Monday, April 10, 2017

నాకు నచ్చిన పుస్తకం - “DEAR IJEAWELE, OR A FEMINIST MANIFESTO IN FIFTEEN SUGGESTIONS” By Chimamanda Ngozi Adichie.






“DEAR IJEAWELE, OR A FEMINIST MANIFESTO IN FIFTEEN SUGGESTIONS” 
By Chimamanda Ngozi Adichie. 
అడిచీ రాసిన తాజా పుస్తకం, మరో మంచిపుస్తకం! ఇంత మంచి పుస్తకం అందరూ చదివితే బావుంటుంది అనిపించింది. 

ఒక స్నేహితురాలు రచయిత్రిని, "మా అమ్మాయిని ఒక ఫెమినిస్ట్ గా ఎలా పెంచాలి?" అని అడిగిన ప్రశ్నకు ఉత్తరం రూపంలో  సమాధానమే ఈ పుస్తకం. ముందు మాటలో రచయిత్రి  అంటారు : "In response to my friend's request, I decided to write her a letter, which I hoped would be honest and practical, while also serving as a map of sorts for my own feminist thinking." 
ఇందులో నాకు నచ్చింది ఆ ప్రాక్టికల్ ఆలోచనే! 
పదిహేను సూచనలు, అరవై పేజీలు మాత్రమే ఉన్న చిన్న పుస్తకం ఇది.  ప్రింట్ పెద్దది - చదవటానికి చాలా సులువుగా ఉంది. చదువుతుంటే అడుగడుక్కీ ఆగి ఆలోచించాల్సి వస్తుంది - మనం ఎలా ఆలోచిస్తున్నాం, పిల్లలకి - ముఖ్యంగా ఆడపిల్లలకి - ఏమి నేర్పిస్తున్నాం, వాళ్ళ వ్యక్తిత్వాన్నికి ఎంత మెరుగు పెడుతున్నాం అన్న ప్రశ్నలు మనల్ని కొంత అసౌకర్యానికి గురి చేస్తాయి. మనల్ని మనం మభ్యపరుచుకోలేం కాబట్టి, ఆ అసౌకర్యం! 
ఓ ముప్ఫై నలభై ఏళ్లొచ్చాక, స్వతంత్రానుభవాల్లోంచి వ్యక్తిత్వాన్నీ, అస్తిత్వాన్నీ వెదుక్కునే శ్రమ లేకుండా, ఆడపిల్లలకి చిన్ననాటినుంచే ఆ విషయాలపట్ల సదవగాహన కల్పించడం అనేది నూతనతరం దంపతులు చేయాల్సిన పని అని కూడా అనిపించింది ఈ పుస్తకం చదివాక. 
చాలా సరళమైన భాషలో ఒక స్త్రీ జీవితానికి పనికివచ్చే ఇన్ని విషయాలను ఇంత చిన్నపుస్తకంతో చర్చలోకి తీసుకు వచ్చిన రచయిత్రి భావదారుఢ్యానికి, భాషపై ఉన్న పట్టుకీ ఆశ్చర్యం కలిగితీరాల్సిందే!
ఇది ఒక్కసారి కాదు, మళ్లీ మళ్లీ చదవాల్సిన పుస్తకం. అందరిచేతా చదివించాల్సిన పుస్తకం కూడా. 

Saturday, March 25, 2017

నాకు నచ్చిన పుస్తకం - ' We Should All be Feminists' by Chimamanda Ngozi Adichie.








“....I would like today to ask that we should begin to dream about and plan for a different world. A fairer world. A world of happier men and happier women who are truer to themselves. And this is how we start: we must raise our daughters differently. We must also raise our sons differently.” - Chimamanda Ngozi Adichie.

సెలవు రొజున ఇంత మంచి పుస్తకం అమెజాన్ వారి పుణ్యమా అని అందటం, ఎంత ఆనందం! పుస్తకం చదువుతూ నచ్చిన వాక్యాలను మార్క్ చేద్దామంటే, పుస్తకం అంతా మార్క్ చెయ్యాల్సి వచ్చేలా ఉంది. ఫెమినిజం గురించి, స్త్రీ సంపూర్ణ వ్యక్తిలా జీవించాల్సిన అవసరం గురించి, అలా జీవించటానికి కావలసిన అవగాహన, సామాజిక మార్పుగురించి ఇంత సరళంగా, ప్రాక్టికల్ గా యాభై పేజీల్లో రాయటం ఈవిడకే చెల్లింది!! ఈ మార్పు సాధించాలంటే పిల్లల్ని పెంచే పద్దతి మారాలి అంటారు రచయిత్రి. పిల్లలూ పెద్దలూ అందరూ చదవాల్సిన పుస్తకం ఇది!!

