Monday, February 12, 2018

నాకు నచ్చిన పుస్తకం - లల్లబై: లైలా స్లిమని






మిరియమ్ వేసిన కేక, మామూలు కేక కాదు. అది గొంతులోనుంచి వచ్చినట్టు లేదు. పేగులు చించుకుని వచ్చినట్టు ఉంది. ఒక దెబ్బతిన్న అడవి జంతువు పెట్టిన చావు కేకలా ఉంది. పిల్లల్ని అలా చూసిన ఆమె ఒక ఉన్మాదిలా కేకలు పెడుతోంది. చూసినది తట్టుకోలేక వాంతి చేసుకుని, అక్కడే కూలబడి పెనుకేకలు పెడుతోంది. ఆ అరుపులకు గది గోడలు వణుకుతున్నట్టు ఉన్నాయి. అక్కడినుంచి బయటకి తీసికెళ్ళటానికి ప్రయత్నిస్తున్న వైద్య బృందాన్ని ప్రతిఘటిస్తూ, కాళ్ళతో తంతూ, అరుస్తున్న ఆమెను బలవంతంగా మత్తు మందు ఇచ్చి బయటకి తీసికెళ్ళారు అక్కడికి వచ్చిన వైద్యులు. పోలీసులు తమపని తాము చేసుకుని పోతున్నారు. ఇద్దరు పిల్లలు. ఒకడు ఎక్కువ కష్టపడకుండానే చచ్చిపోయాడు. అమ్మాయి మాత్రం కొన ఊపిరితో ఉంది…

**
లల్లబై - లైలా స్లిమని (Lullaby - French: Leila Slimani - Translated by: Sam Taylor)

ప్రెంచ్ నుంచి ఇంగ్లీష్ లోకి అనువదింప బడ్డ ఈ నవల ఒక క్రైమ్ / సస్పెన్స్ థ్రిల్లరా? ఒక సైకలాజికల్ థ్రిల్లరా?? ఒక సోషియలాజికల్ / జెండర్ / జాతి వివక్షల ప్రతిబింబమా?

పుస్తకం మొదలుపెట్టిన దగ్గరనుంచి ఒక చిక్కటి, నల్లని, సుడిగుండంలోచిక్కుకున్న అనుభూతి. అందులోనుంచి పైకి రావటానికి ప్రయత్నం చేస్తాం, పట్టు దొరకదు. ఊపిరాడని సఫొకేషన్. ఆ భాషా, ఆ పాత్రలూ మనల్ని చుట్టేసి, కమ్మేస్తాయి. ఆ సుడిగుండంలో చిక్కుకుని సుడులు తిరుగుతూ మనం కూడా కిందకు వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకుంటే బావుండు అనిపిస్తుంది. ఈ ఊబిలోనుంచి, ఈ పాత్రల జీవితాల్లోనుంచి బయట పడితే బావుండు అనిపిస్తుంది. బలమైన పాత్రలను సృష్టించటం ఒక ఎత్తు, అంతటి పాత్రలనూ ఒక కథనంతో ముడిపెట్టి చదువరిని అంతే బలంగా శక్తిమంతంగా కట్టిపడేసి చివరి వాక్యం వరకూ చదివించే శక్తిని ప్రదర్శించటం ఒక ఎత్తు. ప్రెంచ్ భాష నుంచి ఈ నవలని ఇంగ్లీష్ లోకి అనువదించింది సామ్ టెయిలర్.

