Monday, May 20, 2013

నాకు నచ్చిన సినిమా...బారాన్ !!!





డైరెక్టర్ మజీద్ మజీదీ సినిమాలు అన్నీ మాణిక్యాలే! ఇది బెస్ట్ అని ఏరుకోటం చాలా కష్టం. ఇరానియన్ సినిమా చరిత్ర పుటలలో తనకంటూ ఒక ప్రత్యేకతను, తనకంటూ కొన్ని పేజీలను, సృష్టించుకున్నఒక  గొప్ప డైరెక్టర్ మజీద్ మజీదీ . ఆత్మీయతలూ, అనుబంధాల గురించి సున్నితంగా, అందంగా చెప్పే, అద్భుతంగా ఆవిష్కరించే, హృద్యంగా చిత్రీకరించే ఒక ఉన్నతమైన సినీ శిల్పి.

మజీద్ మజీదీ సినిమాలలో  నాకు నచ్చిన ఒక  సినిమా...బారాన్. ఎన్నొ అవార్డ్స్ గెలుచుకున్న ఈ సినిమా (12 విన్స్ - 4 నామినేషన్స్ ) చూసినంత సేపూ ఉత్కంఠత  తోటి చూస్తాం.  ఈ సినిమాను పరిచయం చే్ద్దామని నా ఈ చిరు ప్రయత్నం. 2001లో విడుదలైన చిత్రంలో హీరో - హొసేన్ అబేదిని, హీరోయిన్ - జహ్రా బహ్రమీ.


కథా నేపధ్యం
అఫ్ఘనిస్తాన్ 1979 లో ఎదుర్కున్న దాడులు, తరవాత అలుముకున్న పొలిటికల్ వాతావరణం, ఆ తరవాతి వాతావరణ పరిస్థితులు, ఎందరో అఫ్ఘనీయులని తమ దేశం వదిలి, వేరే దేశాల్లో తలదాచుకునేలా చేసింది. అలా ఇరాన్ కి వలస వెళ్ళినవాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారట. అలాంటి రెఫ్యుజీస్ నేపధ్యంలోంచి పుట్టిన కధ ఇది.


క్లుప్తంగా కథ
ఇద్దరు యువతీ యువకుల మధ్య (టీనేజర్స్ నిజానికి), మాటలలో బహిర్గతం కాని, వ్యక్తీకరింపబడని, వ్యక్తీకరించని ప్రేమ కధ ఇది. అడోలసెంట్ లవ్ అన్నమాట. పిల్లలు అడోలసెంట్స్ గానీ, వాళ్ళ ప్రేమలో ఎక్కడా మనకు చిన్న పిల్లలు ఆకర్షణ అనిపించదు. వారి ప్రేమలో పరిణితి మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ పిల్లలు మోస్తున్న జీవితం ఏమీ చిన్నపిల్లల జీవితం కాదు.. బ్రతుకు భారాన్ని, కుటుంబ భారాన్నీ మోస్తున్న వీళ్ళల్లో పరిణితి సహజంగానే ఉంటుందేమో?


హీరో లతీఫ్, హీరోయిన్ బారాన్
ఇరాన్ కి వలస వచ్చి,  రెఫ్యుజీ గా ఉంటూ,  కంస్ట్రక్షన్ సైట్ లో  పని చేస్తూ ఉంటాడు లతీఫ్. అక్కడే  పని చేస్తున్న నజఫ్ పనిచేస్తూ పై అంతస్తు మీదనుంచి కిందపడితే, కాళ్ళు విరుగుతాయి. నజఫ్ స్నేహితుడు సుల్తాన్, నజఫ్ కొడుకు రహ్మత్ ని పనిలోకి తీసుకు వస్తాడు. అయితే రహ్మత్  అబ్బాయి కాదూ, అబ్బాయి వేషంలో ఉన్న అమ్మాయి అని లతీఫ్ కి యాదృచ్చికంగా తెలుస్తుంది. లతీఫ్  ఆ అమ్మాయిని అభిమానిస్తాడు, ప్రేమిస్తాడు. ఆ ప్రేమతో తన ఐడెంటిటీనే కోల్పోతాడు. (నిజంగానే తన ఐడెంటిటీ కార్డ్ అమ్మేసి మరీ ఆ కుటుంబానికి సహాయం చేస్తాడు.)

