జీవితంతో నిత్యపోరాటం చేస్తూ అలసిపోయిందని ఆమెను చూడగానే తెలిసిపోతుంది. కళ్లల్లో ఆ అలసట కనిపిస్తూనే ఉంటుంది. ఆమె కట్టుకున్న చీర రంగు తెలీనంతగా వెలిసి, ముతగ్గా లెక్కలేనన్ని ముడతలలోకీ అతుకులలోకీ ఒదిగిపోయింది - ముఖం మీద పడుతున్న ముడతలతో, కళ్లల్లో నిండిన అలసటతో, ఆమె అరవై ఏళ్ల జీవితంతో పోటీపడుతున్నట్టు. ఆమెలోని మరో మనిషి తొంగిచూస్తున్నట్టు ఆ కళ్లల్లో ఒక చిన్న వెలుగు - కష్టాలు మనుషులకి కాక మానులకా వస్తాయి అన్న సహజమైన ఒప్పుకోలు తాలూకు వెలుగు కాబోలు - ప్రకాశిస్తూనే ఉంటుంది ఎప్పుడూ. నిరాశా నిస్పృహలకు తావులేదన్నట్టు కనిపించే ఆ చిరువెలుగే ఆమెలో నన్నాకట్టుకునేది. మా బాంకు పక్కనే ఉన్న బస్తీలో ఉండే ఆమె, ఆమె స్నేహితులూ ఇప్పటికి పదిహేను రోజులనుంచీ పెన్షన్ కోసం బాంకు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. పింఛను జమ అయ్యిందా అని అడగటం, ఇంకా లేదమ్మా అని నేను చెప్పడంతో, కాస్త దూరంలో చెట్టుకింద ఉన్న రాతిబండపై వాళ్లంతా కూర్చుని తోచినంతసేపు కబుర్లు చెప్పుకుని వెళ్ళిపోవటం మా అందరికీ అలవాటైపోయింది.
ఈ వేళ మరీకొంచెం అలసినట్టు అనిపిస్తున్న ఆమె ఇంకొక స్నేహితురాలిని తోడుపెట్టుకుని వచ్చింది. పింఛను ఇంకా జమ కాలేదని తెలిసి నీరసంగా నన్నే చూస్తూ నిలబడింది ఏం చేయాలో తోచనట్టు. హైదరాబాదు మే ఎండలు. ఏసీలో కూర్చున్న మేమే ఉక్కపోతగా ఉందనుకుంటున్న మిట్టమధ్యాహ్నం.
ఆమెతో మాటకలుపుతూ “భోజనం అయ్యిందా అమ్మా? పెన్షన్ ఈ పాటికి రావాల్సింది, ఎందుకింత ఆలస్యం అయిందో?” అన్నాను.
నువ్వేంజేస్తవ్ తల్లీ, మళ్లొస్త. పింఛనొస్తే బియ్యం దెచ్చుకోవాలే అనుకున్న. ఊపిరి ఒప్పినంతకాలం పన్జేసినా బిడ్డా, ఇప్పుడు ఇళ్లల్ల పనిజేసుడు నాకైతలేత్తల్లి. మా మొగాయన ఉన్నన్ని రోజులు నన్నుగొట్టి ఆ నాలుగు పైసల్ దీస్కపొయ్యేటోడు, గిప్పుడాయనే లేడు. నాతోనున్న నా ఇరవై ఏండ్ల కొడుకు బేకార్గా తిరుగతా నే పెడితే తింటడు, లేదంటే పంటడు, గంతేగానీ పనైతే చెయ్యడు. పెద్ద కొడుకు, కోడలు ఇంట్లకి రానియ్యరు – మీకు బువ్వ పెట్టుడు మాకైతలేదనవట్టిరి. ఈ పింఛనే దిక్కు. జర బుక్కులో డబ్బులేమన్న ఉన్నయ్యేమో చూస్తవా, పాస్బుక్ తీసిచ్చిందామె. అందులో ఏమీ లేవని నాకు తెలుసు, ఆమెకూ తెలుసు. కానీ ఆమె కోసం మరోసారి చూసి అదే మాట చెప్పాను. ఆమె బాధలు కొత్తవనీ కాదూ, నేనెప్పుడూ వినలేదనీ కాదు. కానీ ఆమె కళ్లల్లో మినుకుమనే వెలుగు, కనిపించే ధైర్యం, శాంతం నన్నెప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. తనగురించి చెప్పుకున్న క్షణంమాత్రం ఆమె కళ్లు తడిబారినయ్, పాస్బుక్ ఇస్తున్న నాచేతులు పట్టుకుని, ఎంత మంచిగ నవ్వుతూ మాట్లాడతవ్ బిడ్డా. తిన్నవా, పన్నవా, పానం బాగుందా అని అడగబడ్తవ్. ఆమె కళ్లల్లో నీళ్లు. పక్కనే ఉన్నామె ఈమె భుజంమీద చెయ్యేసి, “అదేందక్కో కంటెంబడి నీళ్లు? నీకు మేం లేమా, మా ఇంట్ల బువ్వతిందు నడువ్. నువ్వు వేరు నేను వేరా అక్కా? బాంకమ్మను ఎందుకు సతాయించుడు. ఆమెకసలే ఫుల్లు పనుంటది, మన కష్టాలెందుకు చెప్పుడు?” అంది.
ఆమె నా చేయి వదల్లేదు. చెమటతో చల్లగా ఉన్న ఆమె చేతుల్లో ఆత్మీయత తెలుస్తూనే ఉంది. నాలో ఏవో ప్రశ్నలు. వాటికి సమాధానమా అన్నట్టు ఆమె అంది: “పోన్లే బిడ్డా, ఇయ్యాల గాకపోతే పింఛను రేపొస్తది తియ్. ఈడికొస్తే నువ్వు మంచిగ పలకరిస్తవ్, పానానికి మంచిగనిపిస్తది. ఇగో ఈ లచ్మికి నా గురించే ఎప్పుడూ ఆలోచన. ఇసుమంటోళ్లు నలుగురుంటే సాలు తల్లీ. కష్టాలుంటయ్ అందరికీ - నీకులేవా, ఈ లచ్మికి లేవా? ఉన్న నాలుగు దినాలు నవ్వుకుంట బతికితె సాలనిపిస్తది బిడ్డా. మనం దినాలే ఇంకొకరికి పెట్టాలే, ఏడుస్తె ఏమొస్తత్తల్లి? గరీబుదాన్ని, సదువులేనిదాన్ని ఏమనుకోకు నాలెక్కంత చెప్పిన నీకు, వస్తా బిడ్డా,” అంటూ బయల్దేరిన ఆమెను చూస్తూ ఉండిపోయాను.
నా కళ్లల్లోనూ చెమరింతతో కూడిన వెలుగు.