Monday, March 5, 2018

ఆటిజం: అవ్యక్త అంతస్సంఘర్షణలు





 అందరూ తమని దుష్టులుగా ఎందుకు చూస్తారో అర్థంకాక బాధపడుతూ కూచున్న నల్లకాకికి, ఒక తెల్లపావురం కనిపించింది. 
దోవ ఎక్కడికి వెళ్తుంది?” అని అడిగింది పావురం, దిగులుగా.
ఎందుకంత దిగులుగా ఉన్నావ్?” అడిగింది నల్లకాకి. 
ఎప్పటినుంచో శాంతి, సంతోషం కోసం వెతుకుతున్నాను. వాటిని చేరుకునే దారి తెలియటం లేదు, పైగా నేను శాంతికి ప్రతీకను కూడా...” 
ఇంత చక్కగా ఉండి, అందరి అభిమానాన్నీ పొందిన పావురానికి శాంతి, సంతోషం లేకపోవటం ఏమిటి? అనుకుంది కాకి. “అన్ని దారులూ ఒకచోట కలుస్తాయి కదా?” అంది. 
పావురం తెల్లబోయింది. “అంటే నేను ఇన్నిరోజులూ శాంతి సంతోషాల కోసం వెతుకుతున్న దారి, నేను ప్రయాణిస్తున్న దారి ఒకటేనన్నమాట,” అని సంతోషంతో ఎగిరిపోయింది. 
నల్లకాకికూడా అకాశంలోకి ఎగిరిపోయింది. ఆకాశపు నీలిమకు ఎదురుగా నల్లకాకి, తెల్లపావురంలాగా అందంగా సంపూర్ణంగా ఉంది!
ప్రతి ఒక్కరూ అన్వేషించే శాంతి గురించి సరళంగా చెప్పిన కథ, నయోకి హిగషీడ అనే జాపనీస్ రచయిత రచించిన రీజన్ జంప్” (2013) అన్న పుస్తకంలోది. ఇదీ, అతనే రాసిన మరో పుస్తకంఫాల్ డౌన్ సెవెన్ టైమ్స్ గెట్ అప్ ఎయిట్”(2017) - రెండూ రచయిత జీవితచిత్రాలే (Memoirs). అయితే: ఏమిటీ పుస్తకాల ప్రత్యేకత?
*****
ఆటిజం. 
దీని గురించి మనం వింటూనే ఉంటాం. సమస్య ఉన్న పిల్లలు సరిగ్గా మాట్లాడలేకపోవటం, నలుగురితో కలవలేకపోవటం, తలకొట్టుకోవటంలాంటివి చేయడం గమనిస్తుంటాం. ఆటిజం గురించి ఎన్నో పుస్తకాలు ఉండగా పై పుస్తకాల ప్రత్యేకత ఏమిటీ అంటే, వీటిని రచించిన హిగషీడ తన ఐదేళ్ళ వయసునుంచీ ఆటిజం సమస్యను ఎదుర్కుంటున్న వ్యక్తి కావటమే! అతనికి ఉన్న ఆటిజం సమస్య తీవ్రమైనదే కాదు, భావవ్యక్తీకరణకు సంబంధించినది కూడా, “సివియర్ అండ్ నాన్ వర్బల్అన్నారు డాక్టర్లు. ఆటిజం సమస్య ఉన్న వ్యక్తి రాసిన పుస్తకాలు కాబట్టి, సమస్యలనీ, సంఘర్షణలనీ, వారి ఆంతరంగిక జీవితాలని మరింత అర్థం చేసుకునే వీలుని కల్పిస్తాయి. 