తన ప్రేమను వ్యక్తీకరించే పరిస్థితులు ఉండవు. తను చేసిన సహాయాన్ని కూడా బయట పెట్టకుండా కేవలం ప్రేమిస్తున్నాడు కాబట్టి తను ఆ అమ్మాయికీ, ఆమె కుటుంబానికి చేయగలిగిన సహాయం చేసి వాళ్ళు అఫ్ఘనిస్తాన్ వెళ్తుంటే చూస్తూ ఉండిపోతాడు. ఆ అమ్మాయికీ అతని ప్రేమ తెలుసు. కానీ కట్టుబాట్లూ, కుటుంబ పరిస్థితులు ఆమెను మాట్లాడనివ్వవు. అబ్బాయి వేషంలో కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది ఆ అమ్మాయి.

ఇద్దరూ పేదరికంలో మగ్గుతున్నవారే, జీవిత పోరాటం సాగిస్తున్న వారే. అలాగని ఎక్కడా పేదరికం వారి మనస్తత్వాన్ని డామినేట్  చెయ్యదు, సినిమానీ  డామినేట్  చెయ్యదు. పరిస్థితుల్లోని పేదరికం కంటే మనస్సుకు పట్టే పేదరికం పైనే, డైరెక్టర్ దృష్టి సారించినట్టు అనిపిస్తుంది.  మనల్ని ఆశ్చర్యానికి గురిచేసే విషయం ఎమిటంటే ఎంత కష్టంలో ఉన్నా, చుట్టూ కష్టాల్నీ కల్మషాల్నీ చూస్తున్నా తమ నైతిక విలువల్ని సహజంగా నిలుపుకునే తత్వం వీరిలో ఉండటం. పరిస్థితుల్ని అర్ధం చేసుకునే ప్రయత్నంలో, పరిస్థితుల్ని తట్టుకుని నిలబడే ప్రయత్నంలో, వారి మానసిక సంక్షోభం, వారి ఎదుగుదల, పరిణితి మనకు కనిపిస్తాయి.


అఫ్ఘాన్ రెఫ్యుజీలు - ఉద్యొగ పరిస్థితులు
ఇందులో అఫ్ఘాన్ ఇరాన్ ఉద్యొగ పరిస్థితుల గురించి మనకు కొంత పరిచయం కలుగుతుంది.  అఫ్ఘాన్ నుంచి వలస వచ్చిన వారు ఒక ఐడెంటిటీ కార్డ్ కలిగి ఉండాలి. వాళ్ళ ఉనికికి ఉన్న ఒకే ఒక ప్రూఫ్ అది! (హీరో దాన్ని అమ్మేసి బారాన్ కుటుంబానికి సహాయ పడటం అల్టిమేట్ సాక్రిఫైస్). అలాగే పని చెయ్యటానికి సర్కారీ పర్మిషన్ ఉండాలి. రోజు గడవటం కోసం, పర్మిషన్ లేకున్నా అతి తక్కువ వేతనంతో పని చెయ్యటానికి, కష్ట పడటానికీ అఫ్ఘనీ రెఫ్యుజీస్ సిద్దంగా ఉంటారు. ఇరానీ దేశస్థులకు ఉద్యొగాల్లో వీరినుంచి గట్టి పోటీ ఉంటుంది. పైగా ఇరానియన్ వాళ్ళ కన్నా, వీరికి జీత భత్యాలు చాలా తక్కువగా ఉంటాయి. సర్కారీ అధికారులు చెక్ చేయడానికి వస్తే పర్మిషన్ లేకుండా పనిచేస్తున్న అఫ్ఘనీ వాళ్ళందరూ దాక్కొవలసిందే. దొరికితే ఉద్యోగంలో పెట్టుకున్నవాళ్ళూ, ఉద్యోగం చేస్తున్నవారూ -  ఇద్దరూ శిక్షార్హులే!


