Wednesday, July 25, 2018

కొత్త చివుళ్ళు!




రాతినేలను చీల్చుకుంటూ వస్తోంది ఈ మొక్క.
ఏ చినుకు తడి తగిలిందో? ఏ వెలుతురు రేఖ సోకిందో?

తనున్న పరిస్థితిని ఎదిరిస్తూ చివుళ్ళు వేస్తున్న ఈ మొక్క,
మన అంతఃశక్తిని మనకు గుర్తుచేస్తున్నట్టూ,
మనలోని ఛైతన్యాన్ని వెలిగిస్తున్నట్టూ ఉంది.
మనం మర్చిపోయిన అద్భుతాన్ని - మనలోని మనల్ని,
తిరిగి మళ్ళీ మనకు పరిచయం చేస్తున్నట్టు ఉంది.

మనసు ఉంటే మార్గం ఉంటుంది,
ఎదగటానికి, కలలను సాకారం చేసుకోటానికి,
చైతన్యంతో బ్రతకటానికి, మనిషిలా మిగలటానికి,
అని చెప్తున్నట్టే ఉంది!!

******************************************************************************

రకరకాల పరిస్థితులకి లొంగొపొయ్యి మనం సాధించాలీ అనుకున్నది సాధింలేకపోవటం ఒకెత్తు.
అసలు మనం కన్న కలలని మర్చిపోవటం ఇంకొకెత్తు. కారణాలు ఏవైనా కావొచ్చు. కొంతమంది ఇలా ఉంటే, మరికొంతమంది మాత్రం తమ కలని పొదివి పట్టుకుని, కష్టంలో దాచిపెట్టుకుని, వీలైనప్పుడల్లా, కాదు కాదు వీలు చేసుకుంటూ, సమయం సంపాదించుకుంటూ  దాని మీద దృష్టి పెట్టి అనుకున్నది సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అనుకున్నది సాధిస్తూ ఉంటారు. అలాంటి ఒక అసాధారణమైన వ్యక్తి  "ఫ్రెడెరిక్  డగ్లస్".

అమెరికాలో నల్లజాతీయుల స్వేచ్చకి పునాది వేసిన వారిలో అతి ముఖ్యుడైన  ఫ్రెడెరిక్  డగ్లస్ పుట్టింది మాత్రం బానిసత్వంలోనే. చదవటం రాయటం బానిసలకు నిషిద్దమైన ఆ కాలంలో, ఒక బానిస విద్యను అభ్యసించటం అన్నది  తేలిక విషయం కాదు. అసలు అలాంటి ప్రయత్నానికే చాలా పెద్ద  శిక్షలు ఉంటాయని తెలిసీ,  చదవటం రాయటం ఆయన ఎలా నేర్చుకున్నారు? దాని వెనక ఉన్న అలోచనా, తపనా, కృషీ ఎలాంటివి? బానిసత్వం నుంచి ఆయన ఎలా బయట పడ్డారు? తను పుట్టి పెరిగిన పరిస్థితులను అధిగమించి ఒక జాతికీ, దేశానికి దిశానిర్దేశం చేసే స్థితికి ఆయన ఎలా ఎదిగారు? ఆత్మస్థైర్యం  అంటే ఏమిటి? తనని ద్వేషించిన మనుషుల్ని క్షమించి, ప్రేమించటం ఎలా నేర్చుకున్నారు? మానవత్వం, విలువలు ఎలా నిలుపుకున్నారు? తనని తను ఒక మనిషిలా ఎలా మలుచుకున్నారు?

ఆయన స్వీయచరిత్ర "Narrative Of The Life of Frederick Douglass" చదివితే ఈ  ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. అంతేకాదు, మన అంతఃశక్తిని మనం గుర్తించాలీ అన్న ఒక అలోచన, నేర్చుకోవలసింది ఏంతో ఉంది అన్న ఒక వినమ్రత కలుగుతుంది. జీవితం పట్ల గౌరవం పెరుగుతుంది.

