేస్తుంది మనిషి ప్రవృత్తి. అది మనం మోసే అతి పెద్ద భారం. ఓప్రా విన్‌ఫ్రే చేసిన ఒకానొక ఇంటర్వ్యూలో ఒకామె ఇలా అంటారు: బలమైన గతపు ఛాయలనుంచి మనం విడివడి, శాంతిని పొందాలి. లేకపోతే గతం మననుంచి అంతఃశక్తినీ, బలాన్నీ, సామర్థ్యాన్నీ, ప్రజ్ఞనీ, స్థైర్యాన్నీ, చేతనత్వాన్నీ, చివరికి మనల్నీ నిరంతరం స్రవిస్తూనే ఉంటుంది.
గతం చేసిన గాయాల్నించి విముక్తమవటమే ప్రతిఒక్కరూ చేయాల్సిన పని అనీ, తన ప్రయత్నం ఆ దిశగానే అనీ, తన ఆత్మకథ రాయటానికి ముఖ్య ఉద్దేశ్యం కూడా అదేననీ  అంటారు డాక్టర్ ఈడిట్ ఇవా ఈగర్.

డాక్టర్ ఈడిట్ ఇవా ఈగర్.

పిల్లలూ, మనవళ్ళూ, మునిమనవళ్ళతో సహా నాలుగుతరాలను చూసిన వ్యక్తి. తొంభై ఏళ్ళ వయసులో తన ఆత్మకథని 2017లో ప్రచురించిన ఈవిడ హొలోకాస్ట్ సర్వైవర్. సర్వైవర్ అనవద్దు నన్ను త్రైవర్ అనండి అంటారు ఈమె. క్లినికల్ సైకాలజిస్ట్‌గా (పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిసార్డర్ చికిత్సకు సంబంధించి ఈవిడ సేవలకు ప్రపంచం అంతటా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది) సేవలు అందిస్తూ, ప్రపంచమంతా పర్యటిస్తూ, ముఖ్యంగా యుద్ధం నుంచి తిరిగి వచ్చిన సైనికులకు వారి మానసిక ఆందోళనలనుంచి బయటపడేందుకు  చేయూతనిస్తూ, తనకు తనే ఉత్ప్రేరకమై ముందుకు వెళుతున్న వ్యక్తి. ఈవిడ రాసిన ఆత్మకథేద చాయిస్’.

హోలోకాస్ట్. ఔష్‌విట్జ్. తెలిసిన పేర్లే కదూ?

ఔష్‌విట్జ్‌. కాన్‌సెన్‌ట్రేషన్ కాంప్‌లన్నింటిలోనూ నాజీల మారణకాండకు పరాకాష్ఠగా నిలిచిన కాంప్ అని చెబుతారు. లక్షల మంది యూదులు ఇక్కడ మృత్యువాత పడ్డారన్నది అందరికీ తెలిసిన నిజం. డాక్టర్ ఈడిట్ తన పదిహేడేళ్ల వయసులో కుటుంబంతో సహా ఔష్‌విట్జ్‌కి తరలింపబడతారు. అక్కడ ఎలాంటి జీవితం గడిపారూ, సుమారు ఒకటిన్నర సంవత్సరాల తరవాత శవాల గుట్టలో ఒక శవంలాగా తానూ పడి ఉన్నప్పుడు (చిటికిన వేలు, కనుపాపల కదలిక మాత్రమే సాధ్యమైన శారీరక స్థితిలో) ఎలా తనను గుర్తించారూ, ఎలా తను రక్షింపబడ్డారూ అన్నది గగుర్పాటుకు గురిచేసే కథ అయితే, అక్కడినుంచీ ఇవాళ వృత్తిపరంగా ఒక సైకాలజిస్ట్‌గా, ప్రవృత్తిపరంగా - తనకు తనే ఒక చోదక శక్తిగా, తన చుట్టూ ఉన్నవారి జీవితాలలో స్ఫూర్తిని నింపగలిగిన స్థాయికి ఎలా చేరుకున్నారూ అన్నది - తెలుసుకోవలసిన ప్రయాణం.

