Tuesday, October 18, 2011

"నిన్నటి  ఉషోదయాలు ...మొన్నటి వెన్నెల జలపాతాలూ...
 ఎక్కడికో వెళ్లిపోయాయని అనుకుంటూ ఉంటాను ...
 నా  రొటీన్ లో పడి అన్నీ కొట్టుకుపోయాయని బాధపడిపోతుంటాను. 
     మరుక్షణం ఓ చిరునవ్వులోకి  విరిగిపోతుంటాను,
     ఉషొదయాలూ, వెన్నెల వెలుగులు 
    మనసులో ఉంటే, నేనేంటి వాటికోసం ఆకాశంలో వెతుకుతున్నాను?
    అనుకుంటూ పనిలో పడిపోతాను.  "

జీవితాన్ని జీవించాలి,
జీవితాన్ని ఆస్వాదించాలి,
మనం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి.
ప్రతి మనిషి కోరుకునేది అదే. కానీ కిటికిలోంచి రెండు concrete బిల్డింగ్స్ మధ్యనుంచి దోబూచులాడుతూ కనిపించే ఆకాశాన్ని మనం చూస్తున్నామా? అరె బాల్కనీ లో నుంచుని రాత్రి నిశ్సబ్దంగా ఉండే రోడ్డుని.అంతే నిశ్సబ్దంగా, నిశ్చలంగా ఉండే ప్రశాంతమైన ఆకాశాన్ని చూస్తామా ఎప్పుడైనా మనం? మన పరుగులో పక్కన నుంచున్న దేవుడుని కూడా పట్టించుకోం మనం. మనం కాస్త అగుదామా? ఆగితే ఉషోదయాలు, వెన్నెలలు కనిపిస్తాయేమో?
ఇంట్లోనే పారిజాతాలు  విరబూస్తయెమో ? మనసు  విచ్చుకుని, ఆనందాలు చిగురిస్తాయేమో? అవి మన గుప్పిట్లోనే ఉన్నాయేమో? ఇలా ఆలోచన వస్తే మనసు చిరునవ్వు లోకి సహజంగానే విచ్చుకుంటుంది. 

ఇదేదో ఆలోచించాల్సిన విషయమే సుమీ !!














Tuesday, June 28, 2011

నాలో నేను..

నాలో నేను..

దిగంతాలు జారిపోతున్నై, వసంతాలు తరలి పోతున్నై...
ప్రతి ఉదయం రాత్రి లోకి మారిపోయి, రోజులు గడిచిపోతున్నై!
నిన్నల్లో నేడుల్లో గతం మిగిలిపోతోంది.

పసితనం నుంచి ఎదిగి ప్రౌఢ దశను మించిపోయి ,
కదలిపోతున్న కాలంలో కలసిపోతున్నా ...
ఇంతవరకు నాకు ఏంకావాలో తెలుసుకోలేదు,
ఇంతవరకు నా గమ్యం ఏమిటో తెలీదు...
అసలు నేనేమిటో నాకు ఇంకా తెలీదు.

ఇంక ప్రపంచం గురించి ఏం తెలుసుకొను?
ఇంకో మనిషి గురించి ఏం తెలుసుకొను?

ఇలా ఏమి తెలియనితనంలో ఈ పరుగు
ఎందుకో? ఎక్కడికో?

Sunday, June 12, 2011

నం పా సా..నందూరి పార్ధసారధిగారు. ఆయన రచించిన " రాంబాబు డైరీ " ఓ రసగుళిక.

నం పా సా..నందూరి పార్ధసారధిగారు. ఆయన రచించిన " రాంబాబు దైరీ " ఓ రసగుళిక.

మనసుని ఆహ్లాద పరిచేలా ఒక మాట మాట్లాడటమే కష్టం, అలాంటిది ఓ పుస్తకం రాయాలంటే?అదీ అద్భుతంగా, జనాల్ని మెప్పించేలా రాయటం అంత సులువు కాదు.

అత్యంత అద్భుతంగా రాసి మెప్పించటం పార్ధసారధిగారి రచనా నైపుణ్యాన్ని సూచిస్తుంది. నా ఉద్దేశంలో ఇది ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకం. హాస్యాన్ని ఆస్వాదించే ప్రతిఒక్కరూ "తప్పకుండా" చదవవలసిన పుస్తకం. పుస్తకం నిండా చమక్కులే. రాంబాబు పాత్ర ఎంత అద్భుతంగా మలచబడింది అంటే మన రొటీన్లో అతను ఏదో ఓ రూపంలో గుర్తుకోస్తూనే ఉంటాడు. తెలుగు జర్నలిజంలో ఓ వెలుగు వెలగాలని కలలు కనే రాంబాబు డైరీలో, మచ్చుక్కి ఓ చిన్నిభాగం సరదాగా ...