Kudos to "Chimamanda Ngozi Adichie" for such a wonderful book.



Tuesday, December 20, 2016

ఆటమ్ రంగులు....



ఆటమ్  గురించి, అప్పుడు కనబడే  రంగుల గురించీ ఎప్పుడూ వినటమే, లేక ఫొటోల్లో చూడటమే!! ఇప్పుడు ఇలా చూస్తుంటే: "నేనే ఇంత అందమైన బాటల వెంట నడుస్తున్నానా ?" అని ఆశ్చర్యం కలుగుతుంది.   

నక్షత్రాల్లాంటి ఎరుపు గులాబీల కలనేతలో ఉన్న మేపుల్ చెట్టు ఆకులు - పచ్చటి చెట్ల మధ్య  అదో అందం. విలక్షణమైన రంగుతో అలరారుతూ ఉంటుంది మేపుల్ చెట్టు. ఆస్వాదించటానికి కళ్ళతో పాటూ మనసు, హృదయం కూడా ఉండాలి!!   







నెలక్రితం పచ్చటి ఆకులు - ఇప్పుడు వర్ణాలు మారి లేత పసుపు నుంచి, బంగారు రంగులోకి, లేత ఎరుపు గులాబీ కలిసిన రంగులోకి, ఇటిక రంగులోకి మారితే, ఆ చెట్టుని చూడాల్సిందే! వివిధ వర్ణాల ఆకులతో  చెట్టు హరివిల్లై కళకళలాడుతుంది. ఇక్కడ  ఇప్పుడు ఎటు చూసినా ఈ శరత్కాల శోభే!!


మార్పు అందంగా ఉంటుంది సుమా, అని ఒక జీవిత సత్యం చెప్పకనే చెప్తున్నట్టు ఉంటుంది ఈ ఆటమ్ సీజన్. ఇవాళ పలు వర్ణాలు, రేపు బోసిపోయిన కొమ్మలు, కొంచం ఆగితే - కొత్త చిగుళ్ళూ!! ప్రతి మార్పుతో ఒకటి కోల్పోయి మరొకటి పొందుతాము, మళ్ళీమళ్ళీ చివురిస్తాము సుమా అనే సత్యం మనకు తెయపరుస్తున్నట్టు; చెట్లు పలు వర్ణాలై, మనకు ఈ సత్యాన్ని గుర్తు చేసే పనిని  అవిశ్రాంతంగా చేస్తూనే ఉంటాయి. మనసు తలుపులు కొంచం తీసి వింటేనే కదా, దాని భాష మనకు అర్ధమయ్యెది?






చిన్న గాలి తెమ్మెర వస్తే చాలు, మబ్బు  చినుకుల్ని రాల్చినట్టు, చెట్టు ఆకుల్ని రాలుస్తుంది. జలజలా రాలిపడుతున్న ఆకుల్ని చూస్తే అనుమానం వస్తుంది, చెట్టుకు, కొమ్మకి ఇప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది అని. నేల రంగురంగుల తివాచీ పరిచినట్టు దర్జాగా ఉంటుంది. అసలే చలికాలం కదా, నేలకు చెట్లు దుప్పటి కప్పుతున్నాయా? ఏమో? వాటి మధ్య ఎలాంటి అనుబంధం ఉందో మన చిన్ని బుర్రలకి ఏమర్ధమవుతుంది?


మెత్తగా కొమ్మనుంచి విడిపోయి సుతారంగా, అలవోకగా  నేలను చేరుతున్న ఆకులను చూస్తుంటే ఎంత బావుంటుందో? మన మనసుల్లో ఉన్న గతం / భవిష్యత్తు తాలుకు అనవసర ఆలోచనలు, ఆందోళనలు, కల్మషాలూ, భయాలు, మనల్ని వెనక్కు లాగే ఆలోచనలు, అశాంతికి గురిచేసే ఆలోచనలు; అన్నీ అన్నీ ఈ ఆటమ్ ఆకులలాగా, ఇంతే సున్నితంగా, సులభంగా మన మనసు పొరలలోనుంచి రాలిపోయి, మనసు కడిగిన ముత్యమై చివురించినట్టు అనిపిస్తుంది. ఈ క్షణం ఘనీభవించినట్టు, మనం వర్తమానం లో మిగిలిపోయినట్టు - నిర్మలంగా, తేటగా, హాయిగా - కాలం ఒక్క క్షణం ఆగుతుంది మనల్ని మనకు గుర్తు చేస్తున్నట్టు.