నాజీల చెరలో అన్నిరకాల కష్టాల్ని చూసారు డాక్టర్ ఈడిట్. నాజీలు తల్లిని చూపించి “ఈవిడ నీకు సోదరా, తల్లా?” అని అడిగినప్పుడు తను అమాయకంగా ఆవిడ తన తల్లి అని చెప్పినందుకు, తల్లిని తమనుండి విడగొట్టి గేస్ చేంబర్‌కి పంపటం చూసారు. తినడానికి ఏమీ లేక ఆకలికి తట్టుకోలేక తను గడ్డిపరకలు పీక్కుతింటున్నప్పుడు, ఆకలికి తట్టుకోలేని మరికొందరు తనకు కొంచెం దూరంలో పడున్న శవాలను పీక్కుతినటమూ చూసారు. తమందర్నీ గుంపులు గుంపులుగా స్నానాల గదిలోకి తోసినప్పుడు పైనుంచి నీళ్లే వస్తాయో లేక అందరినీ మూకుమ్మడిగా చంపేసే విషవాయువులే వస్తాయో తెలీని క్షణ క్షణ మృత్యుకుహరాల్నీ చూసారు. డెత్ స్టైర్స్, డెత్‌మార్చ్‌లనూ చూసారు ఆవిడ. నాజీ సైనికులు తమని తరలిస్తున్నప్పుడు “మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు. ఏం జరుగుతుందో తెలీదు. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో. నీ మనసులో ుట్టే ఆలోచనలపైన పూర్తి అధికారాలు నీవే. వేరెవ్వరికీ  వాటిపైన అధికారం లేదు, పొందలేరు కూడా,” అని తల్లి చెప్పిన మాటలు తను నిరంతరం చెప్పుకునే దాన్ననీ, ఇవాళ గడిస్తే రేపు పూర్తి స్వేచ్ఛ వస్తుందన్న నమ్మకాన్ని ప్రతి క్షణం తనలో తనే నింపుకునేదాన్ననీ  అంటారామె.

ఆమె అమెరికా ప్రయాణం, పూర్తిగా స్వేచ్ఛ వచ్చినా గతంనుంచి విడివడలేనితనం ఇవన్నీ రెండో ప్రకరణం. ఇప్పటికీ ముళ్లకంచెల్ని చూసినా, బరువైన బూట్ల చప్పుడు విన్నా, గట్టిగా అరుపులూ కేకలూ విన్నా, కొన్ని వాసనలూ, కొన్ని కొన్ని దృశ్యాలూ.. ఏవి తనలో ట్రామాని తట్టిలేపుతాయో చెప్పలేనంటారు ఆవిడ. పిల్లలూ, సంసారపు ఒడిదుడుకులు, డబ్బు లేకపోవటం, మనసును సలిపే గతం, వీటన్నిటి మధ్య చదువుకు ఉపక్రమిస్తారు ఈదిటి. తనలాగా హోలోకాస్ట్ నుంచి బయటపడిన విక్టర్ ఫ్రాంకిల్ రచించిన మాన్స్ సర్చ్ ఫర్ మీనింగ్పుస్తకం ఆమెకు ఒక కనువిప్పు. గతాన్ని తను మనసులోకి రానీయకపోతే దానినుంచి తను బయటపడ్డట్టే అనుకోటం తప్పనీ, తన గతం దాచిపెట్టవలసినదో, అవమానపడాల్సిందో కాదని ఆమెకు అర్థం అవుతుంది. ఔష్‌విట్జ్‌లో అంతమంది చనిపోతే తను మాత్రం బతికివుండటం పట్ల అపరాధ భావన, తల్లి చావుకి తనే పరోక్షమైన కారణమని బాధపడే ఆమెకు తన చేతిలో లేని సంఘటనలపట్ల తనకు బాధ్యత ఏమీ లేదని అర్థం అవుతుంది.

నలభై నాలగవ ఏట గ్రాడ్యుయేషన్ చేసి తరవాత రీసెర్చ్‌ పూర్తి చేసి ఒక క్లినికల్ సైకాలజిస్ట్‌గా స్థిరపడ్డారు ఆవిడ. ఒక సైకాలజిస్ట్‌గా తన దగ్గరకు వచ్చే వ్యక్తులకు పరిష్కారాలు చూపిస్తున్న ప్రతిసారీ తనూ ఒక కొత్తపాఠం నేర్చుకున్నట్టే ఉంటుంది అంటారు ఆవిడ.

ఏ అమెరికన్ బెటాలియన్ అయితే 1945 లో కుప్పగా పడున్న మానవ దేహాల మధ్య ఒక శవంలా పడున్న తనను గమనించి బతికేఉందని నిర్ధారించుకుని రక్షించిందో - 65 ఏళ్ల తరవాత అదే బెటాలియన్ సైనికులకి ప్రేరణ కలగజేసేందుకు తను వెళ్లి ప్రసంగించటం అద్భుతం అంటారామె.