కథ - ప్రస్తుత కాలానికి చెందినదే. ఒక కుటుంబం - ప్రేమించి పెళ్ళిచేసుకున్న పాల్, మిరియమ్, వారి పిల్లలు ఆడమ్, మిలా. పిల్లల్ని పెంచటం వర్సస్ కరీర్ ప్రధాన సమస్య. మిరియమ్ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఒక భార్యగా ఇంటికి పరిమితమౌతుంది. రోజులు గడిచే కొద్దీ ఆమెకు జీవితం దుర్భరంగా అనిపిస్తుంది. ఎన్నో కష్టాలకోర్చి చదివిన చదువు - అన్నీ వదులుకుని ఇలా మిగిలిపొవటం ఆమెకు నచ్చదు. రచయిత్రి ఇక్కడ జెండర్ గురించి పట్టుగా లోతుగా విశ్లేషిస్తారు. పిల్లల్ని పెంచటం, స్త్రీ పాత్ర - శారీరక మానసిక ఇబ్బందులు, ఇష్టం లేకపోయినా చేసే త్యాగాలూ, అసమానతలు ఇవన్నీ మిరియమ్ ద్వారా చర్చించటం జరుగుతుంది. అలాగే పరిస్థితుల పట్ల పాల్ అసహనం, ఇద్దరిలో జీవితంలో ఏదో సాధించాలన్న ఆత్రం గురించి కూడా రచయిత్రి నిశితమైన పరిశీలన చేస్తారు. భార్యా భర్తలిద్దరూ కలిసి పిల్లల్ని చూసుకోవటానికి ఒక సహాయకురాలిని(Nanny) ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటారు.

ఆలా ఆ ఇంట్లోకి ఒక నానీగా(Nanny), పిల్లల్ని చూసుకునే వ్యక్తిగా ప్రవేశిస్తుంది లూయిస్. ఆమె తమ సమస్యలు అన్నింటికీ ఒక అద్భుతమైన సమాధానంలా కనిపిస్తుంది దంపతులిద్దరికీ. పిల్లల్ని చక్కగా చూసుకుంటూ, ఇంటి పనులనీ, వంట పనులనీ అవలీలగా చేస్తూ తనకంటూ ఆ ఇంట్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటుంది లూయిస్. పిల్లలపై ఆమె చూపే శ్రద్ధా, పనితీరు, ఆ దంపతులకి ఇంటిపై బెంగ లేకుండా తమ పనులు/వృత్తులపై, మనసుపెట్టి పని చేసుకునే వెసలుబాటు కల్పించి, వారి ఎదుగుదలకు తోడ్పడుతుంది. వారు కోరుకున్న జీవితానికి బాటలు వేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఆర్ధికంగా ఎదగటం, ఈనాటి సమాజంలో ఒక ముఖ్యమైన విషయం అన్నది మరోసారి గుర్తుచెయ్యటం రచయిత్రి ఉద్దేశం అనిపిస్తుంది. అన్నీ తానే అయ్యి, అన్ని పనులూ చేస్తూ, నెమ్మదిగా ఆ ఇంటి మధ్యలో తనకంటూ ఒక గూడుని కట్టుకునే ప్రయత్నం మొదలు పెడుతుంది లూయిస్. తనూ ఆ కుటుంబంలో ఒక భాగమవటానికి తయారవుతుంది ఆమె. ఇక్కడే యజమానులకి పనివాళ్ళకి మధ్య వచ్చే భేదాభిప్రాయాలూ, లూయిస్ స్వతంత్ర నిర్ణయాలు, యజమానులకూ పనివారికీ మధ్య ఎంత సాన్నిహిత్యం ఉన్నా, సమానత్వం ఉండే అవకాశం తక్కువ అన్న నిజం, పనివారు కుటుంబంలో ఒక భాగం కావటం అంత సులభమైన విషయం కాదూ అన్న విషయం, జాతి వివక్ష, వీటన్నిటి తాలుకు క్లిష్టతలూ రచయిత్రి ప్రస్తావిస్తారు. లూయిస్ ఒక చిక్కని నీలినీడలు నింపుకున్న బలమైన పాత్ర. ఆమె ఒంటరి బ్రతుకు, కుంగిన ఆర్థిక పరిస్థితులూ, ఆమెని విడిచి వెళ్ళిపోయిన కూతురూ, చనిపోయిన భర్తా, ఎవరికీ తన గురించి తెలియకుండా గుంభనంగా ఆమె మసులుకునే తీరూ, ఆమెలో ఎక్కడో పొంచి ఉన్న ఒక విపరీత ధోరణి వీటిని మనకు రచయిత్రి పరిచయం చేస్తూనే ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, తన అవసరం ఇక యజమానులకు ఉండదు అన్న భయం, వాళ్ళకు ఇంకొక బిడ్డ పుడితే తను అక్కడే ఉండవచ్చన్న ఆలోచన ఆమెను నిలవనీయకుండా చేస్తాయి. చివరికి తను అమితంగా ప్రేమించిన పిల్లల్ని చంపి హంతకురాలు అవుతుంది లూయిస్.

