Monday, July 22, 2013

మన హైద్రాబాదే...బాదే...బాదే...



ఎప్పుడైనా సాయంత్రం కొంచం చీకటి పడ్డాక , ఆంటే కాస్త వెలుతురు తగ్గాక -   హైద్రాబాద్ రోడ్ల మీద ప్రయాణం చేస్తే ? అదీ కాస్త వర్షం పడిన తరవాత?

అబ్బో , విఠలాచార్య సినిమాల్లో కాంతారావు గారి  కత్తి యుద్ధాలు ఎందుకూ పనికిరావు స్మీ! అంతెందుకు, ఇప్పటి సినిమాల్లో హీరోలు టాటా సుమోల్ని ఎడం చేత్తో ఎత్తి పడేయగలరేమో గానీ, చస్తే మన గతుకుల రోడ్లమీద, గుడ్డివెల్తుర్లో సింపుల్గా ఓ బైకు నడపమనండి  చూద్దాం. బస్తీమే సవాల్ వాళ్ళ వల్ల కాదు.  వంద మంది విలన్లను ఒక్క చేత్తో కొట్టి మట్టి కరిపించ వచ్చు , కంటి చూపుతో కోట్లాదిమందిని కడతేర్చవచ్చు…. హైద్రాబాద్ రోడ్ల మీద రెండు చక్రాల బండిని అసలేదైనా బండిని,  వర్షం పడుతున్నప్పుడు చులాగ్గా, ఓర్పుగా నడపటం వాళ్ళ వల్ల అవుతుందా? ఇంపాసిబుల్!!!

మొన్నటికి మొన్న, మా పక్కింటి పిన్నిగారి వాళ్ళమ్మాయి పెళ్ళిచూపులు అయినై. పెళ్ళి చూపులకొచ్చిన అబ్బాయికి హైద్రాబాద్ రోడ్ల మీద బండి నడపటం రాదని, “ఇంకేం చాతనవు బాబూ ఐతే అని ముక్కున వేలేసుకుని ఆ సంబంధానికి  నై నై అని చెప్పేసారట.

అదేమిటి పిన్నిగారూ? అబ్బాయి ఏదో పెద్ద చదువులు చదివాడనీ, బాగా సంపాదిస్తున్నాడనీ సంబర పడ్డారుగా అంటే : ఆ ఏం సంబడం లేమ్మా, పెరటి చెట్టు వైద్యానికి పనికి రానట్టు, హైద్రాబాద్ రోడ్లమీద బండి నడపలేడట అని కరివేప ఆకును తీసేసినట్టు తీసేసింది.

అదేమిటి పిన్నీఅంటే, “నువ్వే చెప్పు లక్ష్మీ లక్షలు సంపాదించవచ్చుగాక, అబ్బాయికి తెలివిగా బండి నడపటం రాకపోతే, ఎప్పుడు ఇంటికి చేరేనూ? ఓ సరదా సబ్బుముక్క ఏమేడుస్తుందీ? సాయంత్రం అయిదింటికి బయల్దేరిన మనిషి కనీసం ఏడింటికి ఇల్లు చేరాలంటే ఎంత డ్రైవింగ్ నైపుణ్యం ఉండాలి?  అవేమీ లేకుండా మొద్దు రాచిప్ప లాగా ఈడ్చుకుంటూ పదింటికి ఇల్లు చేరితే ఓ ముద్దూ మురిపెం ఉంటుందా? లక్షలేం చేసుకుంటాం లక్ష్మీ - బొక్కుతామా? నా కూతురు రోజంతా ఎదురుచూస్తూ ఇంటో కూచోడం నాకిష్టం లేదు. మన హైద్రాబాద్ రోడ్డు మీద బండి నడపలేడు అంటే తెలివి తక్కువ దద్దమ్మ ఐనా అయుండాలి, లేక ఓర్పు లేని వాడు ఐనా అయుండాలి,” అని బల్ల గుద్ది మరీ చెప్పారు పిన్నిగారు. రాయి లాంటి బల్ల, మా తాతల నాటి బల్ల  విరిగినట్టై  ఓపక్కకు ఒరిగి పోయిందని, నువ్వూ నీ పనికిమాలిన ఇంక్విసిటీవ్ నేస్సూ  అని మా ఆయన నన్ను ఆడిపోసుకున్నారు కూడా!

అంతకు ముందు, మా ఎదురింటి కళ్యాణి ఉన్నట్టుండి లడ్డూలు పంచితే, అక్కా ఏమిటి సంగతి అని అడిగాను. ఏం లేదు లక్ష్మీ మా అమ్మాయి...

 ఏమిటి  అక్కా తను ఎవర్నో ప్రేమించింది అన్నావ్, అందరూ పెళ్ళికి ఒప్పుకున్నారా?” అని అడిగాను ఆత్రంగా.

ఛ చ...లేదు లక్ష్మీ, మా అమ్మాయే, మమ్మీ నేనిప్పుడు అతన్ని ప్రేమించట్లేదు, మీరు తెచ్చిన గుంటూరు సంబంధమే ఖాయం చేయండి అని చెప్పింది  అనింది కళ్యాణి.

అదేమిటక్కా మొన్నటిదాకా ప్రేమ ప్రేమ అని అరిచి గీ పెట్టి గొడవ చేసిందిగా?”  దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యి అరిచాను నేను. నన్నిలా అయోమయ పరిస్థితిలోకి నెట్టడానికి మీకెవరు హక్కు ఇచ్చారు అని కొంచం ఆవేదన కూడా ధ్వనించింది నా గొంతులో.