భావవ్యక్తీకరణే ప్రధాన సమస్య అయినప్పుడు, దానిని అధిగమించి ఇతను రచనలు ఎలా చేస్తున్నారూ అన్న కుతూహలం సహజంగా కలుగుతుంది. ఆల్ఫబెట్ గ్రిడ్ అంటే ఏమిటీ, ఆటిజం సమస్య వల్ల ఎదురయ్యే రోజూవారీ సమస్యలు ఏమిటీ, రచయితను నిరంతరం నడిపిస్తున్న  ప్రేరణాశక్తి ఏమిటీ, తనకున్న వైకల్యాన్ని లేక దుర్బలత్వాన్ని అతను తన బలంగా ఎలా మలుచుకున్నాడూ అన్న విషయాలు పుస్తకాలలో విపులంగా రాయబడ్డాయి. పుస్తకాలు దాదాపు ముప్పై  ప్రపంచభాషలలోకి అనువదింప బడ్డాయి. 
*****
హిగషీడ తన పదమూడేళ్ళ వయసులో రాసిన పుస్తకం రీజన్ జంప్”. ఆటిజం ఉన్న పిల్లలు చిత్రమైన శబ్దాలు చెయ్యటం, మంకుపట్టు పట్టటం, చేతులూ వేళ్ళూ విపరీతంగా కదల్చటం, ఉన్నట్టుండి ఏడవటం- ఇలాంటివన్నీ ఎందుకు చేస్తారు? వారి మనసులో ఏముంది? అన్న విషయాల గురించి యాభై ఎనిమిది ప్రశ్నలూ, వాటికి రచయిత ఇచ్చిన సమాధానాల కూర్పే పుస్తకం. సమాధానాలు క్లుప్తంగా, సూటిగా ఉండటంతోబాటు చిరుకవితలూ, సున్నితమైన హాస్యమూ పుస్తకంలోని అదనపు ఆకర్షణలు. పోరాటం కనిపిస్తుంది తప్ప ఎక్కడా నిరాశ కనిపించదు. హిగషీడ భావుకత, లోతైన ఆలోచన మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. 
మీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారా అన్న ప్రశ్నకి సమాధానమిస్తూ, తమకు అందరితో కలిసి ఉండాలని ఉంటుందనీ, తమ ప్రవర్తన ఇతరులకి ఇబ్బంది కలిగిస్తుందేమో అన్న అనుమానం కొద్దీ తమపాటికి తాము ఒంటరిగా ఉంటామనీ, అది చూసి తాము ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతామని అనుకోవడం సరికాదని అంటారు రచయిత. 
ఆటిజం ఉన్నవారందరి సమస్యలూ ఒకేలా ఉండవనీ, అందువల్ల పుస్తకంలోని తన సమాధానాలు ఆటిజం ఉన్న అందరికీ ఒకేలా అన్వయించలేమని అంటారు రచయిత. సమస్యలలో తేడాలున్నప్పటికీ, వాటిని పలుకోణాల్లో పాఠకులకి చూపిస్తుంది పుస్తకం.
*****
ఫాల్ డౌన్ సెవెన్ టైమ్స్ గెట్ అప్ ఎయిట్ అనే రెండో పుస్తకం- రచయిత తన ఇరవైలలో రాసింది.  ఎన్నిసార్లు ఓటమి ఎదురైనా మళ్ళీ లేచి గెలిచే ప్రయత్నం చెయ్యాలన్న జాపనీస్ సామెత పుస్తకశీర్షికకి స్ఫూర్తి. విషయం క్లిష్టమైనదైనా, దాన్ని చిన్నచిన్న అధ్యాయాలుగా, సరళంగా రచయిత చెబుతాడు. ఇంత భావగర్భితంగా, కవితాత్మకంగా సివియర్ ఆటిజం సమస్య ఉన్న వ్యక్తి రాయటం అన్నది సంభవమేనా అని పలుచర్చలు జరిగాయి కూడా. ఇందులో అతను రాసిన కవితలు- ఫ్లయింగ్, రూమర్స్, వర్డ్స్, ప్రాసెస్ లాంటివి- గంభీరంగా ఉంటే, ‘ జర్నీ  అన్న కథ భిన్నతరాలను స్పృశిస్తూ, పొరలుపొరలుగా చుట్టుకుంటూ విడిపోతూ, లావాలా ఉప్పొంగి, చివరికి ప్రశాంత గంభీరనదిలా ముగుస్తుంది. అనుబంధాలూ, మెమరీ, వాస్తవికత, మానవసంఘర్షణ ఇంత చిన్నకథలో ప్రదర్శించడం షాక్ కలిగిస్తుంది. 