మనుషుల మధ్య నిరంతరంగా సాగే బంధాల మధ్య కదలాడే చీకటి కోణం సాక్షిగా, ఊహకి అందని ఒక భయంకరమైన కథ ఇది. ఇలాంటి కథలు వార్తల్లో వింటూ, చూస్తూ ఉంటాం. కానీ ఆ కథల వెనక కదలాడే నీడల చిత్రాలనూ, మానసిక ఘర్షణలనూ ఎత్తి చూపించిన పుస్తకం ఇది.

మనసుని వేధించే పుస్తకం ఇది.

Tuesday, July 11, 2017

చికెన్ సూప్...

‌‘చికెన్ సూప్ ఫర్ ద్ సోల్ ..నాకు చాలా ఇష్టమైన కథల సీరీస్.
ఆ పుస్తకాన్ని నా చేతిలో చూసి, ఇలాంటి సెంటిమెంటల్ స్టఫ్ నాకు చిరాకు అన్నవారు ఉన్నారు.
జీవితం ఎప్పుడూ సమస్యలతో నిండి ఉంటుంది. ఆ సమస్యలని మనం గుర్తించి స్పందించినట్టుగా, జరుగుతున్న మంచిని గమనించటం, అస్వాదించటం అంత సులభంగా జరగదు అనుకుంటాను. ఈ కథల సిరీస్ అంతా అలాంటి చిన్నచిన్న అద్భుతాల  (మంచి, మానవత, స్నేహం, కలలని సాకారం చేసుకోవటం వగైరాలు - చాలా మటుకు వాస్తవంగా జరిగిన సంఘటనలే) గురించి చెబుతూ, మనల్ని కూడా అలాంటి వాటిని గుర్తుచేసుకొమ్మనీ, గుర్తించమనీ చెప్తున్నట్టుఅనిపిస్తుంది. అందులో నాకు నచ్చిన ఒక చిన్న కథ తెలుగులో...ఇది మక్కీకి మక్కి అనువాదం కాదు.
లెట్ అజ్ రిమెంబర్ సమ్ గుడ్ థింగ్స్ అబౌట్ లైఫ్!!


ద డొనేషన్ బాక్స్

మూడునెలలు కష్టపడ్డాను. నా సమ్మర్ సెలవుల్లో బేబీసిట్టింగ్ చేసి మరీ సంపాదించిన డబ్బుతో కొన్న డ్రెస్ అది.
**

మొదటిసారి టీన్మేగజైన్ లో చూసినప్పుడు ఎంతో బావుంది అనిపించింది.
"నాకిది కొనిపెట్టవా!" అని అమ్మని అడిగితే, "అది ఒక్కటీ కొనే డబ్బుతో, నీ డ్రెస్సులు అన్నీ కొనొచ్చు తెలుసా?" అంది అమ్మ.
 ప్చ్, ఉండబట్టలేక అడిగాను కానీ నాకూ తెలుసు, అంత ఖరీదైన డ్రెస్ కొనలేమనీ, అడక్కూడదనీ.
అయినా నా  మనసంతా దానిమీదే. "ఆ బ్రాండ్ డ్రెస్సులు అన్నీ అంతే. ఖరీదే. మాకు అందుబాట్లో ఉంటే ఎంత బావుండేది. కొన్ని కొన్ని అంతే... చూసి ఆనందించాల్సిందే" అనుకున్నా.
నా మనసు తెలుసుకుందేమో అమ్మ "సరే ఒక పని చెయ్యి. నేను కొంత డబ్బు ఇస్తాను. మిగతాది నువ్వు సెలవుల్లో ఉద్యోగంచేసి సంపాదించు. అప్పుడు కొనుక్కో"  అంది మధ్యేమార్గంగా.
**