" ఏమిటో ఈ కాలంలో నినాదాలు తీవ్ర పర్యవసనాలకు దారితీసేవిగా కనిపిస్తున్నాయి. 'దున్నేవాడిదే భూమి' అంటున్నారు రైతులు. అంటే వ్యవసాయం చాతైన వారికే భూమి వుండాలని తాత్పర్యం. బాగానే ఉంది.కాని రేపు రజకులు 'ఉతికే వాడిదే బట్ట' అని పేచీ పెట్టవచ్చు. ఎల్లుండి నాయీ బ్రాహ్మణులు 'గొరిగేవాడిదే తల' అని వాదించరని గారంటీ ఏమిటి? ....ఇటువంటి పిదప కాలం వస్తుంది అనే మహా పురుషులు ఎలేక్ట్రిక షేవర్లు,వాషింగ మెషిన్లు కనిపెట్టారు. (నాకు ఇంతటి ఒర్జినలు ఐడియాలు వస్తున్టే హర్షించెవాళ్ళే లెరు కదా ! మనదేశంలో ప్రతిభకు తగిన పరిగణన లేదు.అందుకే గొప్ప విజ్ఞానులందరూ విదేశాలకు వెళ్ళిపోతున్నారు. స్వదేశంలో ఉండే  యోగం నాకూ ఉన్నట్టు లేదు."

రాంబాబు వర్సటాలిటికి పరిధుల్లేవు.ఫిలాసఫీ,సంగీతం,క్రికెట్,సినిమా,సామాజిక స్పృహ,గ్లామర్,...

Everything under the sun becomes a matter of interest to him.
Hats off to the creator of Rambabu.

ప్రస్తుతానికి ఇంతే.రాంబాబు జర్నలిజం నేర్చుకున్నట్టు ఉంది నేను టైపు  చెయ్యటం. ఈ కాస్త టైపు  చెయ్యటానికి గంటన్నర పట్టింది. ఇక భోజనాలకి లేవకపోతే ఆకలి కేకలు ఆవేశపు బాట పట్టి ఇంట్లో యుద్ధకాండ  మొదలైతే కష్టం!

Tuesday, March 1, 2011

ద్వితీయ విఘ్నం ఉండకూడదని...

సో విషయం అదన్నమాట. ఇల్లు, ఆఫిసు, వంట - ఇవి చాలనట్టు ఇదొకటి. రాయాలనే తాపత్రయం ముందు అన్నీ తుడిచిపెట్టుకు పోతాయి, కొద్దో గొప్పో రాయటం అంటూ మొదలు పెడితే అనుకున్నా, కానీ అది అంత సులువైన విషయం కాదు అని ఇప్పుడే తెలుస్తోంది.

కుక్కర్ పిలుపులు, కాలింగ్ బెల్ మోతలు వగైరాల మధ్య అభిమన్యుడి స్టైల్లో బ్లాగింగ్ చెయ్యటం అదీ టైపింగ్ రాని నేను...
అక్షరం అక్షరం కూడబలుక్కుంటూ ..." Where there is a will there is a way "అని నా భుజం నేనే తట్టుకుంటూ "పదండి ముందుకు, పదండి తోసుకు " అనుకుంటూ ముందుకి వెళ్తున్నా.

సుదూర తీరాలు పిలుస్తున్నాయి,
సముద్రం అంతా అలల పాటలే కదా,
ఆ పాటల తేరుపై తేలిపోతూ రమ్మని..

ఆక్షరాల తళుకులు పిలుస్తున్నాయి,
ఆలోచనలు నాలోంచే కదా పుదతాయి,
వాటిని పంచుకోమని!

ఏంటో కవితాత్మ మేలుకుంటోంది. సర్వజనుల శ్రేయస్సు కోసం ఇక ముగించటం మంచిదేమో?

నిజంగా ఓ మంచి పుస్తకం చదవటం, ఓ మంచి పాట వినటం,ఎంత ఆనందం!
Any doubts??

Monday, February 28, 2011

ఆహా, ఛివరికి సాధించాను....

హమ్మయ్య ఎలాగైతేనేం మొత్తానికి సాధించాను. ఓ బ్లాగు మొదలు పెట్టాను.

పోపు వేసే చేతికి ఇది కోత్తే కానీ, అదే వస్తుంది అనే నమ్మకంతో ముందదుగు వేస్తున్నాను.
ఓ పక్క వంట చెయ్యాలనే ఆలోచన మెదడుని తొలుస్తోంది, ఇంకోపక్క అలవాటు లేని ఔపోసన - ఈ తెలుగు టైపింగతో కుస్తీలు, ఇంకోపక్క ఆకలో రామచంద్రా అని అరుపులు వినిపించే లోపల వంట పూర్తి చేస్తే మంచిది కదా అన్న ఆలోచన...

ఇదేదో బాగుంది. మధ్యలో ఇంగ్లీషలో మాట్లాడటానికి లేదు.
కొంచం కష్టంగా ఉన్నా బావుంది. ఇవాళ్టికి ఇది చాలనుకుంటా. ఓపిక లేనప్పుదు బంగాళాదుంప వేపుదు, ముద్దపప్పు తో వంట ముగించేసినట్టు ఇవాళ్టికింతే మరి!!!

ఈ కాస్తా రాయటానికి ఓ గంట పట్టింది.