మధ్య ఇంట్లో దింపిన నా హెల్పర్ కిథాంక్యూ వెరీ మచ్అని చెప్పాలని అనుకుంటూనే, ‘హావ్ నైస్ డేఅన్న మాటలు అప్రయత్నంగా వచ్చేసాయి. 
థాంక్స్ అని చెప్పాలనుకోగానే నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. చెప్పాలనుకున్నది గుర్తు రాలేదు. తలొంచుకున్నాను. నా హెల్పర్ కాలిచెప్పులు కనిపించాయి. పొద్దున్న నాన్న చెప్పులేసుకుని బయటికి వెళ్తున్నప్పుడు ఆయనకు చెప్పినహావ్ నైస్ డేఅన్న మాటలు  గుర్తొచ్చాయి.  అయోమయంలో, అప్రయత్నంగా మాటలు అనేశాను. అప్పుడప్పుడూ ఇలాంటి సంఘటనలు నాకు ఎదురౌతూ ఉంటాయి. అసంబద్ధమైన సమాధానాలు చెప్తున్నానన్న విషయం మాట్లాడటం జరిగిపోయాక కానీ నాకు అర్థంకాదు. సమాధానం తెలిసికూడా చెప్పలేకపోవటం ఒక సమస్య అయితే, పొంతనలేని సమాధానం చెప్పటం ఇంకొక సమస్య. నేను చెప్పే మాటని నేనే నియంత్రించుకోలేకపోవటం బాధపెడుతుందిఇది పుస్తకంలో ప్రస్తావనకు వచ్చిన ఒక సందర్భం. 
గెలుపూ ఓటములను ఫలితాలను బట్టి అంచనా వేస్తారు కానీ, విజయం సాధించిన వ్యక్తే కాదు - కొండ ఎక్కలేక, నేలమీదనుంచే తదేక దీక్షతో కొండ శిఖరాన్ని చూసే వ్యక్తి అంటే కూడా నాకు గౌరవం. విజయానికి సుదూరంలో ఉన్నా, అతని కళ్ళల్లో  శిఖరపు ప్రతిబింబం కనిపిస్తూనే ఉంటుందిఅంటారు హిగషిడ  పుస్తకంలో.
డేవిడ్ మిచల్ అన్నట్టు రీజన్ జంప్పుస్తకం ఆటిజం ఉన్న పదమూడేళ్ళ పిల్లవాడు రాస్తే, ‘ఫాల్ డౌన్ సెవెన్ టైమ్స్, గెట్ అప్ ఎయిట్ఆటిజం ఉన్న ఒక రచయిత రాసింది! 
*****
డేవిడ్ మిచల్, అతని భార్య యొషీడ పుస్తకాలను ఇంగ్లీషులోకి అనువదించారు. పుస్తకాలని అందరూ చదవాలనీ, ఇవి ఆటిజం గురించి అవగాహన పెంచే పుస్తకాలు అనే దంపతుల కొడుకుకి కూడా ఆటిజం సమస్య ఉండటం గమనార్హం.

ఆలోచనాత్మకమైన పుస్తకాలు, ఆటిజం సమస్యను ఎదుర్కుంటున్న వారి మనోభావాలను గుర్తించి వారిని సరైన పద్దతిలో ప్రోత్సహిస్తూ ఆదరింగలిగిన మార్పుని సమాజంలో తీసుకురాగలిగిన శక్తివంతమైన పుస్తకాలూ కూడా. రచయిత ఆశకూడా అదే!



No comments:

Post a Comment