సెలవుల్లో తెలిసినవాళ్ళ పాపను చూసుకున్నాను. నా మూడు నెలల సంపాదనకిఅమ్మ ఇచ్చిన డబ్బులు కలిపి మొత్తానికి డ్రెస్ కొన్నాను.
నా మొదటి సంపాదన. నాకు చాలా నచ్చిన డ్రెస్. ఒకసారి వేసుకుని చూసుకుని మురిసిపోయాను. సరిగ్గా అతికినట్టు ఉంది. నా సంతోషానికి హద్దులు లేవు. అమ్మా, నాన్నా తెగ ముచ్చటపడ్డారు నన్ను చూసి. స్కూల్ రీఓపెనింగ్ రోజున నేను ఆ డ్రెస్ వేసుకెళ్ళటానికి అందరం తీర్మానించుకున్నాం.
**

స్కూల్ తెరిచేలోపల నేనూ అమ్మా కలిసి నా రూం మొత్తం సర్దేసాం. బోలెడంత పనైంది. పాత పుస్తకాలూ, పనికి రాని పెన్నులూ, పెన్సిల్సూ, రబ్బర్లూ, బాగ్‌లూ, చిన్నగా అయిపోయిన షూస్, సాక్స్, పొట్టిగా అయిపోయిన బట్టలూ అన్నీ తీసి, పడేయాల్సినవి పడేసి మిగితావి డొనేషన్  షాప్‌లో డొనేట్ చేసేసాం.  రూమంతా నీట్‌గా సర్దుకుని తయారుగా వున్నాను. ఎప్పుడెప్పుడు స్కూల్ తెరుస్తారా, ఎప్పుడెప్పుడు నా కొత్త డ్రెస్ వేసుకుందామా అని తెగ ఆత్రంగా ఉంది నాకు.   అందరూ పొగిడేస్తారు నన్నూ, నా డ్రెస్సునూ!!
**

మొత్తానికి స్కూల్ తెరిచే ముందు రోజు సాయంత్రం అన్ని రెడీ చేసుకుంటున్నాను. కొత్త బాగ్,
పుస్తకాలు సర్దుకుని, డ్రెస్ కోసం చూసాను. ముందుగా టాప్ తీసుకుని, దానికున్న టాగ్ తీసి చూసుకున్నాను. ఎంత బావుందో. మూడు నెలల సంపాదన, కష్టం మరి. స్కర్ట్ కోసం చూసాను. హాంగర్ కి తగిలించి లేదు. మడత పెట్టానేమో అని చూసాను. కనిపించలేదు. కొంచెం అయోమయంగా అరలో ఉన్న బట్టలన్నీ చూసాను. లేదు. ఇంకెక్కడ ఉంటుందబ్బా? ఈ రూమ్ సర్దడంలో ఎక్కడన్నా పెట్టానా? అన్నీ వెతికాను.
ఎక్కడా లేదు.
అమ్మా, నాన్నా , నేనూ ఇల్లంతా వెతికాము.
ఇంట్లో ఎక్కడా లేదు.
నాకు ఏడుపు ఒకటే తక్కువ. ఎంత వెతికినా దొరకకపోవటం ఏమిటి? అలా ఎలా పోయింది? కనీసం టాగ్ కూడా తీయలేదు. టాప్ ఉంది. మరి స్కర్ట్ ఏమయినట్టు?
నిస్సత్తువగా అనిపించింది. బాధతో నిండిపోయింది మనసు.
**