నాలుగు భాగాలుగా విభజింపబడింది ఈ పుస్తకం. ప్రతి విభాగమూ చిన్న చిన్న చాప్టర్స్‌గా విడగొట్టబడి, సరళమైన భాషలో చదవటానికి చాలా సులువుగా ఉంది. హోలోకాస్ట్ గురించి చాలా పుస్తకాలు వచ్చాయి. దానితో పాటూ హీలింగ్‌ని కూడా ప్రతిభావంతంగా కలపటం బావుంది.

వీలైతే పుస్తకం చదవండి!





Wednesday, January 1, 2020

నాకు నచ్చిన పాట ...ఓహో యాత్రికుడా...


“అంధకార దీర్ఘ నిశా బంధనమ్ము సడలించుక,
గంధవాహ తురంగమ స్యందనమ్ము గదలించుక,
సింధుపార పూర్వ దిశా సుందర తీరమ్ము జేరు నో యాత్రికుడా.... “

నాకు చాలా ఇష్టమైన పాటలో మరీ ఇష్టమైన లైన్స్ ఇవి. ఆ పదాల నడక రాజేశ్వర్రావు గారు పాడిన తీరు ఒకెత్తూ, ఈ లైన్ అర్థం కావట్లేదు తాతయ్యా అంటే ఆయన దాన్ని నాకు విపులీకరించి చెప్పిన తీరు మరో ఎత్తు. ఆయన చెప్పిన పద్దతి నేనెప్పటికీ మర్చిపోలేను. మంచం మీద కూర్చుని, చూపుని ఊహలో నిలిపి ఆయన ఈ వాక్యాలకు అర్థం చెప్పిన తీరూ, అప్పుడు నా కళ్ల ముందు నిలిచిన ఇమేజ్ ఇప్పటికీ ఠక్కున గుర్తొస్తాయి - అంత అందంగా చెప్పారు ఆయన. ఈ పాట విన్న ప్రతిసారీ లేదా నాలో నేను పాడుకున్న ప్రతిసారీ ఈ పంక్తుల దగ్గర నా కన్ను- తన రథాన్ని ముందుకు ఉరికిస్తూ, సింధువు ఆవలి తీరపు తూర్పు వేకువ వైపుకి నూతనోత్సాహంతో ఎగిరిపోతున్న, ఎదిగిపోతున్న ఒక అస్పష్టపు మనిషి రూపుని – ఒక ఉద్విగ్న క్షణాన్ని చూస్తుంది. నిజం.

అదెలాంటి వేకువ? బంగారు, పసుపు, లేత గులాబీ రంగుల్ని అకాశం ఇష్టమొచ్చినట్టు ఒంపేసుకుంటుంటే వాటిని చీల్చుకుని అడ్డు నిలిచిన మంచుతెరల్ని దాటుకుని కురుస్తున్న వెలుతురా? మనిషిలో అందాకా నిదురబోతున్న అంతఃచేతన మేల్కొని మనసునావరించిన క్లేశాలనూ అవరోధాలనూ ఆవేశాలనూ తనని తనలా ఉండనివ్వని అన్నింటినీ ఒక గమనింపుతో జారవిడిచి, తనని తను నిజంగా పూర్ణంగా ఆనందంగా చూసుకునే క్షణమా?? వీటన్నిటి కలబోతా? నాకలాగే అనిపిస్తుంది. యాత్రికుడు చేరబోయే సుందర తీరం అదేనని అనిపిస్తుంది.

ఈ పాట తెలీని వారు ఓ సారి వింటారనీ, తెలిసీ ఇష్టపడిన వారు మరోసారి వింటారనీ షేర్ చేస్తున్నాను.

Hope you all will enjoy the song.

పాట: ఓహో యాత్రికుడా
రచన: మల్లవరపు విశ్వేశ్వరరావు గారు (‘కల్యాణ కింకిణి’ పుస్తకంలో ‘వసంత యాత్ర’ అనే కవిత)
సంగీతం మరియు గానం : సాలూరు రాజేశ్వర్రావు గారు.


https://www.youtube.com/watch?v=STp7l2CcrmU&fbclid=IwAR200ys7fKsQAKh18uBE5OvfIyMMi9AAaZd1EwMHea5wJ9RMZ3l29p2tK-M




****************************************************