ఇంతకూ తెలిసిన విష్యం ఏమిటంటే శుభ  ప్రేమించిన రాజుకి స్కూటీ నడపటం కూడా రాదట. కారు రాకపోతే పోయే స్కూటీ కూడా రాదట ఆంటీ అని ముక్కు చీదింది శుభ. అది కాదు శుభా అదేమంత పెద్ద విషయమని? అని చెప్పబోయాను...మీకు తెలీదాంటీ ఏ సెమిస్టర్ లోనూ ఒక్క పేపర్ తప్ప పాసు కాలేదు, సర్లే బాక్ లాగ్స్ అందరికీ ఉంటాయికదా పోతేపోనీ, పిల్లాడు రవితేజా లా పోకిరీగా దబాయించి కుళ్ళు జోకులేస్తాడు, బానే ఉన్నాడు కదా అనుకున్నా, చింపిరి జుట్టు జులపాలూ ఉంటే హీరో లా ఉన్నాడు కదా అనుకున్న, బేవార్సుగా సోమరిగా తిరుగుతూ ఉంటే సరిగ్గా మన తెలుగు హీరోలాగా ఉన్నాడు కదా అని ముచ్చట పడ్డాను కానీ ఏం లాభం స్కూటీ నడపటం రాదట ఆంటీ...మళ్ళీ ముక్కు చీదుడు కార్యక్రమం మొదలుపెట్టింది శుభ. అసలు ఈ స్కూటీ గొడవెంటీ తల్లీ అని అడిగాను....

ఆంటీ మన రోడ్లు ఎలా ఉంటాయి? అడుక్కో గొయ్యి , రెండడుగులకు ఓ మూత లేని manhole అవునా? వీటి మధ్య వాన తుంపరకు తెగి పడ్డ కంకర రోడ్డు. ఈ రోడ్డు మీద బైకు నడిపితే , ఓ హీరో గుర్రపు స్వారీ చేస్తూ యుద్ధం చేస్తున్నట్టుగా, ఓ టాటా సుమోని ఎడం చేత్తో ఆపినట్టుగా, ఎంత మాన్ లీ గా ఉంటుంది? అలా విజయోత్సాహంతో ఇంటికి వస్తే ఎంత గొప్పగా ఉంటుంది. అదేమీ లేకుండా డొక్కు బస్సు ఎక్కి కాలేజీకి వస్తాడట...ఆన్ బిలీవబ్ల్...అంటూ ముక్కు ఎగ బీలుస్తూ వెళ్లిపోయింది శుభ.

నీకెందుకీ అనవసర అజలూ, వ్యాపకాలూ, హాయిగా యే  టీవీ సీరియలో చూస్కోక, అని నన్ను తిట్టిపోశారు మా ఆయన ఆ రోజు.... తలనొప్పీ, జ్వరం, పైత్యం అన్నీ వచ్చినట్టై నేను పిచ్చి చూపులు చూస్తూ కూర్చుంటే!  

ఇంతకీ విషయం ఏమిటంటే, ఇవాళ రాత్రి తొమ్మిది గంటలప్పుడు, వర్షం పడుతుంటే, మా బాల్కనీ లో నుంచుని చూస్తున్నా. రోడ్డు  మీద పిట్ట పురుగు లేదు. వర్షపు జల్లుకి ఇంటి ముందు ఉన్న చెట్లన్నీతడిసి, ఆకులన్నీ  చినుకులతో నిండిపోయి ఉన్నాయి. గుడ్డిగా వెలిగే వీధి దీపపు వెలుతురు ఆకులపైన ఉన్న చినుకుల మీద పడి ఆకులన్నీ నక్షత్రాలై. మా ఇంటి ముందు అంతా, చెట్లకి  నక్షత్రాలు పూసినట్టు ఉంది. నిశ్శబ్దం, సన్నటి వర్షం, చెట్లపైన నక్షత్రాలూ మా ఆయిన వినిపించిన అల్లదే అవతల అదిగో నా ప్రియా కుటీరా వాటిక వింటుంటే రోజూ మనం తిట్టుకునే గుడ్డి దీపాలు, వర్షంఇంత అందంగా ఉంటాయా అనిపించి, రోజూ వర్షాకాలంలో మనం ఎదుర్కునే అవస్తల గురించి సరదాగా రాయాలని అనిపించింది!!!

ప్రతి మేఘానికి ఒక మెరుపు అంచు ఉంటుందట!!!

Monday, July 15, 2013

తప్పక చదవాల్సిన కథ ..."తెగిన గొళ్ళాలు"



బమ్మిడి జగదీశ్వరరావు గారు రాసిన "తెగిన గొళ్ళాలు" కథ ముగింపు వాక్యాలివి:
"…..తలుపుల గొళ్ళాలు తెగలేదు.
కాని  ఎక్కడో మరేవో గొళ్ళాలు అవి తెగిపోయాయి. "

మనుషుల అనుబంధాల గురించి చక్కగా రాసారు ఈ కధలో .
 
అక్క చెల్లెళ్ళ మధ్య బంధం ఎంత గట్టిదోఅంతే మెత్తగా పుటుక్కుమని ఎలా తెగిపోతుందో బాగా చూపించారు.
 
రోజూ మన ఇళ్ళళ్ళో కనిపించే అతి సామాన్యమైన విషయాలే మనముందు ఉంచారు. కుటుంబ సంబంధాలుడబ్బు వల్ల కలిగే విభేదాలూ, అనురాగాలూ,ఆప్యాయతలూ ..ఇంతలోనే తెగి పోయే బంధాలు - బంధుత్వాలు. ఇంతే !
కానీ కథ చదివాక మాత్రం ఎందుకో "అయ్యో ఇలా ఎందుకయ్యింది?"  అనిపించక మానదు.
మంచి కథ కాబట్టే "రెండు దశాబ్దాలు  కథ 1990-2009" లో చోటు సంపాదించుకో గలిగింది ఈ కథ!