తోచిన డ్రెస్ వేసుకుని స్కూల్‌కి వెళ్ళాను. అస్సలు ఉత్సాహంగా లేదు. ఎన్ని కలలు కన్నాను ఈ రోజు గురించి? ఎలా రావలసినదాన్ని, ఎలా వచ్చానుఈలోగా కొత్తగా చేరిన అమ్మాయి పరిచయం అయ్యింది. అన్యమనస్కంగా ఉన్న నాకు, నా స్కర్ట్ గురించే ఆలోచిస్తున్న నాకు, ఆ అమ్మాయి వేసుకున్న స్కర్ట్ చూస్తే షాక్ కొట్టినట్టు అయ్యింది. అది నేను ముచ్చటపడి కొన్న స్కర్ట్ లాంటిదే. అదే రంగు... అదే... అందరూ ఆ అమ్మాయి స్కర్ట్‌ని తెగ మెచ్చుకుంటున్నారు.
నేను మెల్లిగా ఇబ్బందిగా "ఇదీ, ఈ స్కర్ట్..." అన్నాను.
"బావుంది కదా, ఈ డ్రెస్ ఒక మాగజైన్‌లో చూసాను. ఇలాంటిది నాక్కూడా ఉంటే ఎంత బావుంటుందో అనుకునేదాన్ని" అంది ఆ అమ్మాయి తన స్కర్ట్‌ని ముచ్చటగా చూసుకుంటూ. 
"అవును. చాలా బావుంది. ఎక్కడ కొన్నారు?"  అన్నాను.
"కొనలేదు. నేనూ, అమ్మా ఇద్దరం కలిసి సంపాదించే డబ్బు ఇంటి ఖర్చులకే సరిపోవటం లేదు. ఇంక ఇలాంటివి కొనటమా?" అంది ఆ అమ్మాయి.
"మరీ.." నాకర్ధం కాలేదు.
"నిన్న డొనేషన్ షాప్ దగ్గర బాక్స్ తీసుకుంది అమ్మ. మాకు చాలాసార్లు డొనేషన్ బాక్సే ఆధారం." ఆ అమ్మాయి కళ్ళలో విచారం తొంగిచూసింది.
"డొనేషన్ షాప్‌లో డొనేషన్ బాక్సా?" నాకేమీ అర్థం కావటం లేదు.
"నీకు తెలుసా, ఆ డబ్బాలో అన్నిటికంటే  పైన ఈ స్కర్ట్ నీట్‌గా మడిచిపెట్టి ఉంది. కనీసం టాగ్ కూడా తీయలేదు. స్కర్ట్‌ని చూడగానే ఆశ్చర్యం వేసింది. నాకు ఇష్టమైన స్కర్ట్ ఎలా ఇందులో? ఎవరు పెట్టి ఉంటారు? వారెవరైనా కానీ, చాలా మంచిమనసు ఉన్నవారు కదా? నాకు కావలసింది తెలిసినట్టుగా! అదీ కొత్త డ్రెస్! అమ్మ చెప్పేది నిజమే- దేవుడు ఎప్పుడూ ఒక కంట మనల్ని కనిపెడుతూనే ఉంటాడు." ఆ అమ్మాయి ఉత్సాహంగా చెప్పుకుపోతూ ఉంది. 
ఆ ఉత్సాహాన్నీ, ఆనందాన్నీ చూస్తున్న నాకు ఏమనాలో తెలియలేదు. అసలు నేనెలా ఆ స్కర్ట్‌ని డొనేషన్ బాక్స్‌లో వేసాను? టాగ్ కూడా తీయకుండా కొత్త డ్రెస్, కావాలని కొనుక్కున్న డ్రెస్, ఎలా అందులో వేశాను?
**

"ఒకసారి మా ఇంటికి వస్తావా?" అని అడిగాను
"ఎందుకు?" అంది.
సంతోషంగా ఉన్న తనని చూస్తూ, "ఆ స్కర్ట్ తాలూకు టాప్ మా ఇంట్లో ఉంది, నీకు అభ్యంతరం లేకపోతే నీకిద్దామనీ-" అన్నాను నేను స్థిరమైన నవ్వుతో.