ఆలోచనను ప్రేరేపించే ఈ పుస్తకం చదవాల్సిన పుస్తకాలలో ముందు స్థానంలో ఉంటుంది.

******************************************************************************


మంచి పుస్తకాలూ, ప్రేరణని ఇచ్చే విషయాలూ (ప్రసంగాలూ, ఇంటర్వ్యూలూ) పంచుకుందామని ఈ ప్రయత్నం. వీలువెంట ..కాదుకాదు, వీలూ - సమయం చేసుకుని త్వరలో మరో పోస్ట్😀






Wednesday, July 11, 2018

నాకు నచ్చిన కొటేషన్స్!


కొన్ని పుస్తకాలు మనకి మనకు తెలిసిన నిజాల్ని మరోసారి మనసులో నాటుకునేలా గుర్తుచెస్తాయి! ఇలా మనం ఉండగలిగితే బావుండు అనిపిస్తాయి. 





తాము నమ్ముకున్న భూమినీ, అసలు ఆమాటకొస్తే తమవి అనుకున్న అన్నీంటినీ వదిలిపెట్టి, తరిమేయబడి ఒక్లహోమా నుంచి కాలిఫొర్నియా బయలుదేరిన కుటుంబం.  గతం తుడిచిపెట్టుకుపోయింది. ఆశ తప్ప మరే ఆసరా లేని భవిష్యత్తు. కాస్త సామాను, అంతకంటే తక్కువ  డబ్బు చేతిలో - తమకంటూ మిగిలింది అంతే. కాలిఫొర్నియాలో బోలెడన్ని ఉద్యోగాలు ఉన్నాయి, హాయిగా జీవించవచ్చు అన్న నమ్మకంతో  బయలుదేరిన వారికి కాలిఫోర్నియా నుంచి తిరిగివస్తున్న ఒక వ్యక్తి , మీరు ఊహించినవేవీ అక్కడ లేవనీ, అక్కడ దుర్భరమైన జీవితాలు గడపాల్సి వస్తుందనీ అందుకే తను తిరిగి వెళ్ళిపోతున్నాననీ చెప్పటం కలవరపెడుతుంది. అదే సమయంలో టాం (ప్రయాణిస్తున్న కుటుంబంలో ఒక వ్యక్తి) విరిగిపోయిన కారు బేరింగు ఎలా మార్చాలా, ప్రయాణాన్ని వీలైనంత త్వరగా ఎలా సాగించాలా అని అలోచిస్తూ ఉంటాడు. తమకు తారసపడిన వ్యక్తి  చెప్పింది నిజమా కాదా,  కాలిఫోర్నియాలో ఉద్యోగాలు ఉన్నాయా లేవా, అక్కడికి చేరాక మన పరిస్థితి ఏమిటీ అని భవిష్యత్తు గురించి బెంగతో సాగుతున్న చర్చకు తెర వేస్తూ, పై మాట అంటాడు టాం. ఇప్పుడు కారు బేరింగ్ విరిగిపోతుందని మనం అనుకున్నామా? లేదే. అసలు అలాంటి అనుమానం రాలేదు కాబట్టే మనం వర్రీ కాకుండా ప్రయాణం సాగించాం. ఇప్పుడు ప్రయాణం కొనసాగించాలంటే  విరిగిపోయిన బేరింగ్ ని  రిప్లేస్ చెయ్యాలి. చేస్తాం. జీవితంలో అన్ని విషయాలకూ ఇది వర్తిస్తుంది. సమస్య వస్తుందని ముందే ఊహించుకుని వర్రీ అవుతూ ఉండటం కంటే సమస్య వచ్చినప్పుడు ఫిక్స్ చేసుకోటమే సరి అయిన పద్దతి అని అతను చెప్పిన తీరు బావుంది. 

నిజం! అనవసర ఆందోళనలూ, భయాలూ, చింతలూ వదిలేస్తే మన మనసును మనం క్లీన్ చేసుకున్నట్టే! ఇప్పటి క్షణం హాయిగా, నిజంగా బ్రతికినట్టే!