Thursday, August 9, 2012

Thank you God!!!

అప్పుడే చీకటిని చీల్చుకుంటూ వస్తున్న వెలుగు రేఖలు
 ఆకాశమే కాన్వాస్ గా,చిత్రలేఖనానికి  - చిత్రిక పట్టి మరీ  సిద్ధ పడుతున్నై.
తొలిపొద్దు ఆకాశం, వివిధ వర్ణాలతో కొత్తరోజుకి ఊపిరిపోస్తోంది.
సౌమ్యమైన , ఆహ్లాదకరమైన ఉషస్సు ప్రశాతంగా పలకరిస్తోంది !
ఆహా కాలమిలా ఆగిపోతే ఎంత బావుంటుంది ?


ఇంటి ముందు, ఆధునికతా చిహ్నాలుగా వేలాడుతున్న కేబుల్ తీగల మీద,
బారులు తీరిన ముత్యపు రాసుల్లాగా, కుదురుగా నిలిచిన వాన చినుకులపై ,
సూర్యకిరణాలు విస్ఫోటనం చెంది, హరివిల్లులై సప్తవర్ణాలతో విరిగిపడుతూ
శాండీలీర్ల తోరణాలను వెలిగిస్తున్నక్షణం!
 కేబుల్ తీగలు కనిపించవప్పుడు - కేవలం రసప్లావితమైన హృదయం తప్ప!
 సంచలిస్తున్న వెన్నెల తునకలు తప్ప !!


సాయం సంధ్యల సవ్వడులు , నిశిరాతిరి నిశ్శబ్దాలు,
వెన్నెల పరదాలతో చందమామ ఆటలు ,
విరబూసిన పూవులు,
ఎలుగెత్తి పాడే సముద్ర తరంగాలు,
రారమ్మని పిలిచే  నగశిఖాలు ....
 ప్రకృతి  అందాలన్నీ,
మనసుతో  చూడగలగటం,
ఆ  అనంత రాగాల్ని,
మనసుతో వినగలగటం,
ప్రకృతిలో తల్లీనమవగలగటం ,
అది క్షణకాలమైనా సరే -
ఎంత అదృష్టం ???