***

Friday, June 30, 2017

ఈ నెల నేను చదివిన పుస్తకాలు




ఈ నెల నేను చదివిన పుస్తకాలు ఎంత విభిన్నమైనవో అంత అద్భుతమైనవి కూడా! అందుకే పుస్తకాలంటే నాకిష్టం!

ఫిక్షన్‌కంటే కూడా నాన్-ఫిక్షన్ చదవడం నాకు ఎక్కువ ఇష్టం. రకరకాల వాస్తవాలని తెలియచెప్పి, నాక్కనబడని చరిత్రనీ, జీవితాల్నీ పరిచయం చేస్తాయి ఈ పుస్తకాలు. నేను చదివిన పుస్తకాల పరిచయం - చాలా సంక్షిప్తంగా - ఇక్కడ:

1) Never Let Me Go - Kazuo Ishiguro (2005)
ఈ పుస్తకం 2005 బుకర్ ప్రైజ్ కి,  నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కల్ అవార్డ్ కి నామినేట్ అయ్యింది.

అవయవ దానం చెయ్యటానికి పెంచబడ్ద అనాథ (మూలాలు తెలీవు మనకి, పిల్లలకి కూడా) పిల్లల గురించిన కథ ఇది. ఎలా వారు తమదైన ఒక లోకంలో (స్కూల్‌లో) పెంచబడతారూ; ఎలా కేరర్స్‌గా, ఆ తరవాత డోనర్స్‌గా మారతారూ, ఈ లోపల ఆ ప్రపంచంలో జరిగే ప్రేమలూ, ప్రేమ వైఫల్యాలూ, తమ మూలాల గురించిన తపనలూ, వెతుకులాటలూ, ఆకర్షణలూ, ఆనందాలూ, స్నేహాలూ, విషాదాలూ - మనల్ని ముంచెత్తుతాయి .  అప్పుడప్పుడూ రచయిత ఆవిష్కరించే జీవిత సత్యాలూ మనల్ని ఆవరిస్తాయి. అన్నిటికంటే విషాదం, వీళ్ళ జీవితం కేవలం అవయవ దానానికే పరిమితం అవటం, అంతకు మించిన జీవితం ఉందని వీరికి తెలియకపోవటం. టీచర్లూ చెప్పరు. ఏదో ఉందని తెలుసు, అదేమిటో తెలీదు. పుస్తకం పూర్తికాగానే, జీవితం అందరూ ఆనందంగా జీవించటానికి అయినప్పుడు, కొంతమంది సమిధలుగా మారటం సమాజపు నైతికతా? అన్న ప్రశ్న మనకు రాక మానదు, మనసు భారం కాక మానదు.


2) Hourglass : Time, Memory, Marriage - Dani Shapiro (2017)‌
Memoir - ఇది రచయిత్రి తన 18 ఏళ్ళ వైవాహిక జీవితం లోని అంశాలను గురించి రాసుకున్న జ్ఞాపకాలు.