మానవీయ కోణంమెమర్
 శ్రమ దోపిడీ చేస్తున్నామని యజమాని మెమర్ కి  తెలుసు. దోచుకోబడుతున్నామని వీళ్ళకు తెలుసు. అలాగని మానవీయ కోణం పూర్తిగా వదిలెయ్యరు ఇద్దరూ. ఇద్దరికీ ఒకరిపట్ల ఒకరికి తమ బాధ్యత ఏమిటొ తెలుసు. యజమానిగా మెమర్ పాత్రధారి బాగా చేసారు. తనున్న పరిస్థితిలో న్యాయంగా ఉండటానికి అతను అతి సహజంగా మొగ్గు చూపటం బావుంటుంది. కేవలం శ్రమను దోచుకునే పెత్తందారీ మనస్తత్వం కాకుండా, అవసరానికి సలహా చెప్తూ, హీరో చెల్లికి బాగాలేదని తన జీతం మొత్తం అడిగినప్పుడు, (ఈ డబ్బు తీసుకెళ్ళేది నమ్మకస్తుడేనా అని కనుక్కుని మరీ డబ్బు చేతిలో పెడతాడు) ఆదుకోటానికి  సిద్దపడిన ఆతను, లతీఫ్ ని పొలీసుల నుంచి విడిపించటం, నజఫ్ కి తన దగ్గర ఉన్న డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయటం.... మెమర్ లోని మంచితనాన్ని చూపిస్తుంది. ఇక్కడ కూడా నిజాయితీకి పెద్దపీట వేశారు డైరెక్టర్.


స్వాభిమానం
ఇంకో విషయం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఈ సినిమాలో. అది వీరిలోని అత్మాభిమానం. అయ్యోపాపం అని దానం చెస్తే ఎవ్వరూ పుచ్చుకోరు. వారి కష్టానికి ప్రతిఫలం తీసుకుంటారు, లేదా అప్పుగా తీసుకుంటారు కానీ, ఉదారంగా మాత్రం తీసుకోరు. బారాన్ కుటుంబానికి సహాయం చేయాలని తను అప్పటి వరకూ కూడబెట్టిన జీతాన్ని అంతా, మెమర్ ని అడిగి సుల్తాన్ కి ఇచ్చి పంపిస్తాడు లతీఫ్. తనకంటే కష్టం లో ఉన్న సుల్తాన్ పరిస్థితి గమనించిన నజఫ్ ఆ డబ్బు అతన్నే ఉంచేసుకొమ్మని అంటాడు. ఆ స్నేహితుడూ అప్పుగానే ఆ డబ్బు తీసుకుంటాడు. అలాగే లతీఫ్ తన ఐడెంటిటీ కార్డ్ అమ్మి డబ్బు తెచ్చి నజఫ్ కి ఇస్తే,  తను అఫ్ఘనిస్తాన్  వెళ్ళాక డబ్బు తిరిగి పంపిస్తానని చెప్తాడు నజఫ్. పక్కవాడికి తాము సహాయపడటానికి వెనకాడని మనస్తత్వం మనకు ఇక్కడ కనిపిస్తుంది. పరిస్థితులకే తప్ప మనసుకి పేదరికం లేదు, వ్యకిత్వానికీ పేదరికం లేదు అనిపిస్తుంది.  వీరి స్వాభిమానపు అరిస్టోక్రసీ ముందు పరిస్థితుల దరిద్రం తలవంచుకోక తప్పదు. 

ప్రతీ పాత్రా దరిద్రంలో, పేదరికంలో మగ్గుతున్నదే ఐనా, ప్రతి ఒఖ్ఖరూ ఎమోషనల్లీ రిచ్, స్పిరిచువల్లీ రిచ్. జీవన పోరాటం చేస్తూనే ఉంటారు కానీ ధైర్యాన్నీ, స్థైర్యాన్నీ కోల్పోరు. నిజాయితీనీ, నీతినీ కోల్పోరు. అందువల్ల మనకు సినిమాలో పేదరికం కనిపించదు. మనుషులు, రిలేషన్షిప్స్, ఆప్యాయతలూ కనిపిస్తాయి. పరిస్థితులు ఏవైనా మనం మన మనసును పేదరికం ఆవరించకుండా చూసుకోవాలి అని చెప్పకనే చెప్పిన మజిద్ మజిదీ కి జోహార్లు!