సమయంతో పాటూ వివాహ బంధంలో చోటు చేసుకునే మార్పులూ, కలిగే పరిణామాలూ, కలిసి చేసే ప్రయాణం లో ఎంత మనం పొందుతున్నాం, ఎంత మనల్ని మనం కోల్పోతున్నాం అన్న విషయాల గురించి తనదైన పద్దతిలో అతి సూక్ష్మమైన పలు అంశాలను స్పృశిస్తూ, గుర్తు తెచ్చుకుంటూ రచయిత్రి అంటారు ఒకచోట : "What must we summon and continue to summon in order to form ourselves toward, against, alongside another person for the duration? To join ourselves to the unknown? What steadfastness of spirit? What relentless faith?" ఎంతో అందంగా కనిపించే ఈ అతి ముఖ్యమైన బంధం రకరకాల పరిస్థితులని తట్టుకుని నిలబడాలంటే ఎంత మానసిక సమతుల్యత, నమ్మకం, అర్థం చేసుకునే లక్షణం, సర్దుబాటు మనస్తత్వం అవసరమో అలోచింపజేసే పుస్తకం.


3) మా నాయన బాలయ్య - వై బి సత్యనారాయణ (2013)
తన తండ్రి గురించీ తమ కుటుంబం గురించీ రచయిత వై బి సత్యనారాయణ గారు రాసిన ఆత్మకథ. ఇంగ్లీష్ నుంచి పి. సత్యవతి గారి అనువాదం.

ఒక అనూహ్యమైన జీవిత కాలపు చరిత్ర. వివక్షకు గురైన ఒక వ్యక్తి యొక్క  స్వాభిమానం, పట్టుదల, ఆత్మవిశ్వాసం, అలుపన్నది ఎరుగని ప్రయత్నం, లక్శ్యసాధనే జీవిత ధ్యేయం -  వెరసి ఒక ఉన్నతమైన లక్ష్యం - వీటన్నిటి కలబోతే ఈ పుస్తకం. జీవితంలో అత్యంత వ్యతిరేకమైన పరిస్థితులని ఎదిరించి అనుకున్నది సాధించటం ఎలా అని సాధికారికంగా చూపించిన పుస్తకం. ఒక వ్యక్తిత్వం మానవీయ విలువల కలబోతతో ఎలా పూర్ణత్వం సంపాదించుకుంది అని చెప్పే పుస్తకం. Inspiring indeed!


4) Between The World and Me  -  Ta-Nehisi Coates (2015)
నేషనల్ బుక్ అవార్డ్ ఫర్ నాన్ ఫిక్షన్ 2015 విజేత; పులిట్జర్ ప్రైజ్ ఫర్ జనరల్ నాన్ ఫిక్షన్ 2016 కి నామినేషన్.

ఇది రచయిత తన టీనేజ్ కొడుకుకి రాసిన లేఖ. అమెరికాలో ఒక నల్లజాతీయుడిగా బ్రతకటం గురించిన పుస్తకం. తన జీవితంలో కొన్ని విషయాలను తీసుకుని వాటినుంచి ఇంకా పూర్తిగా మారని ప్రస్తుతాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం.  కదిలించి, కుదించి కూలేసే పదునైన భాష రచయిత సొంతం. ఎక్కడైనా ఎవరైనా వివక్షకు గురి అవటం దారుణం. ఆఫ్రికా నుంచి తీసుకొచ్చి, అమెరికా వారసత్వం ఇచ్చి, తోటి మనిషిగా మాత్రం గుర్తించకపోవడం ఇంకా దారుణం. కేవలం తమ శరీరాన్ని రక్షించుకోవటం కొసం ఎన్ని అగచాట్లు పడాలో చెప్తూ : "Not being violent enough could cost me my body. Being too violent could cost me my body." అంటారు రచయిత. ఇంత నెగటివ్ పరిస్ఠితిలోనూ తన భావ ప్రకటనకు తనే సంకెల వేసుకోకుండా, వెరవకుండా ముందుకు నడుస్తున్న రచయితకు జోహార్లు!


5) The Fire Next Time - James Baldwin (1963)
పైన చెప్పిన Ta-Nehisi Coates పుస్తకానికి ఇది ఇన్‌స్పిరేషన్ అంటే చదివాను.

ఇందులో మొదటి భాగం - 'My Dungen Shook' - బాల్ద్విన్ తన అల్లుడికి రాసిన ఉత్తరం. చాలా నిష్కర్షగా రాసిన ఉత్తరం. నల్లవారి అణచివేత, వాటి వెనక ఉన్న తెల్లవారి రాజకీయ చతురత; దానిని మానసికంగా ఒప్పుకోకూడదూ, అలాగని సం‍యమనం వీడకూడదు అని చెప్పే రచన. భాష ఇంత తేలిగ్గా, ఇంత స్పష్టంగా, అర్థవంతంగా వాడటం చూస్తే  వీళ్ళు ఇంత అరాచక పరిస్థితుల్లో కూడా ఇంతలా ఎలా చదువుకున్నారు అని అనిపించక మానదు. ఒక నాన్-ఫిక్షన్ రచనని కూడా వదిలిపెట్టకుండా చదివింపచేసేటట్టుగా రాయటం - చాలా గొప్పవిషయం.


6) Hunger : A Memoir Of (My) Body - Roxane Gay -2017
జూన్ 2017 లో విడుదలైన ఈపుస్తకం కూడా ఒక జ్ఞాపకాల మాలిక. మెమ్‌వా (Memoir).

ఈ రచయిత్రి ప్రస్తుతపు బరువు సుమారు 400 పౌండ్లు! తన శరీరం లావుగా ఎందుకుందో, ఎందుకు అలా ఉంచుకుందో, దాని వెనక తనను హింసించే సామూహిక అత్యాచారపు నీడలు ఏమిటో, ఇవేమీ తెలియని ప్రపంచం తనని ఎన్ని ఇబ్బందులకు గురిచేసిందో మనకు చెప్తారు రచయిత్రి. జీవితపు లోతుల్లొకి వెళ్ళి, మళ్ళీ పైకి తేలిన ఒక స్త్రీ కథ ఇది. ఆత్మన్యూనత, ఆత్మాభిమానం, ప్రతి విషయం‌లోనూ, ప్రతి క్షణం వెంటాడి వేధించే ఒబేసిటీ, దానివెనక ఉన్న ఆత్మక్షోభ! పుస్తకం పొడుగునా అంతర్లీనంగా ఒక ఆశావహ దృక్పథం కనిపిస్తుంది. అవసరం అయినప్పుడు సహాయం కోరటానికి జంకకూడదనీ, మన తల్లిదండ్రుల దగ్గర మన భయాలనీ, ఆవేదనలనీ చెప్పుకోవాలనీ, సమా‌జం‌లో ఒక వ్యక్తికి ఇవ్వవలసిన గౌరవం రూపాన్ని బట్టి కాదూ వ్యక్తిత్వాన్ని బట్టి అనీ మరోసారి గుర్తు చేస్తారు రచయిత్రి.


7) Death in the Clouds - Agatha Christie
 ఆహా... ఈవిడ పుస్తకం ఏదైనా సరే కింద పెట్టలేం కదా! సీరియస్ పుస్తకాల మధ్య ఓ ఆటవిడుపు...


8) Marlena - Julie Buntin (2017)
ఇద్దరు టీనేజ్ అమ్మయిల మధ్య స్నేహం. ఇద్దరూ డ్రగ్స్‌కి బానిసలవటం, ఒకరు చనిపోవటం, వేరొకరు కష్టపడి డ్రగ్స్ నుంచి బయట పడి మామూలు జీవితం గడపటానికి చేసే కృషి. చాలా అలజడికి గురిచేసే నవల. ఎంత మంది ఈ ఉత్పాతానికి బలి అవుతున్నారో, ఎన్ని  జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయో అన్న అలజడి కలుగుతూ ఉంటుంది...

**

మరికొన్ని నెలలు సెలవుమీదే ఉంటాను కాబట్టి, ఇలాంటి పరిచయాలు మరికొన్ని నెలలపాటు మీకు తప్పవని నాకు అనిపిస్తోంది! :D