పిట్ట కధ
బారాన్ కోసం వెతుకుతున్నప్పుడు, లతీఫ్ కి ఒక  చెప్పులు కుట్టే వాడు కనిపిస్తాడు. ఎంతో కవితాత్మక హృదయం ఉన్న అతన్ని, నువ్వు ఎవరితో ఉంటావ్ అని లతీఫ్ అడిగితే "ఒంటరి వాళ్ళకు భగవంతుడే ఇరుగూ పొరుగూ" అంటాడు. బహుశ లతీఫ్ కి భవిష్యత్తులో కలిగే ఒంటరి తనానికి భగవంతుడి తోడు అవసరమని సూచన ప్రాయంగా తెలియ చెయ్యటం మజిద్ మజీదీ ఉద్దేశం ఏమో?
 

ముగింపు
ఇందులో  హీరో మానసిక సంఘర్షణ, ఆ సంఘర్షణలోంచి పుట్టిన పరిపక్వత చాలా బాగా చూపించారు. అలాగే సినిమా మొత్తం ఒక్క మాట కూడా మాట్లాడని హీరోయిన్ (పాత్రోచితంగా అబ్బాయి వేషంలో ఉంటుంది కాబట్టి, మాట్లాడకూడదు కూడా) కళ్ళతో కనబరిచే భయం, కష్టం, ఇష్టం, నిస్సహాయత మనల్ని ఆకట్టుకుంటాయి. నటనలో ఇద్దరూ ఉద్ధండులు, పేరు పొందిన నటులు కాకపోయినా మనల్ని మెప్పించే వారి నటనకు జోహార్లు అనక తప్పదు. కొత్త నటీ నటులు (హీరో ఒక సినిమా చేశాడు అనుకుంటాను) అంత చక్కగా చేయటం ఒప్పుకోవాల్సిన విషయం.

చివరి సీన్లో సమాధుల దగ్గర లతీఫ్ పడే సంఘర్షణ, అప్పుడు  వినిపించే ప్రేయర్, ఆ మ్యూజిక్,  అన్నీ అద్భుతంగా అనిపిస్తాయి. అక్కడ లతీఫ్ తన ఆత్మ సంఘర్షణలోంచి బయటపడతాడు. ఆత్మస్థైర్యంతో  బారాన్కి వీడ్కోలు తెలపటానికి సిద్ధపడతాడు. బారాన్ వస్తువులు పడిపోయినప్పుడు ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా, కేవలం చూపులతోనే మాట్లాడుకుని విడిపోవటం - ఒక గంభీరతను, గాఢతను కలగచేస్తుంది. అలాగే ఆమె వెళ్ళిపోయాక , లతీఫ్ పెదవులపై వెలిగే నవ్వూ, కళ్ళలోని ప్రశాంతత...నేలమీద పడిన ఆమె పాదం గుర్తు, దానిపై కురుసే వర్షపు నీరూ.... ఇవి మనల్ని చాలా రోజులు వెంటాడుతూనే ఉంటాయి.

జీవితం గురించి, జీవించటం గురించి, మనుషుల గురించి, మానవత్వం గురించి, మనల్ని ఆలోచింపచేసే చిత్రమిది. ఇంత సున్నితంగా ప్రేమని ఆవిష్కరించి, పెద్దగా కధ లేకపోయినా మనల్ని కదలకుండా కూర్చోపెట్టేట్టుగా కధా గమనాన్ని నిర్దేశించిన  డైరెక్టర్ కి జోహార్లు.

మజీద్ మజీదీ సినిమాలలో తప్పక చూడాల్సిన చిత్రం ఇది.




Saturday, May 4, 2013

కవిత.


 జ్ఞ్యాపకాలు .




 








గుండె పగిలిపోతోంది
రారమ్మని
రాలే ఆకులతో
కబురంపితే,
ఎక్కడో నువ్వు??

ఇప్పుడు,
రాలిన ఆకులతో,  మోడు చెట్టుతో,
నా సమాధి పక్కన-
జ్ఞ్యాపకాలు తవ్వుకుంటూ,
ఎండిన పూలదండలు వేసుకుంటూ,
ఎందుకిక్కడ నువ్వు?